ఇండిగోపై DGCA ఎఫెక్ట్..

షెడ్యూల్లో 5 శాతం కోత ..

Update: 2025-12-09 10:04 GMT
Click the Play button to listen to article

విమానాల రాకపోకలకు అంతరాయం కలిగించిన ఇండిగో (IndiGo) యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని పౌర విమానయాన మంత్రి రామ్ మోహన్ నాయుడు( Minister Ram Mohan Naidu) పేర్కొన్నారు. అలాగే విమానయాన నియంత్రణ సంస్థ ఇండిగోపై చర్యలు తీసుకుంది. శీతాకాలానికి సంబంధించి ఇండిగో షెడ్యూల్లో 5 శాతం కోత విధిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. మంగళవారం లోక్‌సభలో ఇండిగో సంక్షోభాన్ని ప్రస్తావిస్తూ.. ఇక ముందు ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే ఏ విమానయాన సంస్థను ఉపేక్షించేది లేదన్నారు. నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే ఇండిగో యజమాన్యానికి షోకాజ్ నోటీసు జారీ చేశామన్నారు. ఇక నుంచి నిబంధనలను పూర్తిగా పాటిస్తామని ఇండిగో స్పష్టంగా హామీ ఇచ్చిందని పేర్కొన్నారు.


‘సంఖ్య పెరుగుతోంది..’

"డిసెంబర్ 6న 706కి పడిపోయిన ఇండిగో రోజువారీ విమానాలు నిన్న 1800కి పైగా తిరిగాయని, నేడు ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా ఇతర విమానయాన సంస్థల కార్యకలాపాలు సజావుగా కొనసాగిస్తున్నాయి.’’ అని వివరించారు.


'భద్రత విషయంలో రాజీపడం'

ప్రయాణీకుల భద్రత విషయంలో ఎటువంటి రాజీ ఉండదని స్పష్టం చేసిన నాయుడు..భారతదేశం అంతర్జాతీయ ప్రయాణీకుల భద్రతకు కట్టుబడి ఉందన్నారు. 


DGCA కీలక నిర్ణయం..

ఇండిగో విమాన సర్వీసులపై విమానయాన నియంత్రణ సంస్థ (DGCA) కీలక నిర్ణయం తీసుకుంది. శీతాకాలానికి సంబంధించి ఇండిగో షెడ్యూల్లో 5 శాతం కోత విధిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం ఈ విమానయాన సంస్థ రోజుకు 2,200 విమానాలు నడుపుతుంది. తాజా కోత నేపథ్యంలో ఒక రోజులో 100కు పైగా విమాన సర్వీసులు తగ్గనున్నాయి. అన్ని మార్గాల్లో ముఖ్యంగా ఎక్కువ డిమాండ్‌ ఉన్న మార్గాల్లో సర్వీసులను తగ్గిస్తున్నట్లు తెలిపింది. సవరించిన షెడ్యూల్‌ వివరాలను బుధవారం సాయంత్రం 5 గంటల లోపు తమకు అందించాలని ఇండిగోకు ఆదేశించినట్లు పేర్కొంది. ఈ కోత విధించిన మార్గాలను ఇతర విమానయాన సంస్థలకు తిరిగి కేటాయించనున్నట్లు వివరించింది.

Tags:    

Similar News