బీహార్ ఎన్నికల ఫలితాల్లో కొట్టుకుపోయిన ఏపీ పెట్టుబడిదారుల సదస్సు
సదస్సుకు 72 దేశాల ప్రతినిధులు వచ్చారని నిర్వాహకులు చెప్పినా జాతీయ మీడియాలో దాని ప్రస్తావన లేకుండా పోయింది.
By : The Federal
Update: 2025-11-14 08:22 GMT
ఓపక్క పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి.. మరోపక్క బీహార్ ఎన్నికల ఫలితాలు.. ఈ రెండింటి మధ్య చంద్రబాబు పెట్టిన సీఐఐ భాగస్వామ్య సదస్సు. అందమైన నగరంగా పేరొందని విశాఖపట్నంలో సదస్సు పెడితే బీహార్ ఎన్నికల ఫలితాలతో అది కాస్తా ఇవాళ కనిపించకుండా పోయింది. ఈ సదస్సుకు 72 దేశాల ప్రతినిధులు వచ్చారని నిర్వాహకులు చెప్పినా జాతీయ మీడియాలో దాని ప్రస్తావన లేకుండా పోయింది.
ఈ రాజకీయ ప్రళయం మధ్యలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో గొప్పగా నిర్వహిస్తున్న CII Partnership Summit–2024 మొదటి రోజు జాతీయ స్థాయిలో పూర్తిగా కనుమరుగయ్యింది.
విశాఖపట్నంలో 72 దేశాల ప్రతినిధులు, 1,800కు పైగా డెలిగేట్లు హాజరయ్యారని నిర్వాహకులు గర్వంగా చెబుతున్నా - జాతీయ మీడియా మొత్తం బీహార్ ఎన్నికల వైపే దృష్టిసారించింది. ఏపీ పెట్టుబడుల సదస్సుకు ఈరోజు జాతీయ స్థాయి కవరేజీ దాదాపు లేకుండా పోయింది.
243 నియోజకవర్గాల ఫలితాల డ్రామా, NDA–INDIA పోరు, ప్రతి రౌండ్‌లో మారిన ట్రెండ్స్ ను జాతీయ చానెల్స్ అన్ని LIVE కవరేజ్‌ను పూర్తిగా బీహార్‌పైనే పెట్టాయి. ఈ రాజకీయ హీట్‌లో AP పెట్టుబడుల సదస్సు స్టోరీ కనుమరుగైంది.
నిజానికి విశాఖలో ఇటువంటి అంతర్జాతీయ ఈవెంట్ జరుగుతుండటం సాధారణ విషయం కాదు.
కానీ మీడియా అజెండాను రాజకీయాలే మింగేశాయి.
రేపటి రోజునైనా కవరేజీ వస్తుందా?
అయితే, సదస్సు నిర్వాహకులు, రాష్ట్ర ప్రభుత్వం రేపు జరిగే Day-2 పై చాలా నమ్మకంతో ఉన్నారు. బీహార్ ఎన్నికల ఫలితాల ఉత్కంఠ ఈరోజుకే క్లైమాక్స్‌కు చేరింది. రేపు రాజకీయ గందరగోళం తగ్గొచ్చు. MoUs సంతకాలు, ముఖ్య ప్రసంగాలు, అంతర్జాతీయ CEO మీటింగ్స్ రేపు ఎక్కువగా ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే అవకాశం ఉంది.
జాతీయ మీడియా “Investment Focus” మోడ్‌లోకి రావొచ్చునని ప్రభుత్వం ఆశిస్తోంది. తొలిరోజులో తప్పిపోయిన కవరేజీ రెండో రోజు తిరిగి వస్తుంది అని విశాఖలో సదస్సుకు హాజరైన ఓ సీనియర్ జర్నలిస్టు చెప్పారు.
చంద్రబాబు ప్రభుత్వానికి ఇది కీలక పరీక్ష
2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత AP ప్రపంచ పెట్టుబడులకు సిద్ధమైందని చూపించడానికి ఈ సదస్సు రాజకీయంగా, ఆర్థికంగా, ప్రతిష్టాపరంగా కీలకమైంది. భారీ MoUs, వ్యూహాత్మక ఒప్పందాలు, విదేశీ పెట్టుబడిదారులతో కీలక సమావేశాలు జరుగుతున్నాయి.
ఉపరాష్ట్రపతి రాక..
తొలిరోజు జరిగిన సమావేశానికి ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస వర్మ పాల్గొన్నారు. ఈ సదస్సుకు సీఐఐ అధ్యక్షుడు రాజీవ్ మెమానీ, సీఐఐ డైరెక్టర్ చంద్రజిత్ బెనర్జీతోపాటు దేశవిదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు.