అడవి ఒంటరి కాదు

నేటి మేటి కవిత : గీతాంజలి

Update: 2025-12-07 08:24 GMT

ఒంటరి దుఃఖాన్ని దాటడానికి

నేను ఒక 'ప్రేమ తర్వాత ప్రేమ' అన్న

వాల్కట్ ని ఆశ్రయించాను 

నేను నిన్ను ప్రేమించట్లేదు అంటూ

నిర్ధారించిన పాబ్లో నెరుడాని పలకరించాను!

ఇక బతకనే బతక కూడదు అని

నడుముకి రాళ్లు కట్టుకుని మునిగిపోయిన

వర్జీనియా వూల్ఫ్ బయటకు లాగాలని చూసాను.

ఓహ్ అతనిక రాడని మైక్రోవేవ్ లో

తలపెట్టి మరణించిన సిల్వియా ప్లాత్

చిద్ర మైన మస్తిష్కం లో మిగిలిపోయిన

ప్రేమాణువుల కోసం వెతికాను.

*

వీళ్ళంతా నా కవితా వాక్యాలుగా మారిపోతారు ఎందుకు?

ఆమె,ఆ సంపాదకురాలు

నన్ను గురించిన పరిచయం అడుగుతుంది.

ఎందుకు కథ రాసానో

కవిత్వం ఎలా ఆవహించిందో చెప్పమంటుంది.

*

కానీ ఎక్కడి నుంచి బయలుదేరానో

నడిచి,నడిచి పుస్తకాల తొవ్వల్లో

ఇదుగో వీళ్ళ దగ్గరికి చేరుకున్నాను

మార్క్స్,టాల్స్టాయ్, మార్క్స్వెజ్ ,సైమన్ దెబోర,

టోనీ మారిసన్,చలం ల దగ్గర

ఒక దుఃఖపు వాక్యం లా ఆగి

కొన్ని పదాలను మెడలో వేసుకుని

కొన్ని పూల అక్షరాలను

నా సజ్జలో తుంపుకుని ముందుకు నడిచాను.

*

నాకే తెలియదు వీళ్లంతా

నన్ను ఏడిపించారా నవ్వించారా

నిలబెట్టారా

నాకేమాత్రమూ తెలీదు!

ఎంత రాసినా

ఏం చేసినా

ఒక ఒంటరి వేదన

మళ్లీ కవిత్వంగానే ఉప్పొంగుతుంది.

**

ఆమెకేం చెప్పాలి?

నేను ఎలా మొదలయ్యాను

కవిత్వంగానా కథగానా అని

ఆమె అడుగుతూనే ఉంటుంది.

చెప్పు, పోనీ మనుషులంటే ప్రేమతో బయలుదేరావా

అయితే నువ్వు అందుకే రాస్తున్నావు కాబోలు?

అంటుంది ఏదో శ్లేషగా

*

జీవితం నిర్ధాక్షిణ్యంగా

ముక్కలు ముక్కలుగా

నన్ను ప్రపంచం నలుమూలలకి విసిరేసినప్పుడు,

ఒక పాలస్తీనా,ఒక మణిపూర్,ఒక కశ్మీర్,

ఒక జనతనరాజ్యం, ఒక కగార్

ఒక హిడ్మా, మరొక రాజే

అనేక సజీవ ఆదివాసీ దేహాలు

నాలోకి ప్రవేశించి,రక్తనాళాల్లో నిండినప్పుడు

ఒక కవిత్వంగా గానీ ,కథగా

పాటగానో మారక తప్పదు కదా?

*

అదే ఆమెకి చెప్పాను

ఆమె కూడా కవయిత్రి నాలాగా

నేనూ అదే వేదనలో ఉన్నాను

అని చెప్పింది

కన్నీళ్ళు తుడుచుకుని

రాయాల్సిందే అని కూడా చెప్పింది!

ఒంటరిగా ఉంటూనే బతికి తీరాలి అని చెప్పింది

ఒంటరి తనాన్నే

బలంగా మార్చుకోవాలని చెప్పింది.

ఆమె చాలా చెప్పింది

అందుకే మళ్ళీ కవిత్వం లోకి నడుస్తున్నాను

కవితా వస్తువు లోపలి నాలుగు దిక్కులా ఉన్న

మనుషుల ఆర్త నాదానాల కొసలు పట్టుకుని

రక్త కన్నీటి చారికల దారులెంబడి...

నడుస్తున్నాను.

ఆమె అంది కదా

చూడు కవిత్వం ఒక అరణ్యం !

అమరత్వాల త్యాగాలను,

అక్షర ఆయుధాలను దాచుకునే ఒక పుస్తకం

అనాది ఆదిమ పరిమళం!

అరణ్యం అనేకం,సమూహం! బయలుదేరు అంది.

అలా కవిత్వం

నన్ను అడవిదాక తీసుకొచ్చింది.

కవిత్వం అలా నన్ను

సమూహంలోకి తెచ్చి నిలబెట్టింది

ఒంటరి దుఃఖాన్ని దాటడానికి

నాలోని ఆమెనే నాకు దారి దీపం అయింది.

Tags:    

Similar News