ఢిల్లీలో కుండపోత వాన: విమానాశ్రయంలో కూలిన టెర్మినల్ పైకప్పు

ఢిల్లీలో తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. విమానాశ్రయంలో టెర్మినల్ పైకప్పు కూలిపోయింది. ఈ ఘటనలో ఒకరు చనిపోయారు.

Update: 2024-06-28 10:25 GMT

ఢిల్లీలో గత 88 ఏళ్ళలో ఎన్నడూ లేని స్థాయిలో కుండపోత వర్షం కురిసింది. గత 24 గంటల్లో 23 సెం.మీ. వర్షపాతం నమోదయింది. తెల్లవారుజామునుంచి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరాయి. వాహనాలు నీట మునిగాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్‌ ఏర్పడింది. ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లేందుకు గంటల సమయం పట్టింది. విద్యార్థులు స్కూళ్లకు వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు. కొన్నిప్రాంతాల్లో మోకాళి లోతు నీరు నిలిచిపోయింది.

ద్వారక, జంగ్‌పురాతో సహా చాలా ప్రాంతాల్లో విద్యుత్తు అంతరాయం ఏర్పడింది. ముందు జాగ్రత్తగా మింటో రోడ్‌, ఆజాద్‌ మార్కెట్‌ అండర్‌ పాస్‌లను మూసివేశారు. కర్తవ్య మార్గం, ఐటీవో, వీర్ బండా బైరాగి మార్గ్, ఔటర్ రింగ్ రోడ్, ఆజాద్ మార్కెట్ అండర్‌పాస్, ధౌలా క్వాన్ ఫ్లైఓవర్, మింటో రోడ్ మీదుగా వెళ్లే వారు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచనలు జారీ చేశారు.

షటిల్ సర్వీసు రద్దు..

ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ యశోభూమి సెక్టార్ 25 ద్వారక వద్ద ప్రవేశ, నిష్క్రమణ గేట్లను మూసివేసింది. ఢిల్లీ ఏరోసిటీ మెట్రో స్టేషన్ నుంచి టెర్మినల్ 1-ఐజిఐ విమానాశ్రయానికి షటిల్ సర్వీస్ కూడా నిలిపేశారు.

కూలిన టెర్మినల్ పైకప్పు..

ఢిల్లీ విమానాశ్రయంలో టెర్మినల్ 1 పైకప్పులో కొంతభాగం కూలిపోయింది. ఈ ఘటనలో ఒకరు మరణించారు. రూఫ్ షీట్‌తో పాటు, సపోర్ట్ బీమ్‌లు కూలిపోవడంతో టెర్మినల్ పిక్-అప్ అండ్ డ్రాప్ పాయింట్లలో పార్క్ చేసిన కార్లు దెబ్బతిన్నాయి. వాటిల్లో చిక్కుకుపోయిన వారిని వెంటనే గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రికి తరలించారు.

మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా..

"టెర్మినల్ 1 నుంచి విమానాలు రాకపోకలను రద్దు చేశాం. విమానాల సజావుగా నడపడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చురుకుగా జరుగుతున్నాయి" అని పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.

ఈ ఘటనలో మృతుల ఒక్కో కుటుంబానికి రూ. 20 లక్షలు, గాయపడిన వారికి రూ. 3 లక్షలు అందజేస్తామని ప్రకటించారు.

రోజుకు 1400 విమానాల రాకపోకలు..

T1, T2, T3 - ఈ మూడు టెర్మినల్స్ ద్వారా రోజుకు దాదాపు 1,400 విమానాలు రాకపోకలు సాగిస్తాయి. అయితే T1 టెర్మినల్ ద్వారా ఇండిగో, స్పైస్‌జెట్ విమానాలు డొమెస్టిక్ సేవలను అందిస్తున్నాయి.

"ప్రయాణికులు టెర్మినల్‌ 1 లోకి ప్రవేశించే అవకాశం లేని కారణంగా విమానాల రాకపోకలను రద్దు చేశాం. ఇప్పటికే టెర్మినల్ లోపల ఉన్న ప్రయాణీకులు వారి గమ్యస్థానాలకు తీసుకెళ్తాం. రేపు ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకున్న వారికి సమాచారం అందిస్తాం" అని ఇండిగో పేర్కొంది.

బురదలో చిక్కుకున్నకార్మికులు..

నైరుతి ఢిల్లీలోని వసంత్ విహార్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న గోడ కూలడంతో ముగ్గురు భవన నిర్మాణ కార్మికులు బురదలో చిక్కుకుపోయారు.

చిక్కుకున్న కార్మికులు పక్కన ఉన్న లోతైన గొయ్యిలోకి దిగి ఉంటారనే ఢిల్లీ ఫైర్ సర్వీస్ (DFS) అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి తెల్లవారుజామున 5.30 గంటలకు తమకు సమాచారం అందిందని ఢిల్లీ ఫైర్ సర్వీస్ (DFS) అధికారులు తెలిపారు. సహాయక చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. అయితే ఇంకా ఎంతమంది బురదలో చిక్కుకున్నారన్నది తెలియరాలేదని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

సమీక్షా సమావేశం..

పరిస్థితిని సమీక్షించేందుకు ఢిల్లీ ప్రభుత్వం మధ్యాహ్నం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కేబినెట్‌ మంత్రులు, సీనియర్‌ ప్రభుత్వ అధికారులు హాజరవుతారని అధికారులు తెలిపారు.

ప్లాస్లిక్ వ్యర్థాల వల్లే..

డ్రైనేజీలు కాలువలు ప్లాస్టిక్‌ వ్యర్థాలతో నిండిపోవడంతోనే లోతట్టు ప్రాంతాలు జలమయం కావడానికి, రోడ్లపై వర్షం నీరు నిలిచిపోయిందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ పేర్కొన్నారు.

"మేము సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించాం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లను మూసివేయాలని ఢిల్లీ ప్రభుత్వ పరిశ్రమల శాఖను చాలాసార్లు కోరాం. కాని ఢిల్లీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.’’ అని ఆయన పేర్కొన్నారు.

బీజేపీ కౌన్సిలర్ రవీందర్ సింగ్ నీట మునిగిన వీధిలో పడవను నడుపుతున్నట్లు ఒక వీడియో చూపించారు.‘‘గత నెల రోజులుగా డ్రైన్‌లను శుభ్రం చేయాలని పోరాడుతున్నాం.. కానీ ఢిల్లీ ప్రభుత్వం చేసిందేమీ లేదు.. ఫలితంగా ఈరోజు నగరమంతా ముంపునకు గురవుతోంది.’’ అని పోస్టు చేశారు.

Tags:    

Similar News