ఎక్కడాలేని శ్రీకపోతేశ్వర దేవాలయం

ఆంధ్రాలో ఎక్కడుందో తెలుసా?

Update: 2025-11-12 02:30 GMT

 మా ఫ్రెండ్స్ అంతకుముందు వెళ్లి వచ్చి చాల బాగుందని చెప్పారు. నేను వచ్చేదాన్నిగా అన్నాను.గుంటూరులో బయలుదేరి ఏడు గంటలకు ఫోన్ చేశారు.పోతున్నాం రా రా అని.అది ఏమిటో?ఎక్కడో కూడా తెలియదు. హడావుడిగా బయలుదేరి బస్సు ఎక్కాను.ఒంగోలు నుండి నరసరావుపేటకు మూడుగంటల జర్నీ.నరసరావుపేటలో ఉన్న ఫ్రెండ్ తో మొత్తం నలుగురం నరసరావుపేట నుండి చేజర్లకు ఆటో ఎక్కాం.

చేజర్లలో, ఎక్కడాలేని శ్రీకపోతేశ్వర దేవాలయం ఉంది.శ్రీ కపోతేశ్వర దేవాలయం ఉమ్మడి గుంటూరుజిల్లాలోని నరసరావుపేటకు పడమరగా 30కి.మీ.దూరంలో నకిరికల్ మండలంలో చేజర్లలో ఉంది. చేజర్ల ఒక మారుమూల గ్రామం.కానీ చాలా రమణియ్యంగా ఉంది.పడమర ఉత్తర దిశలందు నల్లమల్ల కొండల వరసలు.తూర్పున నాగార్జునసాగర్ కుడికాలవ, దానిద్వారా చీలిన అద్దంకి బ్రాంచికాలువ ప్రవహించుతూ లక్షలఎకరాలలో వరి మొదలైన పంటలతో, కొండలు కోనలు బిలములతో పచ్చపచ్చగా ప్రకృతి ప్రేమికులను రా రమ్మని పిలుస్తుంది.ఈచేజర్లకు వాయువ్యదిశలో మూడు నాలుగు శతాబ్దాలనాటి అతిపురాతనమైన శ్రీకపోతేశ్వరాలయం ఉంది. చేజర్లను రాజధానిగా చేసుకుని పాలించిన ఆనందగోత్రజరాజులు నిర్మించారట.చేజర్లకు "చెంజెరువు" అనగా అందమైన లేక పద్మములతో నిండిన చెరువు అనే అర్థమట.

చేజెర్ల గ్రామం










కపోతేశ్వరగుడిగా,శివాలయంగా ఇది ప్రసిద్ధి చెందినది.కపోతేశ్వర చరిత్ర దేవస్థానములో వేసిన ప్లేక్సిలో విపులంగా ఉంది.అందరికి తెలిసిన శిబి చక్రవర్తి కథే కనుక చరిత్ర జోలికి వెళ్లడం లేదు. 

కుడికన్నుతో చూసే నంది

రామాయణంలో మారీసుడు మాయలేడిగా వస్తే ఇక్కడ త్రిమూర్తులు(బ్రహ్మ విష్ణు మహేశ్వరులు) మాయబాణం,మాయపావురం, మాయాకిరాతకుడుగా వచ్చి శిబిచక్రవర్తిని పరీక్షించారు.ఆంధ్ర మహాభారతంలోని అరణ్యపర్వంలో ఇంద్రాగ్నులు డేగ కపోతములుగా మారి శిబిచక్రవర్తిని పరీక్షించారని ఉందట.బుద్ధిని చరిత్రకు సంబంధించిన అవధాన శతకములో "శిబిజాతo"లో బుద్ధుడే జన్మించి పేదలకు నిరంతరము కోరిన దానము ఇస్తుండగా దేవేంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి నేత్రమును దానం అడగగా, ఇవ్వడం, దేవేంద్రుడు దివ్యనేత్రములు ఇవ్వడం,ఆ కళ్ళతో శిబిరాజు నూటామడల దూరం వరకుగల కొండలచాటునగల దృశ్యములను స్పష్టంగా చూడగలుగుట అత్యద్భుతంగా వర్ణింపబడినదట.ఇవన్నికూడా కల్పిత కథలే.

కపోతేశ్వరలింగం:- కపోతమునకు గుడి ఉండటమే కాదు.ఆ లింగం ప్రత్యేకంగా ఉంది.అన్ని శివాలయాలలో లింగంలా కాకుండా ఒక చిత్రమైన పద్ధతిలో,చతురస్రాకారముగానున్న వేదికపై కరచరణములు,శిరస్సులేని మనుష్యుని ఉరఃస్థలం (మొండెము)వలె ఉన్నది.రెండు భుజముల స్థానములో రెండు రంధ్రములు ఉన్నాయట.కుడి భుజరంద్రం సుమారు ఒక బిందె నీళ్లతో నిండుతుందట.ఎడమభుజ రంధ్రంలో ఎన్ని నీళ్లుపోసినా నిండదట.పోసిననీరు అజ్ఞాత స్థలమునకు పోతాయట,మంగళగిరి పానకాల స్వామిలాగా.పూర్వము ఒకరు దీనిని పరీక్షంపదలసి ఎడమభుజంలో అనేకమంది బ్రాహ్మణులతో నీరు పోయించగా ఆభుజంనుండి పొగ,మంటలు వచ్చాయట.అపరాధమని శాంతి చేసినారటాని చెబుతున్నారు.కుడిభుజ రంధ్రంలో పోసిన నీటిని ప్రతిఉదయం కుంచకోలతో తీస్తారట.ఈనీరు పచ్చి మాంసపు వాసన వస్తాయని చెబుతున్నారు.

లింగాకృతిపైన చుట్టూ చిన్నచిన్న రంధ్రములు స్పష్టంగా కనిపిస్తున్నాయి.ఈరంధ్రాలు శిబిరాజు తన శరీరమునుండి కత్తితో మాంసం కోసినప్పుడు ఏర్పడిన రంద్రాలని సిద్ధులు చెప్పారట.అయితే శ్రీ భాగవతుల అన్నపూర్ణయ్యశాస్త్రి, కం+పోతః అనగా నిర్గుణ బ్రహ్మమనియు అందుచేత ఆ లింగము హంసాత్మకమైన లింగమనియు,పవిత్రమైన నీటిలో సాలగ్రామములు తొలుచు పురుగులుండి తొలుచుటచే నేర్పడిన లింగమని సెలవిచ్చారట. ఈ లింగ రంగుకూడా నలుపు తెలుపులో కాకుండా లైట్ గోరింటాకు రంగులో ఉంది. ఎడమ భుజంపై సహస్ర యజ్ఞోపవీతం కనిపిస్తుందట.కార్తిక సోమవారం భక్తులు ఎక్కువగా ఉండటంతో అంత పరీక్షగా వీక్షించలేకపోయాం.సర్వకాల సర్వవ్యవస్థల యందు గర్బాలయమున అఖండ జ్యోతి వెలుగుతుందట

భారతీయ పురావస్తు శాస్త్రజ్ఞులు,మహారాష్ట్రలోని షోలాపూర్ సమీపంలోని టెరిగ్రామoలో ఉన్న త్రివిక్రమ ఆలయం,చేజర్ల క్షేత్రం ఒక ప్రత్యేక శిల్ప చైత్యాలయాలవలే ఉన్నాయని,హిందువులాక్రమించుకుని శివాలయముగా మార్పుచేసినారని స్పష్టం చేసినారు.అమరావతిలో బౌద్ధచైత్యమును అమరలింగేశ్వరాలయంగా,శ్రీశైల బౌద్ధచైత్యాలయమును మల్లికార్జునాలయంగా మార్చివేసినట్లుగానే.

భారత శిల్పశాస్త్రంలో 1.నగర 2.వేసరా 3.ద్రవిడ శిల్ప విధానాలు గలవు(గోపురం, అలంకరణలను బట్టి).ఈమూడు శిల్ప శాస్త్రవిధానాలకు భిన్నంగా గుడిగోపురం ఏ అలంకరణ లేకుండా గజ పుష్ఠాకారం(ఏనుగు పడుకున్నప్పుడు వెనక వైపునుండి చూస్తే కనిపించే ఆకారం)లో ఉంది. ముందువైపు శివపార్వతులు, కొంతఅలంకరణతో ఉంది.గుడి తూర్పు ముఖముగా ఒకేఒక ప్రవేశ ద్వారముతో,రెండు ఎత్తైన ప్రాకారాల మధ్య ఉన్నది.రెండవ ప్రకారం లోపలకు ప్రవేశించగానే దీపాలచెట్టు,ధ్వజస్తంభం,కుడివైపున నాలుగు అడుగులఎత్తైన వేదికపై చుట్టూ లింగములు చెక్కబడిన నాలుగైదు అడుగుల ఎత్తుగల దశసహస్త్రలింగం ఉంది.పసుపు కుంకుమలుపూసి వేదికపై దీపాలు వెలిగిస్తున్నారు.మొదటిప్రాకారం లోపల కపోతేశ్వర ఆలయంతోపాటు దక్షిణంవైపున దత్తాత్రేయ,నగరేశ్వర,నిమ్మ(గిరిజన) భక్తురాల(ఈమెకు చిన్నగుడి అయినా ఉండటం భలే నచ్చింది)చిదంబరేశ్వర (ఈశాన్యముగా ఒకశాసనం)మార్కండేయ,కాలేశ్వరదంపతుల,

వీరభద్రేశ్వర దంపతుల,శంభులింగేశ్వర,సర్వేశ్వర,అగస్తేశ్వర మొ..చిన్నచిన్న గుడిలతోపాటు గిలకలబావి,నందులు, అష్టమాతృకులున్నాయి.

ఉత్తరమున దశసహస్త్రలింగేశ్వర,బౌద్ధ స్తూపం,ముక్తేశ్వర,అచ్చమాంబ ఉమామహేశ్వర,పాతాళనాగేశ్వర,భువనేశ్వర గుడులతోపాటు కళ్యాణ మండపం,అనేకనందులు,శాసనాలు,నిర్లక్ష్యం చేయబడుతున్న ప్రాసినశిల్పాలున్నాయి.గర్భాలయ ప్రాంగణం వెలుపల అంటే మొదటి రెండు ప్రాకారాలమధ్య కాలభైరవవిగ్రహం,ఉత్తరమున శ్రీతుంగదుర్తి బుచ్చయ్యగారి సమాధి(కపోతేశ్వర సేవకుడు,కపోతేశ్వరాష్టకం,కొన్నికీర్తనలు రాచేరట.కొన్ని మహిమలు కలిగి ఉండేవారట.1790లో చనిపోయారట)వీరి శిష్యురాలు కూరపాటి అచ్చమ్మగారి(కపోతేశ్వరుని సేవించుచు సర్వజిత్తునామ సం.కార్తీక బహుళ శుక్రవారంనాడు సిద్ధిపొందినట)సమాధులున్నాయి.దక్షిణ దిశగా "మల్లికాకుండo" భలే ఉంది.చారిత్రిక అంశాలపట్ల మన నిర్లక్ష్యం వలన పూడుతూ వస్తుంది.దీని మెట్లు వర్తులముగా బావిలోకి దిగుతున్నాయి.దీని ముందు ఓపెద్దచెట్టు ఉంది.

ఈ చెట్టుకు ముందు ఇక్కడ పేరులేని ఓపెద్ద మ్రాను ఉండేదట. మూడు నుండి 11 వరకు బేసి సంఖ్యలుగల అనేకరకముల ఆకులు పువ్వులు ఉండడంవలన ఆవృక్షముపేరు నిర్ణయింపలేక అందరూ దానిని పేరులేని పెద్దమ్రాను అని పిలిచేవారట.30.12.1915న వింత గొలుపుతూ భస్మమైనదట. ఆ చెట్టు స్థానంలో నాటబడిన మర్రి వటవృక్షముగా మారి అది కూడా 2000సం.లో దగ్ధమైందట.తేదీలు ఇస్తున్నారు.నమ్ముదాం.

ప్రధమ ప్రాకారమునకు దక్షిణమున ఓంకారనది(ఒగేరని పిలుస్తున్నారు)కోటప్పకొండ సమీపముగా ప్రవహించి మధ్యలో కొన్నివాగులను కలుపుకొని చీరాల వద్ద సముద్రంలో కలుస్తుందట.ఆలయమునకు ఉత్తరమున ఫర్లాంగ్ దూరములో (కుమారస్వామి ఉండడం వలన)కుమారస్వామికొండ ఉంది.గుడికి వెళ్లడానికి మెట్లున్నాయి.కొండ మీదకు వెళ్ళగానే అలసటతా ఎగిరిపోయి,వయస్సులు మర్చిపోయి మాలోపలున్న ఆట,పాట నృత్యకళాకారులు బయట కొచ్చారు.ఆ కొండల,కనుచూపుమేర కనిపిస్తున్న పచ్చని పంటపొలాల అందాలకు దాసోహమైపోయాం.మమ్మల్ని ప్రోత్సాహిస్తున్నట్లు కొండకింద పెళ్ళి మండపం (మాకు కనిపిస్తుంది)లోని మైక్ లోనుండి పాటలు మహాజోరుగా,హోరుగా వస్తున్నాయి.ఆటోలు దొరకవేమోనని అతిబలవoతంగా, కళ్ళనిండా,మనస్సు నిండా ఆప్రకృతి అందాలనుతాగి ఈసారి పొద్దున్నే వద్దాం అనుకుంటూ కొండ దిగేం.








చేజర్ల ఆలయంలో సంస్కృత,పాళిభాషలలో ఉన్న తొమ్మిది శాసనాలున్నాయి(ఓశాసనం రెండు వైపులా చెక్కబడి ఉంది).పెద్దఇటుకలపై నిర్మింపబడిన అడుగుబాగo,ఆలయనిర్మాణశైలి,గోపురం,శాసనాలు మొదలైన అనేక కారణాలవల్ల ఇది బౌద్ధచైత్యమని స్పష్టంగా తెలుస్తుంది. బౌద్ధచైత్యాలయాలు,గుడులు,చర్చీలు,మసీదులు ఏమైనా సరే భక్తికన్నా పురాతన,చారిత్రక కట్టడాలుగా కాపాడుకోవాలి.కానీ మనదేశంలో ముఖ్యంగా మనరాష్ట్రంలో అడుగడుగునా నిర్లక్ష్యంతో పాడుపెడుతున్నారు.చైనాలాంటి దేశాలలో ఈపురాతన కట్టడాలను బహుశ్రద్ధతో కాపాడుతున్నారని ఇటీవల చైనాను సందర్శించిన గిరిజ పైడిమర్రిగారు చెప్పారు.కపోతేశ్వర ఆలయం పేదగుడికాదు.చాలా గుడులు, లింగాలు, భూములున్నదే.

శ్రీకృష్ణదేవరాయలు 263ఎకరాల భూమిని మాన్యముగా ఇచ్చారట.263 ఎకరాలలో 28ఎ.అర్చకునికి,36ఎ. నాగార్జునసాగర్ కాలవల క్రింద పోయినా ఇంకా 198 ఎకరాల భూమి ఉందట.ఈ భూమి 89 మంది రైతులకు నామమాత్రపు కౌలు అనగా ఎకరా భూమి 400 నుండి 570రూ వరకు కౌలుకు ఇచ్చారట.ఏడాదికి ఒకలక్ష వరకు కౌలు వస్తుందట.

1950 వరకు నరసరావుపేట జమీందారులైన శ్రీ రాజమల్ రాజు ఆధిపత్యంలో ఉండగా తరువాత ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కిందకు వచ్చిందట. అనంతరము గర్భగుడి వెనుక జరిపిన తవ్వకాలలో పురాతన కట్టడములు బయల్పడటంతో కేంద్ర పురావస్తు శాఖ బౌద్ధ ఆరామ అవశేషాలు పరిరక్షించాల్సి ఉందంటూ 1972లో ఓబోర్డుపెట్టి,నలుగురు ఉద్యోగులను నియమించి ఊరకుందట.విరాళాలు,కానుకలు భారీగా ఇస్తామనేవాళ్ళు ఉన్నా, ఎండోమెంట్ పురావస్తుశాఖల మధ్య పొత్తులేక ఈపురాతన కట్టడాలు, శాసనాలు మురికిగా నిర్లక్ష్యంగా శిధిలస్థాయికి(మల్లికాకుండం,గిలకల బావి) చేరినాయి.

చేజర్లను సందర్శించేవాళ్లు 10 కిలోమీటర్ల దూరంలో నల్లమల్ల అడవి, కొండలఅందాల మధ్య ఉండే చారిత్రక ప్రాధాన్యత ఉన్న గుత్తికొండ బిలాలు కూడా చూడవచ్చు.ఇక్కడ అంతుపట్టని రహస్యాలకు కేంద్రంగా 101 సోరంగాలున్నట్లు చెబుతారు. శ్రీకృష్ణుడు ఇక్కడి బిలంలో దాక్కున్నాడని, బ్రహ్మనాయుడు యుద్ధంలో ఓడిపోయిన తర్వాత తపస్సు చేశాడని కథలు కూడా ఉన్నాయి.ఆచరిత్ర కన్నా ఇప్పుడు మనకు తెలిసిన ఆధునికచరిత్ర కూడా ఉంది.అటవీ ప్రాంతంలో ఉన్న ఈగుత్తికొండ గుహలలో చారు మజుందార్ 1968లో ఆంధ్ర కమ్యూనిస్టులతో రహస్య సమావేశం జరపటం ఓ చరిత్రే.

2004 అక్టోబర్ 11న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరపటానికి వచ్చిన పీపుల్స్ వార్,జనశక్తినాయకులు కామ్రెడ్స్ రామకృష్ణ,చలం,గాజర్ల రవి అమర్, రియాజులు లక్షల మందితో మీటింగు జరిపారు.ఈ బిలం దగ్గర చార్ మజుందార్ (అమరవీరుల)స్తూపాన్నీ ఆవిష్కరించి మావోయిస్టుపార్టీ ఏర్పడినట్లు ప్రకటించారు.ఈగుత్తికొండబిలం, చుట్టూ ప్రకృతిఅందాలు, శివాలయాలతోపాటు కమ్యూనిస్టులవేదికగా కూడా ప్రాముఖ్యతను సంతరించుకున్నది. కనుక చేజర్లతోపాటు పకృతిరమణీయతతో,రహస్యాలతో ఉన్న గుత్తికొండను దర్శించగలరని ఆశిస్తున్నాను.ప్రకృతిలోకి వెళదాం.ప్రకృతినికాపాడుదాం. స్వచ్ఛమైన గాలిని ఊపిరితిత్తుల నిండా పీల్చుకుందాం.మనసుకు,కళ్ళకు ఆనందాలను నింపుదాం. నలుగురితో కలిసిమెలిసి కొండలు,కోనలు,లోయలు జలపాతాలు తిరుగుతూ మానవ సంబంధాలను పెంపొందించుకుందాం.జై జై ప్రకృతి ప్రయాణానికి.

Tags:    

Similar News