సస్పెన్స్ లో జగన్ విదేశీ ప్రయాణం
x
ys jagan

సస్పెన్స్ లో జగన్ విదేశీ ప్రయాణం

14వ తేదీ తీర్పులో జగన్ను విదేశీ ప్రయాణానికి కోర్టు అనుమతించకపోతే అప్పుడు ఏమవుతుందో చూడాలి.


జగన్మోహన్ రెడ్డి విదేశీ ప్రయాణం సస్పెన్సులో పడింది. జగన్ విదేశాలకు వెళ్ళేందుకు అనుమతించాలని కోరుతు ఆయన తరపు లాయర్లు నాంపల్లిలోని సీబీఐ న్యాయస్ధానంలో పిటీషన్ వేశారు. దానిపై ఈరోజు విచారణ జరిగింది. తన కూతుళ్ళు లండన్ లో చదువుతున్న కారణంగా భార్య భారతీరెడ్డితో కలిసి వెళ్ళేందుకు అనుమతి కావాలని జగన్ లాయర్ వేసిన పిటీషన్ను సీబీఐ తీవ్రంగా వ్యతిరేకించింది. లండన్ వెళ్ళేందుకు జగన్ కు అనుమతి ఇవ్వద్దని సీబీఐ లాయర్ వాదించారు. జగన్ అనేక కేసుల్లో ముద్దాయని లాయర్ చెప్పారు. చాలా కేసుల్లో జగనే మొదటి ముద్దాయి కాబట్టి విదేశాలకు వెళ్ళేందుకు ఎంతమాత్రం అనుమతి ఇవ్వకూడదని వాదించారు. 11 కేసుల్లో విచారణ జరుగుతున్న కారణంగా జగన్ను విదేశాలకు వెళ్ళేందుకు అనుమతి ఇవ్వటంపై సీబీఐ అభ్యంతరం వ్యక్తంచేసింది. అంతేకాకుండా కొన్ని కేసులు 15వ తేదీన విచారణకు రాబోతున్నట్లు కూడా సీబీఐ వివరించింది.

ఇదే విషయమై జగన్ లాయర్ మాట్లాడుతు గతంలో కూడా జగన్ విదేశాలకు వెళ్ళొచ్చినట్లు చెప్పారు. విదేశాలకు వెళ్ళటంలో జగన్ ఎప్పుడూ కోర్టు నిబంధనలను ఉల్లంఘించలేదన్న విషయాన్ని లాయర్ కోర్టుకు గుర్తుచేశారు. రైట్ టు ట్రావెల్ అబ్రాడ్ అనేది జగన్ కు రాజ్యాంగం కల్పించిన హక్కని జగన్ లాయర్ చెప్పారు. రెండువైపుల వాదనలు విన్న కోర్టు తీర్పును ఈనెల 14వ తేదీకి రిజర్వ్ చేసింది. 13వ తేదీ పోలింగ్ అయిపోగానే తన భార్య భారతితో కలిసి లండన్ వెళ్ళాలన్న జగన్ ఆలోచన సస్పెన్సులో పడింది. 17వ తేదీన లండన్ వెళ్ళి వారంరోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని జగన్ అనుకున్నారు. అయితే సీబీఐ అభ్యంతరంతో అదికాస్త అయోమయంలో పడిపోయింది.

గతంలో జగన్ విదేశాలకు వెళ్ళేందుకు కోర్టును అనుమతి కోరినపుడు సీబీఐ ఇఫుడు చెప్పినట్లుగా అభ్యంతరాలు వ్యక్తంచేయలేదు. ఒకసారి అభ్యంతరం వ్యక్తంచేసిన కోర్టు మరో రెండుసార్లు అనుమతించటం కోర్టు పరిధిలోని అంశమని చెప్పి చప్పుడు చేయలేదు. మరి ఇపుడు ఏమైందో తెలీటంలేదు జగన్ విదేశీ ప్రయాణాన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. 15వ తేదీ జగన్ కేసులు విచారణకు వస్తున్నాయని చెప్పటంలో అర్ధంలేదు. ఎందుకంటే కేసుల విచారణలో జగనేమీ వ్యక్తిగతంగా హాజరుకావటంలేదు. వ్యక్తిగతహాజరు నుండి జగన్ మినహాయింపు కూడా తీసుకున్నారు. అలాంటపుడు కేసుల విచారణపుడు జగన్ కచ్చితంగా ఉండాలని సీబీఐ వాదించటం ఏమిటో అర్ధంకావటంలేదు.

మొత్తంమీద జగన్ విదేశీప్రయాణం కోర్టు కారణంగా సస్పెన్సులో పడిపోయింది. ఐదురోజుల సస్పెన్స్ తర్వాత జగన్ విదేశీయానానికి కోర్టు అనుమతిస్తుందా లేదా అనే ఉత్కంఠ పార్టీ నేతలతో పాటు జగన్ అభిమానుల్లో పెరిగిపోవటం ఖాయం. గతంలో జగన్ విదేశీ ప్రయాణంపై పెద్దగా అభ్యంతరాలు వ్యక్తంచేయని సీబీఐ ఇపుడు మాత్రమే ఎందుకు వ్యతిరేకిస్తోందనే చర్చ పెరిగిపోతోంది. మరి 14వ తేదీ తీర్పులో జగన్ను విదేశీ ప్రయాణానికి కోర్టు అనుమతించకపోతే అప్పుడు ఏమవుతుందో చూడాలి.

Read More
Next Story