ఈ మంత్రులకే అసలు పరీక్షా
x

ఈ మంత్రులకే అసలు పరీక్షా

ప్రతి నియోజకవర్గంలో అభ్యర్ధుల గెలుపోటములపై ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డితో రివ్యు చేస్తునే ప్రత్యేక పరిశీలకల నుండి రిపోర్టులు తెప్పించుకుంటోంది.


రేవంత్ రెడ్డి మంత్రివర్గంలోని కొందరికి టెన్షన్ పెరిగిపోతున్నట్లుంది. 13వ తేదీన జరగబోయే పార్లమెంటు ఎన్నికలు అభ్యర్ధులతో పాటు మంత్రులకు కూడా పెద్ద సంకటంగా మారింది. పోటీచేస్తున్నందుకు అభ్యర్ధుల్లో టెన్షన్ మామూలే అయితే వీళ్ళని గెలిపించాల్సిన బాధ్యత కారణంగా మంత్రుల్లో కూడా టెన్షన్ పెరిగిపోతోంది. అభ్యర్ధుల ప్రచారం, గెలుపు అవకాశాలు, మంత్రుల పనితీరు లాంటి అనేక అంశాలపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ రివ్యు చేసిన విషయం తెలిసిందే. ఆ రివ్యూలో కొందరు మంత్రులు, ఎంఎల్ఏల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేయటమే కాకుండా వాళ్ళకి క్లాసు కూడా తీసుకున్నట్లు మీడియాలో ప్రచారమైన విషయం తెలిసిందే. దీంతో మంత్రుల పనితీరును ఏఐసీసీ చాలా నిశితంగా గమనిస్తోందనే విషయం అర్ధమైంది.

అభ్యర్ధులను గెలిపించేబాధ్యతను మంత్రులకు అప్పగించి ఏఐసీసీ వదిలేయలేదు. ప్రతి నియోజకవర్గంలో అభ్యర్ధుల గెలుపోటములపై ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డితో రివ్యు చేస్తునే ప్రత్యేక పరిశీలకల నుండి రిపోర్టులు తెప్పించుకుంటోంది. అలాగే ప్రత్యేక పరిశీలకులు, రేవంత్ నుండే మంత్రుల పనితీరుపైన కూడా నివేదికలను తెప్పించుకుంటోంది. దాంతో ఏఐసీసీలోని తెలంగాణా బాధ్యులతో ప్రతిరోజు ప్రచార తీరుతెన్నులను, ప్రచారంలో జరుగుతున్న లోపాలను గమనిస్తోంది. అందుకనే నియోజకవర్గాల్లో వెనకబడిన అభ్యర్ధులు ఎవరు, ఎలా స్పీడందుకోవాలి, గెలుపును ఎలా అందిపుచ్చుకోవాలనే విషయంలో ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇస్తున్నది. ఇంత జాగ్రత్తగా గమనిస్తోంది కాబట్టే ఢిల్లీ నుండి కేసీ వేణుగోపాల్ తెలంగాణాలోని మంత్రులు, సీనియర్ నేతలతో సుదీర్ఘంగా సమీక్ష చేయగలిగారు.

ఆ సమీక్షలో ప్రచారంలో వెనకబడిన అభ్యర్ధులపై సమీక్షచేయటమే కాకుండా యాక్టివ్ పార్ట్ తీసుకోని ఇన్చార్జి మంత్రుల పనితీరుపై తీవ్రమైన అసంతృప్తి వ్యక్తంచేశారు. పార్టీవర్గాల సమాచారం ప్రకారం నల్గొండ, భువనగిరి, ఖమ్మం పార్లమెంటు అభ్యర్ధులు సేఫ్ పొజిషన్లో ఉన్నారట. ఇక్కడి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇబ్బందిలేదని తెలిసింది. నల్గొండలో కుందూరు రఘువీర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రామసహాయం రఘురామ్ రెడ్డి గెలుపుబాటలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అయితే కోమటిరెడ్డి పనితీరుపై కేసీ అసంతృప్తి వ్యక్తంచేశారట. ఎందుకంటే కోమటిరెడ్డి సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం ఇన్చార్జికూడా. సికింద్రాబాద్ అభ్యర్ధి దానం నాగేందర్ గెలుపు విషయంలో మంత్రి పెట్టాల్సినంత దృష్టిపెట్టడం లేదని రిపోర్టు అందిందట. గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన భువనగిరిలో పార్టీ గెలుపుపైనే కోమటిరెడ్డి ఎక్కువగా దృష్టి పెట్టారు.

నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్ధి మల్లు రవిని గెలిపించటంలో మంత్రి జూపల్లి కృష్ణారావు చెమటోడుస్తున్నట్లు సమాచారం. ఎందుకంటే ఇక్కడ మల్లురవికి బీజేపీ అభ్యర్ధి పాతూరి భరత్ నుండి గట్టి ప్రతిఘటన ఎదురవుతోందట. కాంగ్రెస్ అభ్యర్ధిని గెలిపించటానికి మంత్రి జూపల్లి రాత్రి, పగలు కష్టపడుతున్నారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ ఎంఎల్ఏలు, నేతలు, క్యాడర్ తో ప్రతిరోజు మీటింగులు పెట్టుకుంటున్నారు. అభ్యర్ధి రవితో తాను తిరగటమే కాకుండా ఎంఎల్ఏలతో కలిపి తిప్పుతున్నారు. అలాగే పెద్దపల్లి అభ్యర్ధి గడ్డం వంశీ కృష్ణ గెలుపుకోసం మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కష్టపడుతున్నారు. ఇక్కడ వంశీకి కలిసొచ్చే అంశం ఏమిటంటే తండ్రి వివేక్, బాబాయ్ వినోద్ కూడా ఎంఎల్ఏలుగా ఉండటమే. ఏదేమైనా మంత్రి దుద్దిళ్ళ మాత్రం అభ్యర్ధి గెలుపుకోసం బాగా కష్టపడుతున్నారనే చెప్పాలి.

ఇక కరీంనగర్లో మంత్రి పొన్నం ప్రభాకర్ రావు బాగా చెమటోడుస్తున్నట్లే చెప్పాలి. ఇక్కడ కాంగ్రెస్ తరపున వెలిచాల రాజేంద్రరావు పోటీచేస్తుంటే బీజేపీ తరపున బండిసంజయ్ పోటీలో ఉన్నారు. ఇప్పటికి గెలుపు అవకాశాలు బండికే ఎక్కువగా ఉందనే ప్రచారం తెలిసిందే. దాంతో కాంగ్రెస్ అభ్యర్ధి గెలుపుకు పొన్నం నానా అవస్తలుపడుతున్నారు. బీఆర్ఎస్ తరపున బోయినపల్లి వినోద్ పోటీచేస్తున్నా చర్చంతా కాంగ్రెస్, బీజేపీ అభ్యర్ధుల చుట్టే తిరుగుతోంది. అలాగే వరంగల్ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్ధి కడియం కావ్య గెలుపుకు మంత్రి కొండా సురేఖ కూడా బాగా కష్టపడుతున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ తరపున సురేంద్రకుమార్, బీజేపీ అభ్యర్ధిగా ఆరూరి రమేష్ గట్టిపోటీ ఇస్తున్నారు. మెదక్ లో మంత్రి దామోదరరాజనర్సింహ కూడా పార్టీ అభ్యర్ధి నీలంమధు గెలుపుకు కష్టపడుతున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్ధి వెంకటరామరెడ్డి, బీజేపీ క్యాండిడేట్ రఘునందనరావు గట్టి పోటీ ఇస్తున్నారు. కాబట్టి పార్టీ అభ్యర్ధుల గెలుపు విషయంలో మంత్రులకే పెద్ద పరీక్ష ఎదురవబోతోందని తెలుస్తోంది.

Read More
Next Story