‘జూబ్లీ విజయం మా బాధ్యతను మరింత పెంచింది’
అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌పై ప్రజలకు పెరిగిన నమ్మకానికి జూబ్లీ ఎన్నిక నిదర్శనమన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ సాధించిన విజయం తమపై బాధ్యతను మరింత పెంచిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తమ పార్టీపై ప్రజలకు నమ్మకం పెరుగుతోందని, అందుకు ఈ విజయం నిదర్శనమని చెప్పారు. జూబ్లీ హిల్స్ ఉప పోరులో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 29729 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ గెలుపు నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులతో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగానే జూబ్లీహిల్స్ ప్రజలు తమపై ఉంచిన విశ్వాసానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ఎన్నికలో పార్టీ విజయానికి కష్టపడ్డ అన్ని శ్రేణుల నాయకులు, కార్యకర్తలకు సీఎం కృతజ్ఞతలు చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కు అంతగా అనుకూల ఫలితం రాకపోయినా, రెండు సంవత్సరాల పాలనను గమనించి ప్రజలు ఇచ్చిన తీర్పు తమకు గొప్ప గుర్తింపు అని పేర్కొన్నారు.
తెలంగాణకు కేంద్రం సహకరించాలి
“2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాకు 39% శాతం ఓట్లు వచ్చాయి. ఆరు నెలల తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మా ఓట్ల శాతం 42కి పెరిగింది. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ 51% ఓట్లు పొందింది. మా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలు నమ్మకం ఉంచుతున్నారనే దానికి ఇది నిదర్శనం. గెలిచినా, ఓడినా కాంగ్రెస్ అహంకరించదు. ప్రజల కోసం పోరాటం చేయడం మా బాధ్యత. రాష్ట్ర ఆదాయంలో ఎక్కువశాతం హైదరాబాద్ నుంచే వస్తున్నందున నగర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నాం. హైదరాబాద్‌ను సమస్యలేని నగరంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాం. అయితే కేంద్రం నుంచి నిధులు, అనుమతులు రావడంలో కేంద్ర మంత్రుల నిర్లక్ష్యం అడ్డంకిగా మారింది” అని అన్నారు.
మెట్రో విస్తరణ, మూసీ నదీ శుద్ధీకరణ వంటి కీలక ప్రాజెక్టులకు కేంద్రం అడ్డంకులు పెడుతోందని అన్నారు. తెలంగాణ ప్రాజెక్ట్‌లకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డ ఏమాత్రం సహకరించడం లేదని సీఎం విమర్శించారు. ఆయన నియోజకవర్గంలోనే బీజేపీ ఓట్ల సంఖ్య భారీగా తగ్గిందని వ్యాఖ్యానించారు. “జూబ్లీహిల్స్ ఫలితం భూకంపానికి ముందు వచ్చే ప్రకంపనలాంటిది” అని హెచ్చరిస్తూ, బీజేపీ వ్యవహార శైలిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. “రాజకీయాలు పక్కనపెట్టి రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరించాలి. రాష్ట్ర ప్రాజెక్టులకు అనుమతులు తెచ్చే బాధ్యత బీజేపీ ఎంపీలదే” అని వ్యాఖ్యానించారు.
కేటీఆర్ అహంకారం తగ్గలేదు..
ఈ సందర్భంగానే మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు రేవంత్. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లుగా కేటీఆర్ తీరు ఉందన్నారు. “అధికారం కోల్పోయినా, కేటీఆర్‌లో ఉన్న అహంకారం ఇంకా తగ్గలేదు. అసూయ, అహంభావం రాజకీయాలకు మంచిది కాదు. పదవులు శాశ్వతం కావు. ఇప్పటికైనా కేటీఆర్ తన తీరు మార్చుకోవాలి. ఫేక్ వార్తలు, ఫేక్ సర్వేలు నమ్ముకొని భ్రమలో ఉండకూడదు. తెలంగాణలో బీఆర్‌ఎస్ ఓటమి, బీజేపీకి డిపాజిట్ కూడా రాదని ముందే చెప్పాను” అని గుర్తుచేశారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చిన ఎంఐఎంకు, అసదుద్దీన్ ఒవైసీకి సీఎం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. “రాష్ట్రాల పరిస్థితులను బట్టి పొత్తులు, మద్దతులు మారుతాయి. బీహార్ ఫలితాలను ఇంకా సమీక్షించలేదు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఈనెల 17న జరిగే కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటాం” అని తెలిపారు.
కేసీఆర్ మాట్లాడాల్సిన వసరం లేదు
“ప్రస్తుతం కేసీఆర్ క్రియాశీల రాజకీయాల్లో లేరు, ఆయన ఆరోగ్యం కూడా సరిగా లేదు. ఆయనపై ఇప్పుడే వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదు” అన్నారు. “వచ్చే పదేళ్లపాటు తెలంగాణలో కాంగ్రెస్ పాలన కొనసాగుతుంది. మార్పు ఎలా ఉండాలో చూపిస్తాం” అని సీఎం రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు.