హిమగిరుల సోయగాలతో ప్రయాణమే ఒక అద్భుతం, అదే నేపాల్ ప్రత్యేకత!
x

హిమగిరుల సోయగాలతో ప్రయాణమే ఒక అద్భుతం, అదే నేపాల్ ప్రత్యేకత!

నేపాల్ మహిళలు బలంగా, తెలివిగా ధైర్యంగా కనిపించారు. టూర్ తర్వాత మనసు ప్రశాంతంగా ఉందని, ఆ విశేషాలని రచయిత్రి గిరిజ కళ్ళకి కట్టినట్టు చెప్పారు.. కాదు చూపించారు.


2022 సెప్టెంబర్ లోనే నేపాల్ వెళ్ళాల్సింది. అప్పుడు అక్కడి వరదల కారణంగా విరమించుకోవాల్సి వచ్చింది. రెండేళ్ల తరువాత మళ్ళీ ఇప్పుడు నేపాల్ ప్రయాణం సానుకూలపడింది. 24 మంది బృందం నేపాల్ వెళ్ళడానికి 22 ఏప్రిల్ న ఎయిర్ పోర్టు లో కలుసుకున్నాము. అందులో ఇద్దరం మాత్రమే హైదరాబాద్ వాళ్ళం. ఒకరు తిరుపతి, ఇద్దరు వైజాగ్ నుంచి వచ్చారు. మిగతా అందరూ కర్నూల్ వాళ్ళు. ఐదుగురు మాత్రమే మగవాళ్ళు. ముందుగా మా ప్రయాణం గోరఖ్ పూర్ కి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నేపాల్ కి. గోరఖ్ పూర్ లో మా విమానం మధ్యాహ్నం ఒకటిన్నరకు ల్యాండ్ అయింది. భయంకరమైన ఎండ. ఆ ఎయిర్పోర్ట్ చాలా చిన్నది కావడం వల్ల లగేజీ బెల్టు దగ్గరికి వెళ్లడానికి ఎలాంటి వాహన సౌకర్యం లేదు. ఆ ఎండలో అందరం పరుగు లాంటి నడకతో బెల్టు దగ్గరికి చేరుకున్నాము. రద్దీ ఎక్కువగా ఉంది. లగేజ్ తీసుకుని బయటకు వచ్చేసరికి మాకోసం ఏర్పాటు చేసిన మినీ ఏసీ బస్ సిద్ధంగా ఉంది. భోజన విరామం తీసుకోకుండా ప్యాక్ చేసి ఇచ్చిన లంచ్ బాక్సులు తినేసి, గోరఖ్ నాథ్ టెంపుల్ చేరుకున్నాము. అక్కడి నుంచి సోనౌలీకి మా ప్రయాణం. 95 కి.మీ.లు. ఘాట్ రోడ్డు కావడం, ఇమ్మిగ్రేషన్ కార్యక్రమాలు ముగించుకుని హోటల్ చేరుకునేసరికి రాత్రి ఏడు గంటలైంది.


23వ తేదీ ఉదయం అల్పాహారం ముగించుకొని జనకపురికి మా ప్రయాణం మొదలైంది. తొమ్మిది గంటల ప్రయాణం. కానీ మేము అక్కడికి చేరేసరికి దాదాపు చీకటి పడింది. భోజన విరామం, ప్రాకృతిక అవసరాలకు విరామం, టీ విరామం లాంటివి ఆలస్యానికి హేతువులు. రాత్రి జనకపురిలో బస. ఇది దక్షిణ మధ్య నేపాల్ లోని టేరాయ్ మైదానంలో ఉంది. మైదాన ప్రాంతం కావడం వల్ల ఎండ తీవ్రత చాలానే ఉంది. ఇది సీతాదేవి జన్మస్థలంగా ప్రతీతి. జనక్ మహల్ లోకి ఇంకా ప్రవేశం మొదలు కానందువల్ల మేము మొదట జానకి కళ్యాణ మండపం చూసి, జనక మహల్ లోకి వెళ్లాము. దీనిని క్రీ.శ 1910 లో రాణి వృషభాను నిర్మించింది. 256 అడుగుల ఎత్తుతో మూడంతస్తుల భవనం. మధుబని చిత్రాలతో రామాయణ కథ గోడలపై అందంగా చిత్రించబడి ఉంది. విగ్రహాలు కూడా చాలా చిన్నవి. హారతి సమయంలో తొక్కిసలాట, విలువైన వస్తువులను జాగ్రత్త చేసుకోవడం షరా మామూలే. అక్కడి నుంచి బయలుదేరి స్థానికంగా ఉన్న కొన్ని ఆలయాలు, ధనుష్కుండ్ చూసాము. రాముడు శివధనుర్భంగం చేసినప్పుడు ఒక ముక్క సమీపంలోని తటాకంలో పడిందట. అందుకే దానిని ధనుష్కుండ్ అని పిలుస్తారని స్థానికులు చెప్పారు.

జనక్ పూర్ ధామ్, తీర్థ్ కుండ్


24 వ తేదీ ఉదయం అక్కడి నుంచి ఖాట్మండుకు ప్రయాణమయ్యాము. 225 కి.మీ.లు. తొమ్మిది గంటల ప్రయాణం. ఖాట్మండు చేరేదాకా ఎండ తీవ్రత బాగానే ఉంది. బూడిద రంగు ధూళి. నునుపైన గుండ్రటి రాళ్లు రోడ్డుకు ఇరువైపులా పెట్టెలు పెట్టినట్లుగా పేర్చబడి ఉన్నాయి. ప్రకృతి వర్ణాలలో ఇదొక వింత శోభ. మహిళలు ఎక్కడ ఉంటే అక్కడ సందడి, కోలాహలం సహజంగానే ఉంటుంది. ఈ ప్రయాణంలో కూడా మహిళలు ఎక్కువ మంది ఉండడం వల్ల ప్రయాణం బోర్ అనిపించలేదు. అంత్యాక్షరి ఆటలు, పాటలు, డాన్సులు, జోకులతో కాలక్షేపం చేశాము. కర్నూలు నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉండడం వల్ల భోజన, టీ విరామ సమయాలలో రాయలసీమ సంస్కృతి, సంప్రదాయాలు, భాషా విశేషాలు వివరంగా తెలుసుకోవడానికి వీలైంది.


ముఖ్యంగా ఆ మహిళలు చాలా సహజంగా ప్రయోగించే మూతతల కట్టే... లాంటి సజీవమైన జాతీయాలు, సామెతలు నన్ను అబ్బురపరిచాయి. ఇక ప్రయాణ సమయంలో పక్కన కూర్చున్న మహిళల అంతరంగాల్లోకి తొంగి చూసినప్పుడు లోన కన్నీటి కడవలను మోస్తూ పైకి ఎంత సంతోషంగా ఉన్నారా... అనిపించింది. అందుకే మహిళలు ప్రయాణాలు చేయడం చాలా అవసరం అని భావిస్తాను నేను. ఇటీవలి కాలంలో మహిళలు ఒంటరిగా ప్రయాణించడం కూడా పెరిగిందనే చెప్పాలి. దీనిని మనం ఆహ్వానించాలి కూడా... కానీ రైల్వేల్లో ఎలిక్ట్రిల్ ఇంజనీరుగా పదవీ విరమణ చేసిన మా బృంద సభ్యులు ఒకరు.. ఇంతమంది మహిళలు ఒంటరిగా మరో దేశానికి ప్రయాణించడం చూసి ముక్కున వేలేసుకున్నారు.

ఖాట్మండు చేరేసరికి సాయంత్రం అయింది. ఖాట్మండు నేపాల్ రాజధాని అయినప్పటికీ అంత పెద్ద నగరంగా కనబడలేదు. మేము బస చేసిన హోటల్ కి దగ్గరలోనే పశుపతినాథ్ దేవాలయం ఉంది. మేము అక్కడికి నడిచే వెళ్లాము. 1979లో ఈ ఆలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించారు. ముస్లింలకు ప్రవేశం నిషిద్ధమట. చాలా పురాతనమైన శివాలయం. ఇక్కడి శివుడి పేరు పశుపతినాథుడు. పేరుకు సంబంధించి పలు పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. ధ్వజ స్తంభానికి ఎదురుగా పెద్ద లోహపు నంది విగ్రహం. దాదాపు ఈ ఆలయంలోని శిల్ప కళ అంతా వెండి, కంచు, ఇత్తడి తదితర లోహాలతో చేసినదే. అద్భుతమైన శిల్ప సంపద. ఆలయానికి నాలుగు వైపులా ద్వార బంధాలున్నాయి. నాలుగు వైపుల నుంచి పశుపతినాథ్ ను దర్శించుకోవడం అక్కడి సంప్రదాయం.


శివుడు కేవలం లింగాకారంలో మాత్రమే కాకుండా లింగానికి నాలుగు వైపులా నాలుగు ముఖాలతో ప్రత్యేకంగా ఉంది. పైన కూడా ఒక ముఖం ఉందని, అది నిరాకారంలో ఉందని అక్కడి స్థానికుల నమ్మకం. అక్కడ పూజారులు మినహా భక్తులెవరూ శివలింగాన్ని చేతితో తాకరట. కొందరు అభిషేకం చేస్తున్నారు. రుద్రాక్షలను ప్రసాదంగా ఇచ్చారు. మిగతా తీర్థప్రసాదాలు ఏవీ లేవు. అన్ని ప్రసిద్ధ దేవాలయాలలో మాదిరిగానే ఇక్కడా తొక్కిసలాట, సెక్యూరిటీ సిబ్బంది నెట్టివేయడం ఉంది. పండితులు డబ్బులు తీసుకొని అడ్డదారుల్లో అభిషేకం చేయిస్తున్నారు. ప్రాంగణంలోని చిన్న చిన్న ఇతర దేవాలయాలను చూస్తూ ముందుకు కదిలాము. కొన్నిచోట్ల మహిళలు అక్కడి ప్రత్యేకమైన వేషధారణతో తోరాలు కడుతున్నారు. కాలభైరవుని ఆలయం నన్ను బాగా ఆకర్షించింది. అక్కడ ఒక మహిళ భక్తులను వీపుల మీద గట్టిగా చరుస్తూ ఉంది. అలా చేయించుకోవడం వల్ల భయం పోతుందని స్థానికుల నమ్మకం. పశుపతినాథ్ ఆలయం భాగీరథి నది ఒడ్డున ఉంది. స్మశాన ఘాట్ కూడా ఉంది. కాశీలో లాగా ఇక్కడా దహన సంస్కారాలు జరుగుతున్నాయి.




25 వ తేదీ ఉదయం ఐదు గంటలకే మా బృందంలో కొందరం ఎవరెస్టు శిఖర దర్శనానికి బయలుదేరాము. ఇది ముందుగా మా ప్రణాళికలో లేదు. టికెట్ 9000/. అనుకోని అవకాశం... చాలా ఉద్విగ్నంగా ఉంది. మమ్మల్ని తీసుకెళ్ళే వాహనం కొంత ఆలస్యంగా రావడంతో మాకు మొదటి విమానం మిస్ అయింది. అదీ మంచికే జరిగింది. రెండో విమానం బయలుదేరే సమయానికి వాతావరణం పూర్తిగా అనుకూలించి, సూర్యకిరణాలు ఎవరెస్టు శిఖరం పై ప్రతిఫలించి వెండి కొండలా తళతళ మెరిసిపోయింది. విమానాన్ని దాని సమీపం లో కొద్దిసేపు ఆపారు. అతి దగ్గరగా ఎవరెస్టు శిఖరాన్ని చూసిన ఆనందాన్ని చెప్పడానికి మాటలు సరిపోవు. యూట్యూబ్ వీడియోలు చూసి నేను వెళ్లడం మానేసి ఉంటే నేను అలౌకికమైన ఆనందాన్ని కోల్పోయి ఉండేదాన్ని. ఇలాంటి అనుభూతులు జీవిత పర్యంతం వెంటాడుతుంటాయి.


హోటల్ కి వచ్చి, అల్పాహారం ముగించి, స్థానికంగా ఉండే విశేషాలు చూడడానికి వెళ్ళాము. ముందుగా జల నారాయణ ఆలయానికి వెళ్లాము. నీళ్లలో నారాయణుడు పడుకొని దర్శనమిస్తాడు. నీటి లోపలికి వెళ్లడానికి అనుమతి లేదు. గోపురం, గోడలు ఏమీ ఉండవు. ఓపెన్ టాప్ లో ఉంటుంది. చుట్టూ ప్రహరీ గోడ ఉంటుంది. విగ్రహం వరకు పైన పందిరి గుడ్డ కట్టి ఉంది. అక్కడి నుంచి గుహేశ్వరి ఆలయానికి వెళ్ళాము. ఇది ఒక శక్తి పీఠం. అమ్మవారి అవయవాలలో తుంటి భాగం ఇక్కడ పడిందని ప్రతీతి. ప్రధాన విగ్రహం అదే రూపంలో ఉంటుంది. పక్కన పూర్తి ఆకారంతో మరో విగ్రహం ఉంటుంది. భోజన విరామం తర్వాత డోలేశ్వర్ ఆలయానికి వెళ్లాము. చుట్టూ కొండల నడుమ అందమైన ప్రకృతిలో కొలువై ఉంది. ఇక్కడ శివుడు లింగాకారంలో లేడు. పూర్తి ఆకారం కూడా లేదు. కేవలం తల మాత్రమే ఉంది. స్వయంగా అభిషేకం చేసే ఏర్పాటు ఉంది. రాగితో చేసిన త్రిశూలం, డమరుకం ఆలయానికి ఇరువైపులా ఉన్నాయి.


మనోకామన ఆలయం

26వ తేదీ ఉదయమే ఖాట్మండు నుంచి పోఖ్రా బయలు దేరాం. 202 కిలోమీటర్లు. పది గంటలు ప్రయాణం. 130 కిలోమీటర్ల దూరంలో మనోకామన ఆలయం. మనసులో కోరుకున్న కోరికలను తీర్చే దేవతగా అమ్మవారు ప్రసిద్ధి. పార్వతీదేవి స్వరూపం. ఈ ఆలయం 4,265 అడుగుల ఎత్తైన కొండమీద ఉన్నది. 17వ శతాబ్దంలో పగోడా వాస్తు శైలిలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. పైకి వెళ్లడానికి కేబుల్ కార్ ఏర్పాటు ఉంది. దీనిని 1998 లో ప్రారంభించారు. మేము శుక్రవారం రోజు వెళ్లడం వల్ల చాలా రద్దీగా ఉంది. దర్శనానికి మూడు గంటలకు పైగా సమయం పట్టింది. దారికి ఇరువైపులా స్థానికుల రకరకాల దుకాణాలు ఉన్నాయి. గుడిలో వెలిగించే వత్తులు చేస్తున్న మహిళతో మాట కలిపాను. అదే వాళ్ళ జీవనాధారమట. పత్తి నుండి నూలు దారం తీసి తీసి తనకు భుజం నొప్పి వచ్చిందని వాపోయింది.



108 వత్తులున్న ఒక్క కట్ట మన కరెన్సీలో 50 రూపాయలు. వత్తులు చాలా పెద్దగా లావుగా ఉన్నాయి. ఇండియాలో కూడా వెలిగించుకోవడానికి లక్ష్మి ఒకేసారి నాలుగు కట్టలు తీసుకుంది. జంతుబలి కూడా ఉంది. చెక్కపై శిల్పంతో గుడి పైకప్పు ఎంతో అందంగా ఉంది. తిరుగు దారిలో కొంత మంది విద్యార్థులు కలిసారు. ఆ కొండ ప్రాంతంలో వాళ్ళు చదువుకోవడానికి పాఠశాల ఉండడం నాకు సంతోషాన్ని కలిగించింది. ఇంగ్లీషు, నేపాలీ భాషలలో విద్యాబోధన జరుగుతుందట. మేము కూడా కొండ పైనే భోజనాలు ముగించి, కేబుల్ కార్లలో కిందకు వస్తూ ఆ పచ్చటి కొండ కోనల్లో సూర్యాస్తమయం వీక్షించడం అద్భుతమైన దృశ్యం. పోఖ్రాకు తిరుగు ప్రయాణం మొదలైంది. ఆ రాత్రి పోఖ్రాలో బస.


తెల్లవారితే ముక్తినాథ్ కి ప్రయాణం. అక్కడకు వెళ్లి వచ్చిన మిత్రులు కొందరు రకరకాలుగా చెప్పారు. కాలినడకన వెళ్లడం కష్టమని, గుర్రం పైన లేదా డోలీలో వెళ్ళడం సురక్షితమని, విపరీతమైన ఈదురు గాలులు వీస్తాయని చెప్పారు. ఇంతవరకు మేము ప్రయాణించిన బస్సు ఆ దారిలో వెళ్ళడం కష్టమని నాలుగు స్కార్పియో లను ఏర్పాటు చేశారు. మాలో ఆరుగురు ఒక బృందంగా ఏర్పడి ఒక వాహనంలో బయలుదేరాము. దారంటి కాళీ గండకీ నది మమ్మల్ని వెంబడిస్తూనే ఉంది. దానిలో తొమ్మిది నదులు కలుస్తాయట. అందులో కాళీ ఒక నది. అందుకే కాళీ గండకీ నది అని పిలుస్తారట. నారాయణి నది కలుస్తుంది కాబట్టి నారాయణి నది అని కూడా పిలుస్తారట.


ఇదంతా మా డ్రైవర్ రాంచందర్ చెప్పాడు. అతడు స్థానికుడు. మేము అతనికి కొన్ని తెలుగు పదాలు నేర్పి, నాలుగు నేపాలీ పదాలు నేర్చుకున్నాము. అతడు మంచి జోవియల్ పర్సన్. నేపాలీ భాషలో జాం జాం అంటే మన తెలుగులో రండి రండి అని అర్థం. నేపాలీ భాషలో రండి అనే మాట బూతు పదం అట. నేపాలీ జానపద గేయాలను వినిపిస్తూ మధ్య మధ్యలో జోకులు వేస్తూ కొండ అంచుల్లో భయోత్పాటమైన ప్రయాణాన్ని భయరహితం చేసి, సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చాడు. ఎక్కడా పచ్చదనం లేదు... మంచు కూడా లేదు కానీ రకరకాల ఆకారాల్లో ఎవరో చెక్కినట్లుగా అందంగా కనిపించాయి ఆ ఎత్తైన కొండలు. ముందు సీటులో కూర్చున్న నేను వాటి అందాలను కళ్లలో నింపుకున్నాను. కొండ మలుపులతో సాగుతున్న ఉద్విగ్నమైన ప్రయాణాన్ని బాగా ఆస్వాదించాను. వాహనం దిగి దిగకుండానే చుట్టుముట్టారు. అక్కడి యువత గుర్రం తీసుకోండి మేడం, జోలీ తీసుకోండి మేడం అంటూ అడుగుతుంటారు... అదే వాళ్ల జీవనాధారం. డోలీకైతే రానూ పోనూ నాలుగు వేలు. గుర్రానికైతే ఎనిమిది వందలు. గుర్రంపై వెళ్ళడానికి మాత్రమే అయితే నాలుగు వందలు. గుర్రం అయితే మెట్లదారి వరకే వెళుతుంది. అక్కడి నుంచి మెట్ల మీదుగా పైకి వెళ్ళాలి. జోలీ అయితే ఆలయం దాకా తీసుకువెళతారు.


నేను ఖచ్చితంగా ట్రెక్కింగ్ చేయాలనుకున్నాను కాబట్టి కష్టంగా వాళ్ల నుంచి తప్పించుకొని నలుగురం నడక మొదలు పెట్టాం. కొంత దూరం వెళ్ళాక వెనక్కి తిరిగి చూస్తే నా మిత్రులు కనిపించలేదు. చేసేది ఏమీ లేక ఒక బెంగళూరు జంట కలిస్తే వాళ్ళతో ముచ్చట్లాడుతూ ముందుకే సాగాను. మెట్ల దారి దగ్గర మిత్రులు మెల్లగా గుర్రాలు దిగుతూ కనిపించారు. ఈదురు గాలిలో ఆ ఎత్తైన కొండను ఎక్కలేమని భావించి గుర్రమెక్కేశారట. అక్కడి నుంచి మెట్ల గుండా ఆలయానికి చేరుకున్నాము. 12,343 అడుగుల ఎత్తులో ఉన్న చిన్న గుడి. ప్రస్తుత దైవం విష్ణువే అయినా పూర్వకాలంలో అక్కడ బౌద్ధమే ఉండేదట. తరువాత దానిని హిందూ పుణ్యక్షేత్రంగా మార్చారు. ముక్తినాథ్ అంటే ముక్తిని ప్రసాదించే నాథుడు అని అర్ధం. పూర్వకాలంలో అంత ఎత్తైన ప్రదేశానికి అంత చలిలో వెళ్లినవాళ్లు తిరిగి రావడం అరుదుగా ఉండేదట. అందుకే ముక్తినాథ్ అనే పేరు వచ్చిందని స్థానికులు చెప్పారు. మేము వెళ్ళినప్పుడు టెంపరేచర్ ఏడు డిగ్రీలు ఉంది. బావుల పేరిట 108 పంపులను ఏర్పాటు చేశారు. మంచు కరిగిన నీళ్లు ఆ పంపుల గుండా వస్తున్నాయి. చాలామంది బయట నుంచే ఆ నీళ్ళను నెత్తిన చల్లుకున్నారు.

ఆలయం ముందర నడుం లోతు నీళ్లతో రెండు చిన్న గుండాలు ఉన్నాయి. కొద్ది మంది మాత్రమే ఆ పంపుల కిందికి వెళుతున్నారు. నేనూ నా ఇమ్యూనిటీని పరీక్షించుకుందామని వాటికింద పరుగెత్తాను. అది ఒక ఛాలెంజ్ తో కూడిన థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ అనిపించింది నాకు. తడిబట్టలతో గుడిలోకి వెళ్ళడం నిషిద్ధము. గుడి లోపల ఒకవైపు హోమగుండం లాంటిది ఉంది. ఆ వాతావరణంలో అది అత్యంత అవసరం అనిపించింది. ఉద్దేశం ఏదైనప్పటికీ అందుకే ఏర్పాటు చేసారేమో.... అనిపించింది. అక్కడికి ఫర్లాంగు దూరంలో పెద్ద బుద్ధ విగ్రహం దగ్గరికి వెళ్లి అక్కడి నుంచి పక్కనే ఉన్న అమ్మవారి గుడికి వెళ్లాము. గ్రామ దేవత లాగా ఉంది. అక్కడి స్థానికులు కిందకు వంగి చూడమని సూచించారు. అక్కడ చిన్న దీపం మిలమిలా మెరుస్తూ కనిపించింది. బయటికి వచ్చి ఆ ప్రకృతి సౌందర్యాన్ని కళ్ళలో నింపుకొని తిరిగి కిందకు నడక మొదలుపెట్టాం.


ముక్తినాథ్ అంత భయంకరమైన ట్రెక్ ఏమీ కాదు. కానీ కొంత ఫిట్ గా ఉండడం మాత్రం అవసరం. ప్రయాణాల వల్ల ఆనందమే కాదు, ఆరోగ్యమూ బాగుపడుతుంది. ఫిట్ గా ఉండాలన్న పట్టుదల పెరుగుతుంది. కిందకు వచ్చి టీ తాగి, అక్కడికి గంట దూరంలో ఉన్న జాంసం అనే చిన్న గ్రామంలో ఆ రాత్రి బస చేశాము. ఉన్నట్టుండి టెంపరేచర్ మైనస్ డిగ్రీల లోకి పడిపోయింది. ఏదో తిన్నామనిపించి బరువైన రగ్గులలో దూరిపోయాము ఉదయం లేచి కిటికీ పరదా తొలగించాను... అంతే అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. చుట్టూ హిమగిరులు సూర్యకాంతితో మిలమిలా మెరిసిపోతూ కవ్విస్తున్నాయి. అంతే మేడ మీదకు వెళ్ళి ఆ హిమగిరుల అందాలను ఆస్వాదించి, కెమెరాలలో బంధించి కానీ, కిందకు దిగలేదు. అక్కడి నుంచి తిరిగి పోఖ్రాకు బయలుదేరాము. కొంత దూరం దాకా హిమ గిరులు మమ్ములను వెంబడించాయి. పోఖ్రాలో స్థానికంగా చూసిన వాటిలో నన్ను బాగా ఆకర్షించింది గుప్తేశ్వర్ మహదేవ్ గుహ, డేవిస్ జలపాతం. ఎక్కడో ఉన్న డేవిస్ జలపాతం గుప్తేశ్వర్ గుహలో పడుతుంది. ఆ అద్భుతమైన దృశ్యం చూసి తీరవలసిందే. దాదాపు 350 మెట్లకు పైగా కిందకు దిగాలి. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన గుహ. కొన్ని చోట్ల ఇరుకుగా ఒకరి వెనక ఒకరు జాగ్రత్తగా వెళ్ళవలసి ఉంటుంది. జారుతూ ఉంటుంది. వెళ్ళగా వెళ్ళగా అద్భుతమైన జలపాత దృశ్యం కళ్ళముందు సాక్షాత్కరిస్తుంది.


బుద్ధుడు జన్మించిన స్థలంగా చెప్పబడే లుంబినీ


నేపాల్ లో చూడదగిన ప్రదేశాలలో లుంబినీ ఒకటి. 623 బీసీ లో ఇక్కడ బుద్ధుడు జన్మించినట్లు చరిత్ర చెపుతోంది. హోటల్ నుంచి కారులో లుంబినీ కి బయలుదేరాము. ముందుగా మేము జపనీస్ వారి బౌద్ధ స్థూపానికి వెళ్లాము. విపరీతమైన ఎండ, ఈదురు గాలి. చెప్పులు లేకుండా అన్ని మెట్లు ఎక్కి లోపలికి వెళ్ళే సాహసం చేయలేదు. ఆ ప్రాంగణంలో కొరియన్, చైనీస్, రష్యన్, నేపాలీ మొదలైన దేశాల వాస్తు శిల్పంతో కూడిన స్థూపాలున్నాయి. సాయంత్రం ఐదు గంటల వరకే అవి తెరిచి ఉంటాయట. కొన్ని మాత్రమే లోపలికి వెళ్ళి చూడగలిగాము. కొన్ని మూసి ఉన్నాయి. అక్కడ బౌద్ధ విద్యార్థులు కనిపించారు. వారి కొరకు అక్కడ ప్రత్యేకంగా వసతిగృహం కూడా ఉందట.


చివరగా బుద్ధుడి తల్లి మాయాదేవి మందిరానికి వెళ్లి బుద్ధుడు జన్మించిన చోటును చూడాలి. అక్కడ మొండి గోడలు మాత్రమే ఉన్నాయనుకొని మా బృంద సభ్యులు చాలామంది బోటు షికారుకు వెళ్లారు. నేను మాత్రం ఆ ప్రదేశాన్ని చూడాలనే ఉత్కంఠతో శివకుమారి తో పాటు అక్కడికి వెళ్లాను. ఇండియన్ కరెన్సీలో యాభై రూపాయలు ప్రవేశ రుసుము. చాలా మంది విదేశీయులే ఆ ప్రాంగణంలో కనిపించారు. స్లో పాయిజన్ లా హిందూ మత పిచ్చి నరనరానా ఇంకిన రోజులు కదా... మన వాళ్లు పెద్దగా లేరు. అక్కడక్కడా చిన్న చిన్న స్థూపాలు, లోపల మాయాదేవి యింటి మొండి గోడలు, అక్కడ బుద్ధుడు జన్మించిన స్థలాన్ని అద్దాల బాక్సులో ఒక పెద్ద ఎమరాల్డ్ రాయితో సూచించారు. అక్కడే బుద్ధుడు జన్మించాడు అని తలచుకున్నప్పుడు ఒళ్లు గగ్గుర్పొడిచింది. మనసు ఆనందంతో ఉప్పొంగింది. కొన్ని అనుభూతులు వ్యక్తీకరించడానికి భాష చాలదు. అక్కడి నుంచి సొనౌలీకి చేరుకొని రాత్రి అక్కడ బస చేసి ఉదయమే బయలుదేరి గోరఖ్ పూర్ ఎయిర్పోర్ట్ చేరుకున్నాము. తిరిగి విమానంలో క్షేమంగా హైదరాబాద్ చేరుకున్నాము.


నేపాల్ ప్రయాణం తర్వాత మనసు ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉంది. ముఖ్యంగా అక్కడి మహిళలు బలంగా, తెలివిగా ధైర్యంగా కనిపించారు. చాలా షాపులలో మహిళలే వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నారు. చాలా చోట్ల మొక్కజొన్న పంటలే కనిపించాయి. వరి పొలాలు చాలా తక్కువ. సాత్వికమైన ఆహారం. ఆలు, గోబి ఎక్కువగా పండుతుంది. మద్యం షాపులు స్వీటు షాపులు కనిపించలేదు. కానీ దాదాపు ప్రతి హోటల్ లో బార్ కౌంటర్లు ఉన్నాయి. ఖాట్మండు కంటే పోఖ్రా పెద్ద నగరం. బిజినెస్ సెంటర్ కూడా... ఇండియన్ కరెన్సీ చెల్లుబాటులో ఉంది. దేవాలయాల నిర్మాణం పగోడా వాస్తు శైలిలోనే ఉంది. శుభ్రత పాటించడం లేదు. టూరిజం మీద ఆధార పడిన దేశం కనుక శుభ్రత నిర్వహణలో శ్రద్ధ తీసుకుంటే బాగుంటుంది. మా బృందంలో చాలా మంది చూసింది తక్కువ ప్రయాణం ఎక్కువ అనే అభిప్రాయానికి వచ్చారు. కానీ ఎత్తైన కొండలలో పచ్చటి కోనలలో ఇరుకైన రోడ్డు మలుపులతో హిమగిరుల సోయగాలతో ప్రయాణమే ఒక అద్భుతం. అదే నేపాల్ ప్రత్యేకత.

-గిరిజ పైడి మర్రి

Read More
Next Story