ఇదొక చిన్న సెట్‌బ్యాక్ అంతే, జూబ్లీ ఫలితంపై కేటీఆర్

ఈ ఉప ఎన్నిక ఫలితం బీఆర్‌ఎస్‌కు చిన్న వెనుకడుగు మాత్రమే. మేము ఫలితాలపై సమీక్ష చేస్తామని కేటీఆర్ తెలిపారు.

Update: 2025-11-14 09:45 GMT

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఓడిపోవడం తమ పార్టీకి చిన్న సెట్‌బ్యాక్ మాత్రమేనని, ఈసారి మరింత బలంగా వస్తామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, వాటిని స్వీకరిస్తూ ముందుకు సాగాలని ఆయన చెప్పారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోరులో బీఆర్ఎస్ ఓడిపోయింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌పై సుమారు 25వేల ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పరాజయంపాలయ్యారు. ఈ ఓటమిపై కేటీఆర్ స్పందించారు. ఒక ఓటమి తమను కుంగదీయలేదని, ఎన్నిక ఫలితాలు నిరాశపరిచినా.. తాము ప్రజల కోసం పోరాడుతూనే ఉంటామని అన్నారు. ఈ ఫలితం పార్టీకి కొత్త జోష్‌ ఇచ్చిందని, రాష్ట్రానికి రాజకీయ ప్రత్యామ్నాయం బీఆర్‌ఎస్ మాత్రమేనని ప్రజలు స్పష్టంగా పేర్కొన్నారని ఆయన అన్నారు. ఇకపై ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ పోరాటం మరింత బలంగా కొనసాగుతుందని తెలిపారు.

మా పోరాటం నిజాయితీగా కొనసాగింది

‘‘వ్యక్తిగత ఇబ్బందులు ఉన్నప్పటికీ, పార్టీ నాయకులు రాత్రింబవళ్ళు పని చేశారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రతి బూత్ స్థాయిలో స్థానిక నాయకులు అద్భుతంగా పనిచేశారు. రాజకీయ అనుభవం తక్కువైనా మాగంటి సునీత ఎంతో కష్టపడి పోరాటం చేశారు. గత రెండేళ్లుగా ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్‌ఎస్ మంచి పాత్ర పోషిస్తోంది. ప్రజా సమస్యలపై మేము దృష్టి పెట్టి పని చేస్తున్నాం. మాకు ఓటు వేసిన ప్రతి ఓటరుకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఆన్‌గ్రౌండ్‌లోనూ, సోషల్ మీడియాలోనూ మేము శ్రమించాము. ఈ ఉప ఎన్నికలో మేము పూర్తిగా నిష్పక్షపాతంగా పోరాటం చేశాం. ఎన్నికలు ఎలా జరిగాయో అందరికీ తెలుసు… ప్రచారం ముగిసే వరకూ ఒక విధంగా, తర్వాత మరో విధంగా పరిస్థితులు మారాయి’’ అన్నారు.

“అప్పుడు కాంగ్రెస్ ఒక్క సీటు గెలవలేదు”

‘‘2014 నుంచి 2023 మధ్య జరిగిన ఏడు ఉప ఎన్నికల్లో ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఒక్కసారి కూడా గెలవలేదు. మేము ఐదు గెలిచాం, రెండింటిలో మాత్రమే ఓడిపోయాం. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూడా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌కు రెండు కార్పొరేటర్ సీట్లు మాత్రమే వచ్చాయి. ఈసారి ప్రజల తరఫున మా వాదనను బలంగా వినిపించాం. ప్రజా సమస్యలు, కాంగ్రెస్ ప్రభుత్వ ఆరు హామీల వైఫల్యం—ఇవన్నీ ప్రజల ముందుకు తీసుకెళ్లాం. కుల, మత రాజకీయాలు చేయలేదు. అసభ్య పదజాలం ఉపయోగించలేదు. చాలా పరిపక్వంగా, హుందాగా పోరాడాం. వారు ఎంత ప్రేరేపించినా మేము శాంతంగా వ్యవహరించాం. జూబ్లీహిల్స్‌లో పది సంవత్సరాలుగా మేము రూ.5 వేల కోట్లతో చేసిన అభివృద్ధి పనులే మా బలం’’ అని వివరించారు.

చిన్న వెనుకడుగు మాత్రమే

‘‘జాతీయ స్థాయిలో చూస్తే బిహార్‌లో కాంగ్రెస్ పరిస్థితి బలహీనంగా ఉంది. ఈ ఉప ఎన్నిక ఫలితం బీఆర్‌ఎస్‌కు చిన్న వెనుకడుగు మాత్రమే. మేము ఫలితాలపై సమీక్ష చేస్తాం, ఎక్కడ తప్పు జరిగిందో పరిశీలిస్తాం. అధికార పార్టీ ఎంత ప్రలోభాలు పెట్టినా, మేము దీనికి నిలబడగలిగాం. ఒక పార్టీ డిపాజిట్ కూడా కోల్పోయే పరిస్థితి వచ్చింది. దొంగ ఓట్ల విషయంపై స్పష్టమైన ఆధారాలు మేము ఇచ్చాం. పోలింగ్ రోజు మా అభ్యర్థి వాటిని బయటపెట్టారు. దీనిపై ఎన్నికల కమిషన్, పోలీసులు సమాధానం చెప్పాలి. ఓటమికి కారణాలు వెతుకుతున్నామని కాదు, చర్చ కావాలి అని మాత్రమే చెప్తున్నాం. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంపై బెంగాల్ హైకోర్టు ఇటీవల వీలైన తీర్పు ఇచ్చింది. తెలంగాణలో కూడా కనీసం పది చోట్ల ఉప ఎన్నికలు రావాల్సిన పరిస్థితి ఉంది. ఒక్క ఉప ఎన్నికకే కాంగ్రెస్ ఇంత తీవ్రంగా శ్రమిస్తే, పది చోట్ల ఉప ఎన్నికలైతే సోనియా, రాహుల్, ప్రియాంకలను కూడా తెచ్చుకుంటారేమో’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News