తెలుగు జాతికి చాలా విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి: సీఎం చంద్రబాబు
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ పెడితే, పొట్టి శ్రీములు నెల్లూరు జిల్లాగా నెల్లూరుకు పేరు పెట్టానని చంద్రబాబు అన్నారు.;
By : The Federal
Update: 2024-12-15 10:32 GMT
తెలుగు జాతికి చాలా విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయని, తెలుగు జాతి పలు మార్లు విడిపోయింది.. కలిసిందని.. దీని వల్ల అనేక ఇబ్బందులు పడ్డామని సీఎం చంద్రబాబు అన్నారు. మన తెలుగు వాళ్లు నాడు తెలుగు వారి హక్కుల కోసం ఎన్నో ఉద్యమాలు చేశారని, అభివృద్ధి చేయడం.. మళ్లీ కొత్త రాజధానికి వెళ్లడం మన తెలుగు వాళ్లకు పరిపాటిగా మారిందని అన్నారు. తెలుగు జాతి కోసం తన ప్రాణాలను పణంగా పెట్టి పోరాటం చేసిన పొట్టి శ్రీరాములు అని అన్నారు.
శ్రీ పొట్టి శ్రీరాములు ఎన్నో సామాజిక ఉద్యమాలు చేశారని, షెడ్యూల్డ్ కులాల వారి హక్కుల కోసం కూడా చేశారని అమరజీవి పొట్టి శ్రీరాములు 72వ వర్థంతి సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం పొట్టి శ్రీరాములు ఆత్మార్పణం దినం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ త్వరలో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీని ఏర్పాటు చేస్తామన్నారు. తెలుగు వారి కోసం త్యాగం చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని అన్నారు. ఆయన త్యాగాల ఫలితే మనమంతా తెలుగు వాళం అంటున్నామని అన్నారు. నేడు ఆమరణ దీక్షలు ఎలా ఉన్నాయో అందరు చూస్తున్నారని, కానీ నాడు పొట్టి శ్రీరాములు చేసిన ఆమరణ దీక్ష ఫలితంగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఆవిర్భవించాయన్నారు.
అయితే ఆయన కాడి మోసేందుకు నలుగురు రాకపోవడం చాలా బాధకరమని అన్నారు. కనీసం మద్ధతు తెలిపేందుకు కూడా నాయకులు రాలేదన్నారు. అయినా పొట్టి శ్రీరాములు తన పట్టుదల వీడ లేదని, తాను అనుకున్నది నెరవేర్చారని అన్నారు. పొట్టి శ్రీరాములు పుట్టిన గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని, ఆయన ఇంటిని మెమోరియల్‌గా చేస్తామని, రాజధాని అమరావతిలో స్మృతి వనం ఏర్పాటు చేస్తామని అన్నారు. పొట్టి శ్రీరాములు పేరుతో ఎన్టీఆర్ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీ ఏర్పాటు చేస్తే.. తాను నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా పేరు పెట్టానని చెప్పారు. నేడు సర్థార్ వల్లభాయ్ పటేల్ వర్థంతి కూడా అని, దేశ ఐక్యత కోసం పోరాటం చేసిన ఉక్కు మనిషిగా నిలిచిపోయారని అన్నారు.