ఆధునిక వాగ్గేయులంతా ఆధిపత్య రాజకీయ గాయకులేనా?

కపాకర్ మాదిగ అభిశంష

Update: 2025-11-14 02:30 GMT

-కృపాకర్ మాదిగ


ఈ వాగ్గేయం మాదిగ హక్కుల పంపిణీ ఉద్యమానికి తటస్థ గేయం.ఆధిపత్య సంస్కృతుల పద్దుల పద్యం.బహుశా ఆధునిక వాగ్గేయాలన్నీ ఇంతేనేమో?

సామాన్యులుగా ఉండి,అణగారిన సమాజాల స్వయం గౌరవ ఉద్యమాలకు తటస్థంగా ఉండే వారిని ఏమీ అనాల్సిన పనిలేదు.కానీ, "ఉద్యమ స్వభావం" కలర్ తో ప్రముఖులై ఉండి,తన కాలంలో లేదా సమకాలీనంలో జరిగే,ఏ అత్యంత అణగారిన వర్గాల సామాజిక ఉద్యమాలనూ బలపరచని,ఏ ప్రముఖ వ్యక్తి చైతన్యమైనా అవకాశవాదంతో కూడుకున్నదే.లేదా అనుమానించదగ్గదే.
నీ సాంఘిక అస్తిత్వం అణగారిన సమూహానిదై ఉండి, నువ్వు వాగ్గేయ ప్రముఖత్వం సంపాదించుకొని వుండి,నీ స్వీయ లేదా మార్జినలైజ్డ్ సమూహం దశాబ్దాలుగా, ప్రముఖంగా హక్కుల కోసం ఉద్యమిస్తున్నపుడు నీ వాగ్గేయం పట్టించుకోకపోతే,నువ్వు ఎవరి పక్షాన ఉన్నట్టు? నీ వాగ్గేయంతో లబ్ది పొందిన సమూహాలతో,నీతో మాకేం పనీ? నీ అమూర్త మానవత్వ అదృశ్య కీర్తనలతో ఏ సమూహాలను సంతృప్తిపరిచినట్టు? సంతోష పెట్టినట్టు? బాధితులకు సహానుభూతి ప్రకటించని నీ వాగ్గేయం ఎందుకు? అణగారిన సొంత కుల అస్తిత్వాన్ని వదులుకునే నీ స్థావర జంగమ స్పృహ దేనికీ ఆధిపత్య రాజకీయాల కవి వాగ్గేయా?
ఎలాంటి ప్రముఖత్వం అనేదైనా "సామజిక పెట్టుబడి" తో వచ్చేదే.ఎలాంటి ప్రముఖుడు ఐనా,ఏ సోషల్ జాగ్రఫీ వ్యక్తియైనా,అతడు/ఆమె ప్రముఖత్వాన్ని తన కాలంలో జరిగే అణగారిన సమూహాల "పంపిణీ న్యాయం, మానవగౌరవ ఉద్యమాల" పట్ల సంఘీభావ ప్రముఖంగా ఉన్నారా? తటస్థంగాగా ఉన్నారా? వ్యతిరేకంగా ఉన్నారా? అనే కొలమానాలతోనే కొలవాలి.అప్పుడే ఆ ప్రముఖ వ్యక్తి కులవర్గ స్వభావం న్యాయమైనదో కాదో తెలుస్తుంది. ఏ సామాజిక ఉద్యమ సంఘంలోనూ,ఏ స్థాయీ కమిటీలో సభ్యులు కాని కొంత మంది గాయకుల్ని మనువాద మీడియా విపరీతంగా పైకి లేపడం రాముని మీడియా ఆంజనేయుణ్ణి పైకి లేపడం వంటి రాజకీయంగానే అర్థం చేసుకోవాలి.
సమాజం అణచివేతకు గురవుతున్న - అణచివేసే శత్రు సమూహాలుగా విడిపోయి ఉన్నపుడు,ఆధిపత్యాల శత్రు అస్తిత్వాలపై,వారి ఉద్యమాలపై ఆలాపనలు చేస్తూ,స్వీయ, మిత్ర అస్తిత్వాలను గాలికొదిలేసి,అమూర్త మానవత గురించి గానం చేస్తూ,కారకుల నొదిలేసి,కార్యాల గురించీ పాడే యీ "వాగ్గేయాలు" ఎవరికి ఉపయోగపడుతున్నట్టు? "రాముడుండాల,త్రివర్ణ రాజ్జముండాల,అన్ని రంగాల్లో వారిని మోసే అణగారిన సమూహాల ఆంజనేయుళ్ళు, అంజమ్మలూ ఉండాల" అనే కాడనే,వాటి చుట్టూతానే మన వాగ్గేయుల బతుకులు ఇప్పటికీ తిరుగుతుండటం అత్యంత దయనీయ భావ దారిద్య్రం.
అణగారిన సమూహాలు ఇప్పటికిప్పుడు గెలవకపోవచ్చు. కానీ,వారి దారులు,దృక్పథాలు స్పష్టమై ఉన్నాయి.ఈ సంగతులన్నీ మన వాగ్గేయాలకు స్పష్టంగా తెలుసు.ఐనా, వనరులు,అవకాశాల ముష్టి వేసే రాజ్య భాగస్వామ్య ఆధిపత్య సమూహాల రాజకీయ సాంస్కృతిక అస్తిత్వాలను శ్లాఘించటంలోనే యీ వాగ్గేయులు స్వయంతృప్తిని, సామాజిక సంతృప్తిని వెతుక్కోవడం బాగా విసుగు పుట్టించే అంశం.నా భావం ఎవరికి వర్తిస్తే వారికి.లేదా ఎవరికైనా వర్తింపజేసే స్వేచ్ఛను ఎవ్వరూ వదులుకోవద్దు.
మనం మనకి,లేదా మన కుల తరగతి కి ప్రాతినిధ్యం వహించడం ఇప్పుడు గొప్ప సంగతి కాదు.మన కంటే అణగారి వున్న,అట్టడుగున ఉన్న,మూగ సమూహాలకు సౌహార్ద్రత,సహానుభూతితోనుండగలగడం,వారి పక్షాన ఉండటం మంచి విషయం.గొప్ప సంగతి.ఈ తత్వం, బాధ్యతనూ మనం ప్రకటించకపోతే మన బతుకుల అర్థం వ్యర్ధమే.నిక్కంబుగా భావ దారిద్య్రంతో వెనకబడ్డవారమే అవుతాము.మాదిగ దండోరా ఉద్యమం అన్ని అణగారిన కులాలకు పంపిణీ న్యాయం, మానవ గౌరవం అందించాలని ఉద్యమించింది.యీ విధమైన సర్వేజనా సుఖినోభవంతు తత్వంతో లేకపోతే ఎవరి ప్రముఖత్వానికైనా అర్థం ఏముంటుంది వాగీశులూ?


Tags:    

Similar News