రేవంత్ ప్రస్తావించిన ‘గ్వాంగ్ డాంగ్’ ప్రత్యేకతలు ఏమిటో తెలుసా ?
పెట్టుబడుల ఆకర్షణకోసం ఏర్పడిన మొట్టమొదటి స్పెషల్ ఎకనమిక్ జోన్ 1980ల్లోనే గ్వాంగ్ డాంగ్ లో ఏర్పడింది
‘‘గ్వాంగ్ డాంగ్ ప్రాంతం చైనాలోని ప్రావిన్సుల్లో అన్నింటికంటే పెద్దది..గడచిన 20 ఏళ్ళల్లో ఆ ప్రావిన్స్ ప్రపంచంలోనే అత్యధిక పెట్టుబడులను, వృద్ధిరేటును సాధించింది..తెలంగాణలో మేము కూడా అదే నమూనాను అనుసరించాలని భావిస్తున్నాము’’ ఇది, రెండురోజుల (Telangana Summit)తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047 ప్రారంభోత్సవం సందర్భంగా సోమవారం రేవంత్(Revanth) చెప్పిన మాటలు. దాంతో చాలామందిలో (Guangdong) గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్ ప్రత్యేకతలు ఏమిటి అనే విషయమై ఆసక్తి పెరిగింది.
గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్ దక్షిణ చైనాలోని అతిపెద్ద ప్రావిన్స్. పెట్టుబడుల ఆకర్షణకోసం ఏర్పడిన మొట్టమొదటి స్పెషల్ ఎకనమిక్ జోన్ 1980ల్లోనే గ్వాంగ్ డాంగ్ లో ఏర్పడింది. అప్పటినుండి విదేశీపెట్టుబడులకు గ్వాంగ్ డాంగ్ ప్రధాన కేంద్రంగా తయారైంది. ఈప్రావిన్సులో విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు చైనా ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని రూపొందించింది. పెట్టుబడుల్లో సాంకేతికత, మౌళికసదుపాయాలు, రియల్ ఎస్టేట్, నీటి సరఫరా వ్యవస్ధతో పాటు అనేక రంగాల్లో విదేశీ పెట్టుబడులను ప్రావిన్స్ ఆకర్షిస్తోంది. విదేశీకంపెనీల ఏర్పాటుకు భూమి, విద్యుత్, నీటి సరఫరా ధరల్లో ప్రభుత్వం అనేక రాయితీలను అందిస్తోంది. అలాగే పెట్టుబడులను ప్రోత్సహించేందుకు అనుమతుల ప్రక్రియ చాలా వేగంగా పూర్తిచేస్తుంది. అనుమతుల మంజూరుకు డ్రాగన్ ప్రభుత్వం సింగిల్ విండో విధానాన్ని అనుసరిస్తోంది.
పొరుగునే ఉండటంతో గ్వాంగ్ డాంగ్ ప్రావిన్సులో పెట్టుబడులు పెట్టడంలో హాంకాంగ్ కీలకపాత్ర పోషిస్తోంది. ఈ ప్రావిన్సులోని పెట్టుబడుల్లో అతిపెద్ద షేర్ హాంకాంగ్ కంపెనీలవే. ప్రత్యక్ష వ్యాపార కార్యకలాపాల కోసం విదేశీ పెట్టుబడిదారులు పూర్తిగా విదేశీ యాజమాన్యంలోని సంస్ధలను స్ధాపించుకునేందుకు చైనా ప్రభుత్వం అనుమతిస్తోంది. దీనివల్ల ఈప్రావిన్సులో పెట్టుబడులు పెట్టే విదేశీ కంపెనీల్లో 100 శాతం నియంత్రణ విదేశీ కంపెనీల యాజమాన్యాల చేతుల్లోనే ఉంటాయి.
రేవంత్ ప్రస్తావించిన గ్వాంగ్ డాంగ్ ప్రావిన్సులో అత్యధిక స్పెషల్ ఎకనమిక్ జోన్లున్నాయి. షెన్ జెన్ జోన్ మొట్టమొదటి జోన్. ఇక్కడ ఆర్ధిక సంబంధమైన సేవలను అందించే సంస్ధలు చాలా ఉన్నాయి. గ్వాంగ్ ఝౌ జోన్ మొత్తం ప్రావిన్సులో కీలకమైనది. ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలు ఇక్కడే జరుగుతాయి. ఏడాదిలో రెండుసార్లు జరిగే ప్రదర్శనలో 210కి పైగా దేశాలనుండి లక్షలాది పెట్టుబడిదారులు పాల్గొంటారు. ఎలక్ట్రానిక్స్, వస్త్రాలు, రెడీమేడ్ దుస్తులు, గృహోపకరణాలు, వైద్య,ఆరోగ్యరంగంలోని ఉత్పత్తుల్లో ఎగుమతి, దిగుమతుల ప్రదర్శనకు గ్వాంగ్ ఝౌ ప్రధాన వేదికగా మారింది.
ఝూహాయ్, షంతౌ నగరాల్లోని జోన్లు ప్లాస్టిక్, టెక్స్ టైల్స్, విద్యుత్ రంగాల్లో విశేషమైన పెట్టుబడులను ఆకర్షిస్తోంది. అలాగే డాంగ్ గువాన్ నగరంలోని ఎకనమిక్ జోన్లో చాలావరకు హైటెక్ పరిశ్రమలే ఉంటాయి. ఇంటెలిజెంట్ మాన్యుఫాక్షరింగ్ ఉత్పత్తులు అంటే సీసీ కెమెరాలు, స్పై కెమెరాలు, జీపీఎస్, హిడెన్ కెమెరాల్లాంటి ఉత్పత్తులకు కేంద్రాలుగా ఈ నగరం చాలా పాపులర్. అలాగే స్మార్ట్ లాజిస్టిక్స్ కు కూడా ఈ నగరం ప్రసిద్ధి.
చైనామొత్తంలో జరిగే బిజినెస్ లో గ్వాంగ్ డాంగ్ ప్రావిన్సే 39 ఏళ్ళుగా అత్యధికంగా లావాదేవీలను నమోదుచేస్తోంది. 2025, అక్టోబర్ వరకు ఈ ప్రావిన్సులో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్టిమెంట్లు 11.96 బిలియన్ల అమెరికా డాలర్ల విలువను నమోదుచేశాయి. నియమ, నిబంధనలను డ్రాగన్ ప్రభుత్వం ఎంత సరళంగా తయారుచేసి అమలుచేస్తోందో అంతే కఠినంగా కూడా వ్యవహరిస్తోంది. పలానా సమయంలోగా పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించిన ఫైల్ అప్రూవ్ కావాలి అంటే అప్రూవ్ అవ్వాల్సిందే. లేకపోతే అందుకు బాధ్యులపైన చైనా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుంది. మరి మనదగ్గర అది సాధ్యమేనా అన్నది రేవంతే చెప్పాలి.