బిఆర్ఎస్, కాంగ్రెస్ దొందు దొందే

ధర్నా చౌక్ లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Update: 2025-12-07 12:53 GMT
Central Minister Kishan Reddy and BJP Telangana President N Ramachandra Rao at a Dharna

పదేళ్ల బీఆర్‌ఎస్ పాలన తెలంగాణ రాష్ట్రాన్ని  అప్పుల ఊబిలోకి నెట్టేస్తే , కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయినా తీరు మారలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం బిజెపి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర జరిగిన ధర్నాలో ఆయన ప్రసంగిస్తూ బూటకపు హామీలతో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ విజయోత్సవాలు జరుపుకుంటోందన్నారు. నయవంచన పాలన పేరుతో హైదరాబాద్ ఇందిరా పార్కు, ధర్నా చౌక్ వద్ద బీజేపీ మహాధర్నా నిర్వహించింది. ఈ ధర్నాలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంపై ఛార్జ్‌షీట్ను కిషన్‌రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  కేసీఆర్ కుటుంబ పాలనపై విసిగిపోయిన ప్రజలు, కాంగ్రెస్ ఇచ్చిన మాయా హామీలను నమ్మి ఓటు వేసి అధికారం కట్టబెట్టారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా, హస్తం పార్టీ ఇచ్చిన హామీలలో ఉచిత బస్సులు, సన్న బియ్యం పథకాలు తప్ప మిగతావాటిని అమలు చేయలేదని కిషన్ రెడ్డి విమర్శించారు.


కాంగ్రెస్ ను గద్దె దించేవరకు పోరాటం: రాంచందర్ రావు


తెలంగాణలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వంచిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు బిజెపి పోరాటం కొనసాగుతుందని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ భూములను వేలం వేసే పాలసీతో ముందుకు సాగుతోందన్నారు.  గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇండస్ట్రియల్ భూములను భారీ స్థాయిలో ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేసింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మిగిలిన  భూములను రియల్ ఎస్టేట్ లాబీలకు దారాదత్తం చేస్తోందని ఆయన అన్నారు. గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు, 420 హామీలతో ప్రజలను నమ్మించింది. కానీ ఒక్క గ్యారంటీని కూడా అమలు చేయలేదని అన్నారు.  ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ రైజింగ్ ఎలా అవుతుంది? ఇది తెలంగాణ రైజింగ్ కాదు,  తెలంగాణ సింకింగ్ అని  రాంచందర్ రావు ఎద్దేవాచేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ “కాంగ్రెస్ అంటే ముస్లింలు… ముస్లింలంటే కాంగ్రెస్” అని స్పష్టంగా చెప్పిన విషయాన్ని రామచంద్రరావు గుర్తుచేశారు.  రేవంత్ వ్యాఖ్యలే హిందువులపై కాంగ్రెస్ తీరును బయటపెట్టిందన్నారు.


జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో గెలిచింది కాంగ్రెస్ కాదు మజ్లిస్ పార్టీ అని ఆయన అన్నారు.హైదరాబాద్‌లో బాబ్రీ మసీదు కడతామంటూ మాట్లాడే వ్యక్తులను కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిపోషిస్తోందని, బాబ్రీ మసీదు ఇక్కడ కడతామని అంటున్నవారికి  ఘోరిని కడతామని బిజెపి అధ్యక్షుడు హెచ్చరించారు. దేశంలో మోదీ ప్రభుత్వం నక్సలిజాన్ని అంతం చేస్తూ మావోయిస్టు ముక్త్ భారత్ కు చర్యలు తీసుకుంటుంటే తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అర్బన్ నక్సలైట్లకు ఆశ్రయం ఇస్తోందని ఆయన విమర్శించారు.

Tags:    

Similar News