కశ్మీర్ లో చైనీయుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
లేహ్, జస్కర్ వంటి సున్నిత ప్రాంతాలను రెండు వారాలుగా సందర్శించిన హు కాంగ్తాయ్
By : The Federal
Update: 2025-12-09 09:05 GMT
జమ్మూకశ్మీర్, లఢక్ లో పర్యటిస్తున్న చైనీస్ ను భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. వీసా నిబంధనలు ఉల్లంఘన, వ్యూహాత్మక ప్రాంతాలను ఎలాంటి అనుమతి లేకుండా సందర్శించిన కారణంగా అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించాయి. అతడి ఫోన్ ను ప్రస్తుతానికి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. ఏదైన సున్నితమైన సమాచారం విదేశాలకు పంపారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.
లేహ్, జస్కర్ లో పర్యటన..
చైనీస్ నుంచి వచ్చిన వ్యక్తిని హూ కాంగ్తాయ్(29) గా గుర్తించారు. నిందితుడు ఢిల్లీ నుంచి టూరిస్ట్ వీసా తీసుకుని జమ్మూకశ్మీర్ కు వచ్చినట్లు గుర్తించారు. ఫారెనర్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో పేరు నమోదు చేసుకోకుండా నిషేధిత ప్రాంతాలమైన లేహ్, జస్కర్ ప్రాంతాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతంలో సందర్శించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
చైనీయుడు జస్కర్ ప్రాంతంలో మూడు రోజులు గడిపినట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా కొన్ని కీలకమైన సున్నితమైన ప్రాంతాలను ఫోటో తీసినట్లు గుర్తించారు. బుద్దిస్ట్ ప్రాంతాలలో సంచరించినట్లు తెలిసింది.
వారణాసి, ఆగ్రా, న్యూఢిల్లీ, జైపూర్, సారనాథ్, గయ, కుషినగర్ వంటి కొన్ని ఎంపిక చేసిన బౌద్ధ మత ప్రాంతాలను మాత్రమే సందర్శించడానికి అనుమతి ఉంది. హు కాన్టేయ్ మూడు రోజుల పాటు జాంస్కర్ లో ఉన్నారని, ఆ సమయంలో ఆయన మఠాలు, ఇతర వ్యూహాత్మక ప్రదేశాలను సందర్శించినట్లు తెలిపారు.
కొన్ని సున్నితమైన ప్రాంతాలలో హవర్వాన్ లోని బౌద్ధ విహారం, దక్షిణ కాశ్మీర్ లోని అవంతిపొరాలోని బౌద్ధ శిథిలాలు ఉన్నాయి. ఇవి ఆర్మీ ప్రదేశానికి అతి దగ్గరగా ఉన్నాయి.
భారతీయ సిమ్ కార్డ్
భారత్ కు వచ్చిన తరువాత హు కాన్టేయ్ చట్టవిరుద్దంగా భారతీయ సిమ్ కార్డును కొనుగోలు చేశాడని దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఇది మరిన్ని అనుమానాలు తావిచ్చింది. అతని బ్రౌజింగ్ చరిత్ర ప్రకారం.. సీఆర్పీఎఫ్ విస్తరణ, అధికరణ 370 రద్దు వంటి వాటిని సెర్చ్ చేశాడు. అయితే గూగుల్ నుంచి మరేదైన వాటిని శోధించి తరువాత తొలగించాడా? అనేది పరిశీలిస్తున్నారు.
విచారణ సమయంలో వీసా నిబంధనల ఉల్లంఘనల గురించి తనకు తెలియదని అతను చెప్పినప్పటికీ, అధికారులు అతని ఉద్దేశ్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తాను బోస్టన్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నానని, గత తొమ్మిది సంవత్సరాలుగా అమెరికాలోనే నివసిస్తున్నట్లు తెలిపినట్లు జాతీయ మీడియా నివేదించింది.
హు కాంగ్టాయ్ ట్రావెలర్ అని తనకు తాను చెప్పుకున్నాడు. అతని పాస్ పోర్ట్ లో అమెరికా, న్యూజిలాండ్, బ్రెజిల్, ఫిజి, హాంకాంగ్ దేశాలను సందర్శించినట్లు వివరాలు ఉన్నాయి.
నవంబర్ 20 న లెహ్ కు..
నవంబర్ 20న హు కాంగ్తాయ్ లేహ్ కు వెళ్లాడు. విమానాశ్రయంలో విదేశీయుల స్క్రీనింగ్ ను తప్పించుకుని ఇతర ప్రయాణికులతో కలిసి పోయాడు. లఢక్ లో ఉన్నప్పుడూ అను జస్కర్ ప్రాంతంలో అనేకు గుడారాలు మారినట్లు తెలిసింది. ప్రస్తుతం చైనీస్ ను శ్రీనగర్ విమానాశ్రాయానికి సమీపంలోని బుడ్గాం జిల్లాలోని హుమ్హామా పోలీస్ పోస్ట్ కు తరలించారు. అక్కడ పోలీసులు అతడిని ప్రశ్నిస్తున్నారు.
హోటళ్లపై కఠిన చర్యలు..
నిర్భంధం తరువాత, విదేశీ సందర్శకుల బసను తెలిపే ఇమ్మిగ్రేషన్, విదేశీయుల చట్టం ప్రకారం తప్పనిసరి పత్రం అయిన ఫారం- సి ని దాఖలు చేయడంలో విఫలమైనందున జేకే పోలీసులు శ్రీనగర్ హోటళ్లు, హోమ్ స్టేలు, హౌజ్ బోట్ లపై విస్తృత స్థాయిలో చర్యలు ప్రారంభించారని నివేదిక పేర్కొంది.
పోలీసులు ఇప్పటి వరకూ దీనిపై ఐదు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారని తెలిసింది. అనేక సంస్థలు అవసరమైన రిపోర్టింగ్ విధానాలను పూర్తి చేయకుండా విదేశీ పౌరులకు వసతి కల్పించాయని గుర్తించారు.
సరైన నిబంధనలు లేకుండా రష్యా, ఇజ్రాయెల్, రోమేనియా, స్పెయిన్ దేశాల ప్రయాణికులు ఉన్నారు. హు కాంగ్తాయ్ లఢక్, కశ్మీర్ లో రెండువారాలుగా ఎలా స్వేచ్ఛగా తిరగగలిగాడని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది స్థానికంగా ఉన్న లోపాలను హైలైట్ చేసింది.