ప్రభుత్వం మొంథా తుఫాను పంట నష్టాన్ని తగ్గించి చూపుతోంది: రైతు సంఘాలు

పంట నష్టం వలన ఇటీవలి కాలం లోనే 13 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని రైతు సంఘాలు చెప్పాయి

Update: 2025-11-12 14:26 GMT

మొంథా తుఫాను వలన జరిగిన నష్టం ప్రాధమికంగా వేసిన 4,47,864 ఎకరాల నుండి 1,17,757 ఎకరాలుగా రాష్ట్ర ప్రభుత్వం కుదించి ప్రకటించటం రైతులను తీవ్రంగా దెబ్బతీస్తుందని తద్వారా వారి ఆత్మహత్యలు పెరుగుతాయని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మొదట చెప్పిన ప్రాధమిక లెక్క కంటే మరో రెండు లక్షల ఎకరాలు వరకు నష్టం వుండచ్చని మొదట ప్రభుత్వం చేసిన ప్రకటన చెప్పిందని, యిటీవల పంట నష్టం వల్లనే 13 మంది రైతులు తనువు చాలించిన్నట్టు అవి లెక్క కట్టాయి.

పంట నష్ట పోయిన రైతులకు పరిహారం యిచ్చే సమయానికి తగ్గించి చూపటం పరిపాటి అయ్యిందని, ఆగస్టు నెలలో 2.36 లక్ష ల నష్టం 44,000 లకు తగ్గిందని అనధికారికంగా తెలిసిందని రైతు స్వరాజ్య వేదిక చెబుతోంది. గత సంవత్సరం కూడా యిదే విధంగా రెండు లక్షల ఎకరాల పంట నష్టం 79,574 ఎకరాలకు తగ్గిందని రు. 79.57 కొట్లు ప్రభుత్వం చెల్లించింది. గత ప్రభుత్వం 7 ఏండ్ల పాటు ప్రకృతి వైపరీత్యాల వలన జరిగిన పంట నష్టపరిహారం ఇవ్వలేదు. రైతు స్వరాజ్య వేదిక పైపు నుంచి హై కోర్టులో నాలుగు కేసులు వేయడం, రైతుల నుండి, రైతు సంఘాల నుండి గట్టిగా డిమాండ్ రావడం వలన ప్రభుత్వం చివరి సంవత్సరం 2023 లో ఎకరానికి పది వేలు నష్టపరిహారం ప్రకటించింది. 2020 ఖరీఫ్ నుండి పంటల బీమా పథకం అమలు చేయడం పూర్తిగా ఆపి వేయగా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెసు తన ఎన్నికల మేనిఫెస్టోలో పంటనష్టానికి నష్ట పరిహారం (విపత్తు సహాయం) తప్పక ఇస్తామని, పటిష్టమైన పంటల బీమా పథకం కూడా అమలు చేస్తామని హామీ ఇచ్చింది కానీ ఆ హామీ యింత వరకు అమలుకు నోచుకోలేదు.

బిఆర్ఎస్ బాట లోనే కాంగ్రెస్:

పైగా బిఆర్ఎస్ బాటలోనే పంట నష్ట విస్తీర్ణాన్ని తగ్గించి ఎకరాకు రు. 10,000 నష్టాన్ని ప్రకటించి చేతులు దులుపుకుంటోందని మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో రైతు స్వరాజ్య వేదిక (RSV) జరిపిన రౌండ్ టేబల్ సమావేశం లో రైతు సంఘాల ను అవి నిందించాయి. కేంద్రం కూడా ఈ పరిస్థితి కి కారణం అని అవి చెప్పాయి. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ మీద కూడా నిధులు యివ్వటం లేదు. రాష్ట్రం తుది జాబితాలో పేర్కొన్న ఎకరాలకు కూడా నష్ట పరిహారాన్ని NDRF/SDRF (విపత్తు సహాయ నిధి) నుండి కేంద్రం ఆమోదం ఇవ్వటo లేదని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తున్నది. గతంలో కూడా 2020 అక్టోబర్ పంట నష్టాన్ని రైతు స్వరాజ్య వేదిక వేసిన కేసులో వచ్చిన సమాచారం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వము ఇన్పుట్ సబ్సి కోసం రూ.552 కోట్లు కోరుతూ నివేదిక ఇవ్వగా కేవలం రూ.188 కోట్లు మాత్రమే కేంద్రం మంజూరు చేసింది.

అంతే కాక, కేంద్రం ఇస్తున్న విపత్తు సహాయం క్రింద 2012 లోనే నలుగురు ముఖ్యమంత్రుల హూడా కమిటీ ఎకరానికి 10 వేల రూపాయలు ఇవ్వాలని సిఫార్సు చేసినా, కేంద్రం ఇటీవల తరి పంటలకు ఎకరానికి రు. 5400 నుంచి రు. 6800 లకు అలాగే వర్షాధార పంటలకు రు. 2700 నుండి రు. 3400 కి పెంచింది. యిది రైతుల పట్ల కేంద్రం తీవ్ర నిర్లక్ష్యాన్ని తెలియజేస్తున్నది అని అవి పేర్కొన్నాయి. . రైతు అనుకూలమైన పంట బీమా పథకం తెచ్చి, కౌలు రైతులతో సహాయ రైతులందరినీ దానిలో నమోదు చేస్తే ఇప్పుడు వచ్చే విపత్తు సహాయం కంటే కొని రేట్లు ఎక్కువ రైతులకు నష్ట పరిహారం లభిస్తుంది. పక్క రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్ తమ స్వంత పంట బీమా పథకం అమలు చేసినప్పుడు ఒకే సంవత్సరంలో రు. 1700 కోట్లు నష్ట పరిహారంగా రైతులకు అందింది అని అవి గుర్తు చేశాయి.

కేంద్రం ఆద్వర్యం లో నడిచే CCI తేమ శాతం, పత్తి దారం పొడవు, పేరుతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల లో కొర్రీలు పెట్టడంతో రైతులు తక్కువ ధరలకు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకోవలసి వస్తున్నది. క్రాప్ బుకింగ్ సమయంలో కౌలు రైతులను నమోదు చేయకపోవడం 2011 చట్టం ప్రకారం గురింపు కార్డులు యివ్వకపోవడం వలన వారు నష్టపరిహారానికి, పంట కొనుగోలుకి కూడా నోచుకోవట్లేదు. అత్యధిక ఆత్మహత్యలు కౌలు రైతులు చేసుకుంటున్నారు అని సమావేశం లో RSV ప్రవేశ పెట్టిన నివేదిక తెలిపింది.

రైతు నాయకుల విమర్శ:

సదస్సు లో AIKS ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లా రెడ్డి మాట్లాడుతూ 2020 వరకు వచ్చిన ఒక వైపు కరువు, అధిక వర్షాల వలన రు. 37,000 కొట్లు రాష్ట్రం లోని రైతులు నష్టపోయారని చెప్పారు. “రేవంత్ ప్రభుత్వం ఫసల్ భీమా పథకం లో చేరతామని ప్రకటించి బడ్జెట్ లో కేటాయింపు చూపి జులై 30 లోపు ప్రీమియం చెల్లించలేదు. రాష్ట్రం లో ని 72 లక్ష మంది రైతులలో బ్యాంక్ అప్పులు 52 లక్షల మంది మాత్రమే బ్యాంక్ అప్పు తీసుకున్నారు. పథకం అమలు అయినా వీరికి మాత్రమే ప్రయోజనం వుంటుంది. భూ భారతి చట్టం జనవరి 2025 లో తెచ్చి ఏప్రిల్ లో రూల్స్ తెచ్చారు వాటిలో కౌలు రైతుల గురించి ప్రస్తావన లేదు. వాస్తవ సాగుదారులైన కౌలు రైతుల నమోదుకు అవకాశం కల్పించలేదు. వాళ్ళకు నష్టపరిహారం రాదు.”

కాపాస్ కిసాన్ యాప్ గురించి మాట్లాడుతూ 50 సంవత్సరాల దాటిన చాలామంది నిరక్షరాసులు వాళ్ళకు అందులో స్లాట్ బుకింగ్ లాంటివి తెలీదు. స్మార్ట్ ఫోన్ వుండే అవకాశం తక్కువ. ఎకరాకు 7 క్వింటాళ్లు మాత్రమే కొంటామంటే వాళ్ళు ఎక్కడ అమ్ముకోవాలి. వాళ్ళు ఆ పత్తిని తక్కువ రేటుకు వ్యాపారస్తులకు అమ్ముకుంటున్నారు. అధికారులు వాళ్ళు మళ్ళీ కుమ్మక్కు అయ్యి దానిని మద్దతు ధరకు కొంటున్నారు. మోడి రద్దుచేసిన మూడు నల్ల చట్టాలను అమలు చేస్తున్నారు. మనకు పత్తి, పాలు, పంచదార ఉత్పత్తి లో మిగులు ఉన్నా వాటిని దిగుమతి చేస్తున్నారు. అమెరికా ఉత్పత్తి చేసే పత్తి లో కేవలం 4 శాతం మాత్రమే దేశం లో వాడి మిగిలిన 96 శాతం ఎగుమతి చేస్తుంది. ప్రభుత్వం వాళ్ల పత్తి పైన వున్న దిగుమతి సుంకం తీసేసి డిసెంబర్ ఆఖరు వరకు దిగుమతికి అవకాశం యిచ్చింది. రైతుల ఆదాయం 2022 కు రెండు ఇంతలు చేస్తాము అన్నారు యిప్పుడు 2025 వచ్చింది. రైతులకు కేవలం భ్రమలు కల్పిస్తున్నారు. దీని గురించి ప్రశ్నిస్తే దేశ ద్రోహులు అంటున్నారు అని ఆయన వాపోయారు.

రైతులను దోచుకోవటానికి ప్రభుత్వం మద్దతు ధరకు చట్ట బద్దత ఇవ్వకుండా వ్యాపారస్థులకు అవకాశం కల్పిస్తోందని RSV నాయకులు కన్నెగంటి రవి అన్నారు. “పత్తిపైన సుంకం తీసేశారు. మొక్క జొన్న పైన సుంకం తగ్గించారు. వీటి ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. మొక్క జొన్న ఎకరాకు 30 క్వింటాల్ లు పండితే 15 మాత్రమే కొంటున్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం పంటలు ఎండబెట్టు కోవటానికి వేదికలు NREGA ద్వారా కడతాము అంటే కేంద్రం అడ్డుకుంది. యిటీవల మళ్ళీ అంగీకరించింది. రాష్ట్రం అంతా హైవే లు కడుతున్న కేంద్రం వీటికి ఎందుకు అడ్డు చెప్పాలి. బియ్యం రు. 40 కి కొనే ప్రభుత్వం రు. 22 కు ఇథనాల్ కంపెనీ లకు యిస్తోంది. యిలా ఒక్కో కంపెనీ కి రు. 250 కొట్లు సబ్సిడీ యిస్తున్న ప్రభుత్వం రాష్ట్రం లోని రైతులకు పంట నష్టం జరిగితే రు. 100 కొట్లు ఖర్చు చేయటానికి వెనుకాడుతారు,” అని అన్నారు.

కాపాస్ యాప్ రైతులను పత్తి CCI కి అమ్మకుండా చేయటానికే తెచ్చారని వక్తలు అన్నారు. ఈ ఏడు తేమ శాతం మీద వెసులుబాటు కూడా యివ్వకపోవటానికి అదే కారణం అని వక్తలు ఏకాభిప్రాయం తో అన్నారు. పత్తి పంటను మాత్రమే ఎక్కువ భాగం నమోదు చేస్తున్నారని చిరు ధాన్యాలను చేయటం లేదని రైతులు అన్నారు.

రైతుల వెతలు:

అదిలాబాద్ జిల్లా, ఇంద్రవెల్లి మండలం, ధనోర గ్రామ ఆదివాసీ రైతు ఎం. నరసింహ, మొంథా తుఫాను వలన తన సోయా, పత్తి కి నష్టం జరిగిందని అన్నారు. స్థానిక వ్యవసాయ అధికారి వచ్చినా నమోదు చేయలేదని చెప్పారు. అదే గ్రామానికి చెందిన రైతు ఎస్. భీమ్ రావు తన ఆరు ఎకరాల పొలం లో 3 ఎకరాలు పత్తి, ఒక ఎకరా సోయా పోయిందని చెప్పారు. “పత్తికి ఎకరాకు రు. 25,000 ఖర్చు అవుతుంది. ప్రభుత్వం రు. 10,000 యిస్తే మా పెట్టుబడి కూడా రాదు. షావుకారు దెగ్గర రెండు లక్షల అప్పు తెచ్చాను. తీసుకున్న ప్రతి రు. 10,000 కు జూన్ నుండి డిసెంబర్ కాలానికి రు. 12,500 చెల్లించాలి. కొందరు రు. 15,000 కూడా తీసుకుంటారు,” అని చెప్పారు.

అదిలాబాద్ జిల్లా, ఇంద్రవెల్లి మండలం, గౌరాపూర్ గ్రామం నుండి మరో ఆదివాసీ రైతు ఎస్. సుందర్ తన మూడు ఎకరాల పత్తి పంట కాల్వ వచ్చి కొట్టుకు పోయిందని చెప్పారు. ఎకరాకు రు. 30,000 అయ్యింది. పంట ఆగస్టు నుండి పడిన వర్షాలకు వంగిపోవటం తో పత్తి కాయలు సరిగా కాయలేదు. నాకు మాజీ ముఖ్య మంత్రి వై.ఎస్.ఆర్. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడే చివరి సారి పంట నష్ట పరిహారం వచ్చిందని చెప్పారు.

సంగారెడ్డి జిల్లా రైతు చుక్కమ్మ, పత్తి కొయ్యటానికి కూలీలు రావటం లేదని వాపోయారు. కూలీలు కేజీల లెక్కన కూలి యిస్తే తమకు గిట్టుబాటు అవడం లేదని రు. 400 రోజుకు అడుగుతున్నారని చెప్పారు. పత్తి తక్కువ పండటం వలన యిలా జరుగుతోందని అన్నారు. స్లాట్ బుకింగ్ కాక పత్తి ని యింట్లో వుంచితే ఒక రైతు యింట్లో 50 క్వింటాల్ల సరుకు కాలిపోయిందని అన్నారు.

పంట నష్టం గురించి నమోదుకు కేవలం జిల్లా అధికారులకే అవకాశం ఇచ్చారని దీనివలన క్రింది స్తాయి వ్యవసాయ విస్తరణ అధికారులు తమకు తెలిసిన సమాచారం నమోదు చేయలేకపోతున్నారని కరీంనగర్ జిల్లా, జమ్మికుంట రైతు, సదానందం చెప్పారు. కూరగాయల నష్టాన్ని నమోదు చేయటం లేదు. కాపాస్ వచ్చాక రైతులకు దాని గురించి అవగాహన కలుగచేయలేదు.

అసలే తగ్గిన దిగుబడికి ప్రభుత్వ వివిధ చర్యలు రైతులను మరింత ఇబ్బందికి గురిచేసాయని రైతులు ఏకాభిప్రాయం తో ఉన్నారు.


వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తో రైతు స్వరాజ్య వేదిక కార్యకర్తలు కిరణ్ విస్సా, రమాకాంత్



 

మంత్రిని కలిసిన రైతు స్వరాజ్య వేదిక సంఘం ప్రతినిధులు:

వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ను సచివాలయంలో కలిసి క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వ్యవసాయశాఖ మంత్రిగారి ఆదేశాల మేరకు రాష్ట్రస్థాయి వ్యవసాయ అధికారులు, మార్కెటింగ్ అధికారులను వారు లేవనెత్తిన సమస్యలకు సందేహాలను నివృత్తి చెయ్యాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా మంత్రిగారు వారితో మాట్లాడుతూ, “మార్కెటింగ్ లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా అన్ని చర్యలు తీసుకొంటుందని, కాని కేంద్ర ప్రభుత్వం నుండి తగిన సహాయ సహకారాలు లేకపోవడంతో పత్తి కొనుగోళ్లలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సోయాబిన్ లో కూడా రంగుమారిన పంటను కొనుగోలు చేయడానికి వీలుగా కేంద్రాన్ని కోరడం జరిగిందని, మొక్కజొన్న పంటను రాష్ట్రం స్వంత నిధులతో సేకరిస్తున్నదని, రైతుల నుండి విజ్ఙప్తి రాగానే ఎకరానికి ఉన్న 18 క్వింటాళ్ల పరిమితిని పెంచి 25 క్వింటాళ్లకు పెంచడం జరిగిందని వివరించారు. స్వరాజ్య వేదిక ప్రతినిధులు ప్రస్తావించినట్లు, పంటనష్టం నివేదికలో ఎటువంటి పొరపాట్లు లేకుండా ఆ నివేదికలను గ్రామపంచాయతీలలో నోటిస్ బోర్డులలో ఉంచే విధంగా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతుందని, ఎక్కడైనా, ఎవరైనా రైతుల నుంచి ఫిర్యాదులు వస్తే మరొకసారి వెళ్లి పంటలను పరిశీలించి నమోదు చేయాల్సిందిగా ఆదేశించడం జరుగుతుందని,” తెలిపారు.

మార్కెటింగ్ లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రైతుల వద్ద నుండి పంటల కొనుగోళ్లు చేసేవిధంగా అన్ని రకాల జాగ్రత్తలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని వారికి మంత్రి తెలియాజేశారు.

Similar News