అవినీతికి వ్యతిరేకంగా బిచ్చగాళ్లతో ర్యాలీ !

అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్బంగా వినూత్న కార్యక్రమం.

Update: 2025-12-09 13:10 GMT

అవినీతి.. ప్రస్తుతం సమాజం ముందు ఉన్న అతిపెద్ద ఛాలెంజ్. తాజాగా ఈ అవినీతికి వ్యతిరేకంగా వరంగల్ జిల్లా హనుమకొండలో జ్వాలా స్వచ్ఛంద సేవా సంస్థ, లోక్ సత్తా ఉద్యమ సంస్థ సంయుక్తంగా వినూత్రం కార్యక్రమం చేపట్టాయి. అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈ రెండు సంస్థలు కలిసి బిచ్చగాళ్ల ద్వారా ర్యాలీ చేయించాయి. అవినీతి పరులకంటే బిచ్చగాళ్లే నయం అంటూ ప్లకార్డ్‌లు సైతం ప్రదర్శించారు. ఈ ర్యాలీ హనుమకొండలోని వేయిస్తంభాల ఆలయం నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు కొనసాగింది. రాష్ట్రంలో, దేశంలో రోజురోజుకు అధికం అవుతున్న అవినీతిపై అవగాహన పెంచడం కోసమే తాము ఈ ర్యాలీ చేయిస్తున్నట్లు నిర్వాహకుడుసుంకరి ప్రశాంత్ పేర్కొన్నారు.

అవినీతిపరుల్లో మార్పు రావాలని కోరుకుంటున్నామని ఆయన అన్నారు. అంతేకాకుండా అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కూడా ఆయన కోరారు. ఈ ర్యాలీని చూసిన తర్వాత అయినా లంచాలు తీసుకునే వారు మానుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న జీతాలు తీసుకుంటూ కూడా లంచాలు తీసుకోవడం దారుణమన్నారు.

డబ్బులు ఇస్తేనే పనులు చేస్తామని మరికొందరు వ్యవహరిస్తున్నారని, దానిని అడ్డుకోవాల్సిన బాధ్యత అందరిదీ అని ఆయన అన్నారు. ఈ అవినీతి అడ్డుకోవడం కోసం ఏసీబీ ప్రతిరోజూ అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఏసీబీ అధికారులు ఎందరిని అదుపులోకి తీసుకుంటున్నా మిగిలిన వారిలో మార్పు రావడం లేదని వారు పేర్కొన్నారు. అయితే ఇటీవల హనుమకొండ అదనపు కలెక్టర్, ఇన్‌ఛార్జ్ డీఈఓ వెంకట్ రెడ్డిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో మంగళవారం పలు సంస్థలు కలిసి చేపట్టిన అవినీతి వ్యతిరేక దినోత్సవ ర్యాలీకి ప్రాధాన్యం సంతరించుకుంది.

అదనపు కలెక్టర్ ఏం చేశారంటే..

డిసెంబర్ 5న హనుమకొండ కలెక్టరేట్‌లో ఏసీబీ అధికారులు శోధనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ ప్రైవేట్ స్కూల్ రెన్యువల్ కోసం లంచం తీసుకుంటున్న సమయంలో హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డిని రెడ్‌హ్యాండెడ్‌గా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన హనుమకొండ డీఈవోగా కూడా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. స్కూల్ రిన్యువల్‌కు సంబంధించి లంచం డిమాండ్ చేసి రూ.60 వేల మొత్తాన్ని స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

Similar News