అటవీ భూములు దున్నవద్దన్నారని రైతుల దాడి..
రైతుల దాడిలో ఏడుగురు అధికారులకు గాయాలు.
నల్లగొండ జిల్లాలో అటవీ శాఖ అధికారులపై రైతులు దాడి చేశారు. ఈ దాడిలో ఏడుగురు అధికారులకు గాయాలయ్యాయి. ఈ ఘటన చందంపేట మండలం గువ్వలగుట్టలో చోటు చేసుకుంది. సాధారణ తనిఖీల్లో భాగంగా బీట్ ఆఫీసర్లతో కలిసి ఎఫ్‌బీఓ సంగీత, ఎఫ్ఆర్ఓ సుమన్ కూడా వచ్చారు. ఈ తనిఖీల్లో భాగంగానే అటవీ భూములను దున్నుతున్న రైతుల దగ్గరకు వెళ్లి.. ఈ భూములను దున్నవద్దని చెప్పారు. దీంతో అవి తమ భూములని, అందుకే దున్నుతున్నామని రైతులు బదులిచ్చారు.
తమ భూములు అయితే పట్టాలు చూపాలని, పట్టాలు చూపిన తర్వాతే దున్నుకోవాలని అధికారులు చెప్పారు. ఈ విషయంలోనే అధికారులకు రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. మాటా మాటా పెరిగి అది ఘర్షణకు దారితీసింది. అంతే రైతులంతా కలిసి అధికారులపై దాడి చేశారు. తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనలో ఏడుగురు అధికారులకు గాయాలయ్యాయి. అక్కడి నుంచి వెళ్లిపోయిన అటవీ శాఖ అధికారులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు ఎస్ఐ లోకేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.