మునుగోడులో వైన్ షాపులన్నీ ఊరి బయటే!

కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ‘జీవొ’ అమలుచేసేందుకు వైన్ షాపుల అంగీకారం

Update: 2025-12-02 04:07 GMT
Munugode MLA Komatireddy Rajagopala Reddy

మునుగోడు నియోజకవర్గం లో వైన్ షాపుల నిర్వహణ విషయంలో శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి సూచనల ప్రకారం మద్యం షాపులు దక్కించుకున్న యజమానులు ఊరి బయటే వైన్ షాపులను ఓపెన్ చేయటం విశేషంగా మారింది. కొత్త

మద్యం షాపులు ప్రారంభించిన డిసెంబర్ 1 మధ్యాహ్నం ఒంటిగంట తర్వాతే విక్రయాలు మొదలు పెట్టారు. సాయంత్రం 6 గంటలకు పర్మిట్ రూంలోకి అనుమతిస్తున్నారు.
మద్యం షాపులకు కొత్తగా టెండర్లు వేసే సందర్భంలోనే మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా మద్యం షాపులు దక్కించుకునే యజమానులకు బెల్ట్ షాపులు నిర్వహించొద్దని సిండికేట్ అవ్వకూడదని, ఊరి బయటే మద్యం విక్రయాలు జరపాలని, పర్మిట్ రూంలకు అనుమతించొద్దని పలు సూచనలు చేశారు రాజ్ గోపాల్ రెడ్డి. స్థానికంగా ఉన్న వ్యక్తులే మద్యం టెండర్లు వేసి దక్కించుకునేలా ప్రోత్సహించారు. మద్యం టెండర్ల డ్రాలో కొన్ని మద్యం షాపులు స్థానికులు, మరికొన్ని స్థానికేతరులు దక్కించుకున్నారు.
లిక్కర్ వ్యాపారస్థులతో సమావేశం
మునుగోడు నియోజకవర్గంలో మద్యం షాపులు దక్కించుకున్న యజమానులతో హైదరాబాదులోని తన నివాసంలో కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించి మద్యం షాపులను మధ్యాహ్నం 1:00 గంట తర్వాత తెరవాలని, 6 గంటల నుండి పర్మిట్ రూములకు అనుమతి ఇవ్వాలని, బెల్ట్ షాపులకు మద్యం విక్రయించొద్దని సూచించారు. రాజగోపాల్ రెడ్డి సూచించిన అంశాలకు లోబడి మద్యం షాపులు నిర్వహిస్థామని మాట ఇచ్చారు మద్యం షాపులు దక్కించుకున్న యజమానులు, ఈరోజు నుండి నియోజకవర్గ వ్యాప్తంగా కొత్త మద్యం షాపులు ఓపెన్ చేసారు. మునుగోడు నియోజకవర్గం లోని మండలాలలో ఊరి బయటే మద్యం దుకాణాలను ప్రారంభించి మధ్యాహ్నం 1:00 గంటల నుండి విక్రయాలు ప్రారంభించారు. 

కొత్తగా మద్యం టెండర్ల ప్రక్రియ మొదలవగానే టెండర్ల ప్రక్రియలోనే మునుగోడులో మద్యం షాపుల నిర్వహణ, మద్యం నియంత్రణపై సూచనలతో కూడిన ఫ్లెక్సీలను రాజగోపాల్ రెడ్డి ఏర్పాటు చేయించారు. రాజగోపాల్ రెడ్డి  తీసుకున్న నిర్ణయానికి మద్యం షాపుల యజమానులు తోడ్పాటును అందిస్తూ మద్యం షాపులను నిర్వహించడానికి ముందుకు రావటం విశేషం. ఇది రాష్ట్రానికే ఆదర్శప్రాయంగా మారనుందని రాజగోపాల్ రెడ్డి అనుచరులు అభిప్రాయపడుతున్నారు.
ప్రజల ఆరోగ్యం మెరుగుపర్చేలా ఎక్సైజ్ పాలసీని మార్చడంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తెలిసిన విషయమే.
అయితే, ఈ నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వ ఎక్సైజ్ విధానానికి విరుద్ధంగా ఉన్నాయని, చట్ట ప్రకారం రాష్ట్రం మొత్తం ఒకే మద్యం పాలసీ అమలవుతుందని, నియోజకవర్గానికి ప్రత్యేక రూల్స్ ఉండవని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేసినా, మద్యం షాప్ యజమానులు రాజగోపాల్ రెడ్డి విధించిన నిభందనలకే కట్టుబట్టారు. మునుగోడులో తన మాటే శాసనం అని రాజగోపాల్ రెడ్డి నిరూపించున్నారనే చెప్పవచ్చు.
మునుగోడు రాష్ట్రానికే మోడెల్ అవుతుందా?
నియోజకవర్గంలో ఇప్పటికే విచ్చలవిడిగా మద్యం అందుబాటులో ఉన్న నేపథ్యంలో బెల్ట్ షాపుల నిర్మూలన ఉద్యమం చేపట్టి గ్రామాలలో బెల్ట్ షాపులు లేకుండా చేశారు. గత 20 నెలల్లో బెల్టుషాపులకు లిక్కర్ వెళ్లకుండా ఎమ్మెల్యే తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మునుగోడును రోల్ మోడల్ గా నిలబెట్టాలన్నదే తన లక్ష్యమని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చెబుతున్నారు. రెండేళ్లలో మరిన్ని కఠిన చర్యలు అమలు చేయడం ద్వారా వెనకబడ్డ మునుగోడులో మద్యపాన నిషేధం పక్కాగా అమలు చేయోచ్చనీ రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నారట. ఇందుకు అందరూ సహకరించాలని తనదైన శైలిలో లిక్కర్ వ్యాపారులకు వార్నింగ్ ఇచ్చారట.
మద్యం షాపు యజమానుల ఇబ్బంది పెట్టడం తన ఉద్దేశం కాదని, నియోజకవర్గంలోని ప్రజల సంక్షేమాన్ని, ముఖ్యంగా యువతను, మద్యపాన వ్యసనాన్ని అరికట్టడం మరియు ఆర్థిక పురోగతిని ప్రోత్సహించడం ద్వారా వారిని ఇబ్బందులకు గురిచేయడమే తన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.


Tags:    

Similar News