వరంగల్ విమానాశ్రయం నుండి తొందరలో కార్గో సేవలు

తెలంగాణలో వచ్చే ఏడాదినుంచి మూడు ఎయిర్ పోర్టులు

Update: 2025-12-07 09:34 GMT
New Airports in Telangana

వచ్చే ఏడాది నుండి వరంగల్ విమానాశ్రయంలో కార్గో సర్వీసులు అందుబాటులోకి రాబోతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.  రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాలు, రోప్‌వేలకు మార్గం సుగుమమైందని చెప్పింది. వరంగల్, ఆదిలాబాద్, రామగుండంలలో కొత్త విమానాశ్రయాలను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావడానికి అవసరమైన ప్రక్రియ ప్రారంభమైందని ప్రభుత్వం పేర్కొంది. వచ్చే ఏడాది వరంగల్‌ విమానాశ్రయం నుంచి కార్గో సేవలు అందుబాటులోకి రానున్నాయని వెల్లడించింది.


తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమిట్‌-2047 నేపథ్యంలో రహదారులు-భవనాల శాఖ పరిధిలో రెండేళ్ల పురోగతిపై విడుదల చేసిన నివేదికలో ప్రభుత్వం పలు అంశాలను ప్రస్తావించింది. ‘యాదగిరిగుట్ట, నల్గొండలోని హనుమాన్‌ కొండ, నాగార్జునసాగర్, మంథని రామగిరి కోటకు రోప్‌వేలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయని పేర్కొంది. వీటితో పాటు కొత్త ఎక్స్‌ప్రెస్‌ వేలు, ఎలివేటెడ్‌ కారిడార్ల నిర్మాణంతో సరకు రవాణాలో వేగం పెరిగి, లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గుతాయని’ ప్రభుత్వం పేర్కొంది.


నివేదికలోని ముఖ్యాంశాలు


తెలంగాణ రైజింగ్‌-2047 ప్రణాళికకు అనుగుణంగా రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.60,799 కోట్లతో ప్రకటించిన భారీ ప్రాజెక్టులు అభివృద్ధికి ప్రోత్సాహం ‘మిర్రర్‌ స్మూత్‌’ రోడ్ల నిర్మాణంపై దృష్టి సారించినట్లు ప్రకటించింది.  హ్యామ్‌ టెక్నాలజీ పద్ధతిలో 419 రోడ్లను రూ.11,399 కోట్లతో 32 ప్యాకేజీలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు పేర్కొంది.  హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు బ్లాక్‌ స్పాట్‌లను సరిదిద్దేందుకు రూ.288 కోట్లతో చేపట్టనున్న ప్రాజెక్టు పనులు ఆమోదం పొందాయని చెప్పింది.


సుమారు రూ.10,400 కోట్లతో ఆరు వరుసల రహదారి నిర్మాణానికి డీపీఆర్‌ సిద్దం చేసింది.  ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రాజెక్టుకు రూ.36 వేల కోట్ల వ్యయమవుతుందని అంచనా వేసింది .  హైదరాబాద్‌-అమరావతి-మచిలీపట్నం రహదారి ఎలైన్‌మెంట్‌ నిర్ధారణకు డీపీఆర్‌ తయారీకి కన్సల్టెంట్‌ సంస్థ ఎంపికకు టెండర్లకు ఆహ్వానం పలికినట్లు చెప్పింది.  శాఖలో పనిచేస్తున్న  డీఈలకు ఈఈలుగా పదోన్నతి కల్పించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. హైదరాబాద్‌-శ్రీశైలం ఎలివేటెడ్‌ కారిడార్‌లో భాగంగా మన్ననూర్‌ నుంచి శ్రీశైలం వరకు రూ.8 వేల కోట్లతో కొత్త కారిడార్‌ నిర్మాణం చేపట్టబోతున్నట్లు ప్రకటించింది.

గత పదేళ్లలో ఎన్నడూ లేనివిధంగా రెండేళ్లలో సుమారు రూ.7 వేల కోట్ల వ్యయంతో కోటి చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు పూర్తి చేయబోతున్నట్లు తెలిపింది. కొత్త హైకోర్టు భవన సముదాయం, ఆసుపత్రులు, వైద్య కళాశాలల నిర్మాణాలను కొత్త ఏడాదిలో అందుబాటులోకి తీసుకొస్తున్నామని వెల్లడించింది. మెుత్తంగా 6,617.86 కోట్ల విలువైన 239 పనులకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది . వీటిలో 1,659 కి.మీ. రహదారులు, 62 వంతెనలు ఉన్నాయని పేర్కొందిమంది.   వచ్చే ఏడాది రాష్ట్రంలో జరగనున్న ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ సదస్సు ద్వారా కీలక రంగాల్లో పెట్టుబడులు సమకూరి, అభివృద్ధికి బాటలు పడతాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.

Tags:    

Similar News