జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మెజారిటి ఓటర్లు అందరినీ తిరస్కరించారు

మెజారిటి జనాలు ఎన్నికలో పోటీచేసిన అభ్యర్ధులందరినీ తిరస్కరించారు

Update: 2025-11-12 11:40 GMT
Jubilee Hills election

మనది ప్రజాస్వామ్య దేశం. ఎన్నికల్లో మెజారిటి ప్రజల తీర్పే శిరోధార్యం. ఇదే నిజమైతే తాజాగా జరిగిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో ఈ సిద్ధాంతం తిరగబడినట్లే అనుకోవాలి. ఎందుకంటే మెజారిటి జనాలు ఎన్నికలో పోటీచేసిన అభ్యర్ధులందరినీ తిరస్కరించారు. మంగళవారం జరిగిన పోలింగులో నమోదైన ఓటింగ్ శాతం 48.76 మాత్రమే. అంటే సుమారు 51శాతం ఓటర్లు ఎన్నికను తిరస్కరించారు. నియోజకవర్గంలో 4.01 లక్షల ఓటర్లుండగా ఓట్లువేసింది 1,95,548 మాత్రమే. 4.01 లక్షల ఓటర్లలో సగం అంటే 2 లక్షలమంది కూడా ఎన్నికలో పాల్గొనలేదు.

మన ప్రజాస్వామ్యంలో మొత్తం ఓటర్లలో 50శాతానికి పైగా ఓట్లేసిన వారిదే విజయం అన్న సూత్రం పనికిరాదు. ఎందుకంటే ఆస్ట్రేలియా పార్లమెంటు ఎన్నికల్లో పోలైన ఓట్లలో 50శాతంకు పైగా తెచ్చుకున్న అభ్యర్ధిదే గెలుపు. ఎందుకంటే పై పద్దతి అమల్లో ఉన్న ఆస్ట్రేలియాలో ఓటర్లు కచ్చితంగా ఓటింగులో పాల్గొనాల్సిందే. కాబట్టి ఆ పద్దతి వర్కవుటవుతుంది. కాని మనదేశంలో అలాకాదు అందరినీ ఓట్లేయమని అడుగుతున్నా వచ్చేవాళ్ళు వస్తారు లేనివాళ్ళ లేదంతే. ఇపుడు విషయం ఏమిటంటే మన ప్రజాస్వామ్యంలో ఓట్లేసిన వాళ్ళల్లో మెజారిటి ఓట్లు ఎవరికి ఎక్కువ పడితే వాళ్ళదే గెలుపు.

ఇపుడు జూబ్లీహిల్స్ ఉపఎన్నికనే తీసుకుంటే పోలైన 1,95,548 ఓట్లలో చెల్లేవి ఎన్ని చెల్లని ఓట్లెన్ని అన్నది కౌంటింగ్ రోజు 14వ తేదీ తేలుతుంది. చెల్లిన ఓట్లలో మెజారిటి ఓట్లు ఎవరికైతే పడతాయో ఆ అభ్యర్ధిదే గెలుపు. ఓట్లేసిన 1,95,548 మందిని పక్కనపెడితే మరి ఓటింగుకు హాజరుకాని సుమారు 2 లక్షల మంది మాటేమిటి ? వీళ్ళు ఎందుకు ఓటింగుకు రాలేదో తెలీదు. అభ్యర్ధుల్లో ఎవరూ నచ్చలేదా ? లేకపోతే ఎన్నికల సిస్టమ్ మీదే నమ్మకంలేదా ? లేకపోతే ఓటింగులో పాల్గొనటానికిమించిన బిజీలో ఉన్నారా అన్నదే తెలీటంలేదు.

ఇన్ని ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఉపఎన్నికలో 4.01 లక్షల మంది ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించి ఓట్లేసేట్లుగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చాలా కష్టపడ్డాయి. కాంగ్రెస్ అయితే ప్రతి 100 మంది ఓటర్లకు ఒక ఇంచార్జిని నియమించింది. ఈ వందమంది ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చి ఓట్లేయించే బాధ్యత ఇంచార్జిదే. ఇంచార్జిలు ఒకటికి పదిసార్లు ఓట్లేయాలని చెప్పినా మెజారిటి జనాలైతే ఇంటిగడపదాటలేదు. మండువేసవి కాలమా అంటే అదీకాదు. వాతావరణం కూడా ఆహ్లదాంగానే ఉంది. అధికారులు, ఎన్నికల యంత్రాంగం కూడా ఓటర్లందరు ఓటుహక్కును వినియోగించుకోవాలని పదేపదే చెప్పినా జనాలు పట్టించుకోకపోవటమే ఆశ్చర్యంగా ఉంది.

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు గెలుపు చాలా ముఖ్యంకాబట్టి ఉపఎన్నికను చాలెంజుగా తీసుకున్నాయి. అందుకనే ఓటర్లను పదేపదే కలిసి ఓట్లేయమని విజ్ఞప్తులు చేశాయి. మూడుపార్టీలు పోటాపోటీగా డబ్బులు కూడా పంచినట్లు బాగా ప్రచారంలో ఉంది. ఏడు డివిజన్లలోని 30 కాలనీలు, 70 బస్తీల్లో 4.01 లక్షల ఓటర్లున్నారు. వీరిలో మధ్య, దిగువ తరగతి జనాలతో పాటు పేదలే ఎక్కువ. పార్టీల అంచనా ఏమిటంటే పోలైన ఓట్లలో కాలనీల్లోని ఓటర్లకన్నా బస్తీల్లోని ఓటర్లే ఎక్కువమంది ఓటింగులో పాల్గొన్నారు. అందుకనే 48.76 శాతం ఓటింగన్నా నమోదైంది లేకపోతే మరీ అన్యాయంగా ఉండేది ఓటింగ్ శాతం. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్న రోడ్డుషోలు, కార్నర్ మీటింగులు, బహిరంగసభకు జనాలు విపరీతంగా హాజరయ్యారు. ఇదే ఊపు పోలింగురోజున కూడా కనబడుతుందని, ఓటింగ్ బ్రహ్మాండంగా జరుగుతుందని ఆశించిన పార్టీలకు ఓటర్లు పెద్ద షాకిచ్చారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే నేతల ప్రచారానికి ఓటర్లు బాగా స్పందించారు, డబ్బులు పంచిన పార్టీల దగ్గరా డబ్బులు తీసుకున్నారు, అందుకున్న ఓటర్ స్లిప్పుల ద్వారా పోలింగ్ కేంద్రాలు ఎక్కడో కూడా తెలుసు. అయినా జనాలు ఎందుకు పోలింగులో పాల్గొనలేదో ఎవరికీ అర్దంకావటంలేదు. అభ్యర్ధులు, పార్టీల మీద నిరాసక్తత లేకపోతే ఎన్నికల వ్యవస్ధమీద వ్యతిరేకత పెరిగిపోతోందా ? అన్నదే తెలీటంలేదు.

అన్నీ నియోజకవర్గాల్లో ఒకే పరిస్ధితి : తిరునహరి

హైదరాబాదు జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో కూడా 50 శాతం పోలింగ్ దాటలేదని కాకతీయ యూనివర్సిటి ఎకనామిక్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ తిరునహరి శేషు గుర్తుచేశారు. తెలంగాణ ఫెడరల్ తో తక్కువ ఓటింగ్ శాతం నమోదుపై మాట్లాడుతు ‘‘2014 ఎన్నికల్లో మాత్రమే జూబ్లీహిల్స్ లో 50శాతం పోలైంది’’ అన్నారు. ‘‘2023 ఎన్నికల్లో కూడా 47 శాతం ఓట్లే పోలయ్యాయి’’ అని గుర్తుచేశారు. ‘‘జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని 80శాతం ఓటర్లు బస్తీల్లోనే ఉంటున్నారు’’ అని తెలిపారు. ‘‘వీళ్ళలో ఎక్కువమంది డైలీలేబర్ కాబట్టి పనుల్లోకి వెళ్ళటానికే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు’’ అని చెప్పారు. ‘‘ డైలీ లేబర్ సాయంత్రం పనినుండి తిరిగి వచ్చినా వాళ్ళకు ఓటు వేయటం ప్రయారిటి కాదు’’ అని అభిప్రాయపడ్డారు. ‘‘వెంగళరావు, నగర్, శ్రీనగర్ కాలనీల్లోని మహిళా ఓటర్లు ఓటింగుపై పెద్దగా ఆసక్తి చూపలేదు’’ అన్నారు. వర్కింగ్ క్లాసు+లోక్లాస్ ఓటర్లు కూడా ఓటింగులో ఆసక్తి కనబడలేదన్నారు. ‘‘సెలవు వస్తే బయటకు వెళ్ళటానికి మక్కువ చూపుతున్నారుకాని ఓటింగుకు ప్రాధాన్యత ఇవ్వటంలేదు’’ అన్నారు. ‘‘పోలింగ్ కేంద్రాలు చాలామంది ఓటర్లకు దూరంగా ఉండవచ్చు’’ అని కూడా అభిప్రాయపడ్డారు.

ఎన్నికల కమిషన్ అధ్యయనం చేయాలి: అమరవాది

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటర్ల అడ్రస్సులు మారిపోయుండచ్చని సీనియర్ జర్నలిస్టు అమరవాది రవీంద్రశేషు అభిప్రాయపడ్డారు. ఓటర్లలో పార్టీలు కదలిక తీసుకురాలేకపోయినట్లు చెప్పారు. 20శాతం జనాభాకు నియోజకవర్గంలో అసలు ఓట్లే ఉండకపోవచ్చని అనుమానం వ్యక్తంచేశారు. వివిధ కారణాలతో ఇతర ప్రాంతాలకు వలసలు పోయుండచ్చని చెప్పారు. అభ్యర్ధులు నచ్చక, ఎన్నికల వ్యవస్ధమీద వ్యతిరేకత తదితరాల కారణంగా మెజారిటి జనాలు పోలింగులో ఆసక్తి కనబరచలేదు అని అన్నారు. ఓటర్లను మూడుపార్టీల నేతలు ఇంటింటికి వెళ్ళి ఇన్నిసార్లు కలిసినా మెజారిటి ఓటర్లు పోలింగులో పాల్గొనలేకపోవటంపై శేషు ఆశ్చర్యం వ్యక్తంచేశారు. మెజారిటి ఓటర్లు పోలింగులో పాల్గొనకపోవటంపై ఎన్నికల కమీషన్ అధ్యయనం చేయాలని సూచించారు.

జనాలు కనెక్ట్ కాలేదు : చలసాని

ఎన్నికల్లో ప్రచారం హైపిచ్ లో జరగలేదని అందుకనే జనాలను పార్టీలు ఆకట్టుకోలేకపోయినట్లు సీనియర్ జర్నలిస్టు చలసాని నరేంద్ర అభిప్రాయపడ్డారు. ఒక విధంగా ఓటర్లలో స్తబ్ధత కనబడింది అన్నారు. అభ్యర్ధులకు కచ్చితంగా ఓటేయాలన్న ఆలోచన జనాల్లో పెద్దగా కనబడలేదని చెప్పారు. పార్టీలు, అభ్యర్ధుల ప్రచారం కూడా ఏదో మొక్కబడిగా జరిగిందని చెప్పారు. కచ్చితంగా ఓటువేయాలన్న కదలికను జనాల్లో నేతలు తీసుకురాలేకపోయారు అని అభిప్రాయపడ్డారు. పార్టీల మధ్య పోరాటం తప్ప అభ్యర్ధుల మధ్య పోరాటంగా జనాలు చూడలేదు అన్నారు. ఎవరు గెలిచినా పెద్దగా ఉపయోగంలేదని ఓటర్లు ఆలోచించినట్లున్నారు అనే అనుమానాన్ని వ్యక్తంచేశారు. చివరగా ఉపఎన్నికతో జనాలో పెద్దగా కనెక్ట్ కాలేకపోయారని చెప్పారు.

Tags:    

Similar News