భవిష్యత్తు ‘ఫ్యూచర్ సిటీ’దేనా ? సమ్మిట్ లో ఏమి జరుగుతున్నది?

మంగళ, బుధవారాల్లో ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2047’ రంగారెడ్డి జిల్లాలోని ముచ్చెర్ల గ్రామపరిధిలో జరగబోతోంది

Update: 2025-12-07 08:49 GMT
Revanth Reddy and Telangana Rising Global summit 2047

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అనుకున్నది అనుకున్నట్లు జరిగితే భవిష్యత్తు మొత్తం ఫ్యూచర్ సిటీదే అవుతుంది అనటంలో సందేహంలేదు. పరిపాలనలోనే కాకుండా తెలంగాణ ముఖ్యంగా(Hyderabad) హైదరాబాద్ అభివృద్ధిలో తన ముద్ర ఉండాలని రేవంత్(Revanth) తహతహలాడుతున్నాడు. అందుకనే శతాబ్దాలుగా ఉన్న జంటనగరాలు హైదరాబాద్, సికింద్రాబాద్ కు తోడు బాగా డెవలప్ అవుతున్న (Cyberabad)సైబరాబాద్ కు ధీటుగా మరో కొత్త ప్రపంచాన్ని నిర్మించాలని రేవంత్ గట్టిగా కృషిచేస్తున్నాడు. రేవంత్ కలలుకంటున్న కొత్త ప్రపంచమే ఫ్యూచర్ సిటీ(ఫోర్త్ సిటీ). శ్రీశైలం-నాగార్జునసాగర్ నేషనల్ హైవే మధ్యలో ఇబ్రహింపట్నం, మహేశ్వరం, కల్వకుర్తి నియోజకవర్గాల పరిధిలోని ఏడు మండలాలు అమన్ గల్, ఇబ్రహింపట్నం, కడ్తల్, కందుకూర్, మహేశ్వరం, మంచాల, యాచారం పరిధిలోని 56 గ్రామాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరగబోతోంది.

హైదరాబాద్, మల్కాజ్ గిరి, సికింద్రాబాద్, చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోకి వచ్చే ఫ్యూచర్ సిటీ నిర్మాణంకోసం రేవంత్ ప్రభుత్వం ఇప్పటికే 30 వేల ఎకరాలను సేకరించింది. ఫ్యూచర్ సిటీ నిర్మాణం కోసం ప్రత్యేకంగా ‘ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ’ని కూడా ఏర్పాటుచేసింది. ఈ అథారిటి పర్యవేక్షణలోనే ఫ్యూచర్ సిటీ నిర్మాణం మొదలైంది.

మంగళ, బుధవారాల్లో ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2047’ రంగారెడ్డి జిల్లాలోని ముచ్చెర్ల గ్రామపరిధిలో జరగబోతోంది. ఈ సమ్మిట్ కు 42 దేశాలనుండి సుమారు 154 మంది ప్రతినిధులు హాజరవబోతున్నారు. అలాగే దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తల్లో చాలామంది హాజరవబోతున్నారు. వివిధరంగాల్లో పెట్టుబడులను ఆకర్షించటమే ధ్యేయంగా రేవంత్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెండురోజుల సమ్మిట్ నిర్వహిస్తోంది. సుమారు రు. 3 లక్షల కోట్ల పెట్టుబడులు రావచ్చని ప్రభుత్వం అంచనావేస్తోంది. 8వ తేదీ మధ్యాహ్నం ఒకటిన్నర గంటల ప్రాంతంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సమ్మిట్ ను ప్రారంభిస్తారు. సమ్మిట్ కు ముఖ్యఅతిధిగా రావాల్సిందిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీని రేవంత్ వ్యక్తిగతంగా వెళ్ళి కలిసి ఆహ్వానించిన విషయం తెలిసిందే.

సమ్మిట్ ఉద్దేశ్యం 

8వ తేదీన మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం అయ్యే సమ్మిట్ 9వ తేదీ సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. సమ్మిట్ ను గవర్నర్ ప్రారంభించిన తర్వాత 2.15 గంటలకు రేవంత్ మాట్లాడుతాడు. 2047 నాటికి తెలంగాణ ఆర్ధిక వ్యవస్ధను 3 ట్రిలియన్ డాలర్లకు పెంచాలన్న టార్గెట్ ను ప్రభుత్వం పెట్టుకున్నది. ఫ్యూచర్ సిటీలో స్కిల్ యూనివర్సిటీ, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటుతో పాటు ఫార్మా, ఐటి, సాఫ్ట్ వేర్, గ్లోబల్ కేపబులిటీ సెంటర్స్(జీసీసీ), డేటా సెంటర్లు, మౌళికసదుపాయాల ఏర్పాటు కేంద్రాలు, ప్రపంచప్రఖ్యాతిగాంచిన యూనివర్సిటీలు, రిలయన్స్ ఆధ్వర్యంలో వంతారా జూ, 7 స్టార్ హోటళ్ళ లాంటి అనేక సంస్ధలు, పరిశ్రమలను ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేయాలన్నది రేవంత్ ప్రభుత్వ ఉద్దేశ్యం.

సమ్మిట్ షెడ్యూల్

8వ తేదీ గవర్నర్ సమ్మిట్ ను ప్రారంభించిన తర్వాత రేవంత్ ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 3-4 గంటల మధ్యలో ఒకేసారి నాలుగు వేదికలపై నాలుగు సెషన్స్ జరుగుతాయి. మొదటి వేదికలో ‘ది జస్ట్ ట్రాన్సిషన్ ఇన్ టు 2047-పవరింగ్ ఫ్యూచర్’ అనే అంశంపై చర్చలు జరుగుతాయి. రెండో వేదికలో ‘గ్రీన్ మొబిలిటీ 2047-జీరో ఎమిషన్ వెహికల్స్’ పై సెషన్ జరుగుతుంది. మూడో వేదికలో ‘టెక్ తెలంగాణ 2047-సెమీ కండక్టర్స్, ఫ్రాంటియర్స్ టెక్నాలజీస్’పై సదస్సుంటుంది. చివరగా నాలుగో వేదికలో ‘గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్ తెలంగాణ’ పై చర్చలు జరుగుతుంది.

4.15 నుండి 5.15 వరకు

మొదటి హాలులో ‘తెలంగాణ ఫ్లయింగ్ హై-ది రైజ్ ఆఫ్ ఏరోస్సేస్, డిఫెన్స్’ పైన చర్చ జరుగుతుంది. రెండో హాలులో ‘టాలెంట్ మొబిలిటీ’ పైన డిస్కషన్ జరుగుతుంది. మూడో హాలులో ‘అందరికీ అందుబాటులో సమానంగా వైద్యం’ పైన చర్చ, నాలుగో హాలులో కొరియా, ఆస్ట్రేలియా ప్రతినిధులతో చర్చలుంటాయి.

5.30 నుండి 6.30 మధ్య

మొదటి హాలులో ‘తెలంగాణ పార్టనరింగ్ విత్ ఏషియన్ టైగర్స్’ అనే అంశంపైన చర్చుంటుంది. రెండో హాలులో ‘గిగ్ ఎకానమీ-రైజ్ ఆఫ్ కెరియర్స్’ అనే అంశంపై చర్చుంటుంది. మూడో హాలులో ‘ది రేర్ స్ట్రాటజీ విలువ ఆధారిత ఉత్పత్తుల ద్వారా రైతుల ఆదాయం పెంపు’ అనే అంశంపై చర్చ. నాలుగో హాలులో కెనడా ప్రతినిధులతో సమావేశం జరుగుతుంది. ఇదేహాలులో సాయంత్రం 6.15 నుండి 7.15 వరకు మహిళా పారిశ్రామికవేత్తలతో ప్రత్యేక చర్చలుంటాయి.

9వ తేదీ

ఉదయం 10-11.30 గంటల మధ్య మొదటి హాలులో ‘జినోమ్ వ్యాలీ అండ్ బియాండ్-యాక్సిలరేటింగ్ ఇన్నోవేషన్ ఇన్ లైఫ్ సైన్సెస్’ పైన చర్చ జరుగుతుంది. రెండో హాలులో ‘తెలంగాణ ఒలంపిక్ గోల్డ్ క్వెస్ట్’ పైన, మూడో హాలులో ‘తెలంగాణ అనుభవాలు-వారసత్వం, సంస్కృతి, ఫ్యూచర్-రెడీ టూరిజం’ పైన సదస్సు జరుగుతుంది. 4వ హాలులో ‘3 ట్రిలయన్ డాలర్ల ఎకానమి దిశగా-మూలధనం పెంపు, ఉత్పాదకత’ పైన చర్చ జరుగుతుంది.

11.45-1.15 మధ్య

మొదటి హాలులో ‘ఇన్వెస్టింగ్ ఇన్ ఇంక్లూజన్-అందుబాటులో ఉండే గృహనిర్మాణానికి అవకాశాలు’ అనే అంశంపై చర్చుంటుంది. రెండోహాలులో ‘మూసీ పునరుజ్జీవనం, బ్లూ, గ్రీన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్ హైదరాబాద్’ పైన చర్చ జరుగుతుంది. మూడో హాలులో ‘కనెక్టెడ్ తెలంగాణ-పట్టణ గ్రామీణ అనుసంధానం కోసం సమగ్ర రవాణ’ అనే అంశంపై చర్చ జరుగుతుంది.

మధ్యాహ్నం 2.15 నుండి 3.45 గంటల మధ్య

మొదటి హాలులో ‘భారత్ ఫ్యూచర్ సిటీ యాజ్ ఏ మ్యాగ్నెట్ ఫర్ 3 ట్రిలియన్ డాలర్స్ తెలంగాణ’ పైన చర్చుంటుంది. రెండోహాలులో ‘బిల్డింగ్ తెలంగాణ ఆంత్రప్రెన్యూర్ షిప్ ఎకోసిస్టమ్-ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0’ పై చర్చ జరుగుతుంది. మూడోహాలులో ‘గ్లోబల్ క్యాపబిలిటీ సెటర్స్’ పైన, నాలుగో హాలులో ‘ప్రభుత్వ-ప్రవేటు భాగస్వామ్యంలో పెట్టుబడులు’ పైన చర్చ ఉంటుంది.

సాయంత్రం 4 నుండి 5.30 గంటల వరకు

మొదటి హాలులో ‘సృజనాత్మక శతాబ్దం-ఇండియన్ సాఫ్ట్ పవర్, వినోదరంగం భవిష్యత్తు’ అనే అంశంపై చర్చ ఉంటుంది. రెండోహాలులో ‘ఇన్ క్లూజివ్ ప్రాస్పరిటీ-ప్రతిఒక్కరికీ అవకాశాలకల్పన’ అనే అంశంపైన చర్చ జరుగుతుంది. మూడో హాలులో ‘పెట్టుబడి, అభివృద్ధి మార్గాలు, ఆర్ధిక హబ్’ పైన, నాలుగో హాలులో ‘అంకుర సంస్ధల ఏర్పాటుకు అవకాశాలు’ అనే అంశంపై చర్చ జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకు తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ విడుదలవుతుంది. తర్వాత 7గంటలకు ద్రోన్లతో ప్రదర్శన, 7.30 గంటలకు సాంస్కృతిక ప్రదర్శనలు మొదలవుతాయి. తర్వాత విందుతో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047 ముగుస్తుంది.

Tags:    

Similar News