‘జూబ్లీ’ ప్రచారంలో స్పీడ్ పెంచిన నేతలు
కృష్ణ కాంత్ పార్కులో కాంగ్రెస్, బిజెపి నేతల పోటాపోటీ ప్రచారం
జూబ్లిహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ , బిజెపి నేతలు తమ ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఆదివారం యూసుఫ్ గుడా కృష్ణ కాంత్ పార్కులో పిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ తమ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మార్నింగ్ వాకర్స్ ను కలిసి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించాలని వారు కోరారు. స్థానికుడు, విద్యావంతుడు, నిత్యం ప్రజల మధ్య నిలడే వ్యక్తి నవీన్ యాదవ్ కు అండగా నిలబడాలని ఈ సందర్బంగా కాంగ్రెస్ నాయకులు వాకర్స్ ను కోరారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత సంక్షేమం, అభివృద్దికి పెద్ద పీట వేసిందని ఈ సందర్బంగా వారు గుర్తు చేశారు. పదేళ్ల బిఆర్ఎస్ హాయంలో జూబ్లిహిల్స్ లో ఎటువంటి అభివృద్ది జరగలేదని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.
మార్నింగ్ వాకర్స్ తో కిషన్ రెడ్డి
బిజెపి నేత, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కృష్ణ కాంత్ పార్కులో మార్నింగ్ వాకర్స్ తో సమావేశమయ్యారు. అవినీతి రహిత సమాజాన్ని సాధించాలంటే బిజెపి అభ్యర్థి లంకల దీపక్ రెడ్డిని గెలిపించాలని కిషన్ రెడ్డి కోరారు. పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి ఎనిమిదిస్థానాలు కైవసం చేసుకుందని, అదేస్పూర్తిని కొనసాగించే విధంగా జూబ్లీ ఎన్నికల్లో బిజెపిని గెలిపించాలని కిషన్ రెడ్డి కోరారు. జమ్మూ, కశ్మీర్ లో పహల్గాం దాడిని తిప్పి కొట్టడానికి బిజెపి ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిందన్నారు. ఆపరేషన్ సింధూర్ ను అపహాస్యం చేసే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారని, సైనికులను కించపరిచే విధంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని కిషన్ రెడ్డి ఆరోపించారు. రేవంత్ రెడ్డి సైనికులకు క్షమాపణ చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. రెండేళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వానికి మైనార్టీలు గుర్తుకు వచ్చారని, అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడం వెనక మైనార్టీలను బుజ్జగించడమేనని కిషన్ రెడ్డి అన్నారు.