‘బెట్టింగ్ యాప్ ల జోలికి వెళ్లను, క్షమించండి’

బెట్టింగ్ యాప్ ల జోలికి వెళ్ళకుండా యువత కష్టపడి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు

Update: 2025-11-12 13:21 GMT
Prakaash Raj

‘‘తెలిసి చేసినా, తెలియక చేసిన తప్పు తప్పే అవుతుంది అని.. మరో మారు బెట్టింగ్ యాప్ ల జోలికి వెళ్లను. నన్ను క్షమించండి’’ అని ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ అన్నారు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ల కేసులో సినీనటుడు ప్రకాశ్‌ రాజ్‌ బుధవారం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) విచారణకు హాజరయ్యారు. సీఐడీ కార్యాలయంలో అధికారులు ఆయన్ని ప్రశ్నించారు.


2016 లో ఓ బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేశా, ఆ తర్వాత అది గేమింగ్ యాప్ గా రూపాంతరం చెందింది. తర్వాత ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నా అని ఆయన వివరించారు. సిట్ అధికారులకు బ్యాంకు లావాదేవీలకు సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ సమర్పించినట్టు నటుడు చెప్పారు. ‘‘బెట్టింగ్ యాప్ లలో యువత పెట్టుబడులు పెట్టి ఆర్థికంగా నష్టపోతోంది. కష్టపడితేనే డబ్బు వస్తుంది. అందరం కలిసి కష్టపడి పని చేసుకుందాం‘‘ అని ప్రకాశ్ రాజ్ అన్నారు. ‘‘బెట్టింగ్ యాప్ లో పెట్టుబడులు పెట్టి అనేక కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయాయి. అనేకమంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అని ప్రకాశ్ రాజ్ అన్నారు.


జంగిల్ రమ్మీ యాప్ కేసులో ప్రకాశ్ రాజ్ ను విచారించారు. బెట్టింగ్ యాప్ లతో ఒప్పందాలు, చెల్లింపులుపైనే విచారణ జరిగింది. ప్రస్తుతం సిట్ అధికారుల విచారణ ఆర్థిక లావాదేవీలపైనే జరిగింది. ఈ ప్రమోషన్ల కోసం డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది. ఏ ఖాతాలో జమ అయ్యింది. హవాలా మార్గంలో చెల్లింపులు జరిగాయా తదితర కోణాల్లో విచారణ జరిగింది. సెలబ్రిటీలు ప్రచారకర్తలుగానే ఉన్నారా, అంతకు మించి పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో కూడా విచారణ చేశారు. ఈ క్రమంలో తెలంగాణ సిఐడి కార్యాలయం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.


ప్రకాశ్ రాజ్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నట్లు మియాపూర్, సైబరాబాద్, పంజాగుట్ట పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గతంలోఈ కేసులో ప్రకాశ్ రాజ్ జులై 30న ఈడీ విచారణకు హాజరయ్యారు. ఇదే కేసులో మంగళవారం నటుడు విజయ్‌ దేవరకొండను సిట్‌ ప్రశ్నించింది. ఇదే కేసులో యూట్యూబర్, నటి సిరి హనుమంతును కూడా ప్రశ్నించింది.

బెట్టింగ్ కేసుల్లో 29 మంది నిందితులు

బెట్టింగ్‌ యాప్‌లకు సినీతారలు, సెలబ్రిటీలు ప్రచారం కల్పించడం వల్ల యువత వాటికి బానిసలై ప్రాణాలు పోగొట్టుకున్నారంటూ తెలంగాణలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. వాటి విచారణకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సీఐడీ అదనపు డీజీపీ నేతృత్వంలో సిట్‌కు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆయా కేసుల్లో విజయ్‌తోపాటు సినీనటులు రాణా దగ్గుబాటి, ప్రకాశ్‌రాజ్, మంచు లక్ష్మి సహా మొత్తం 29 మంది నిందితులుగా ఉన్నారు. సైబర్ నేరాల్లో ఉన్న ప్రముఖులను విచారించడంలో సిట్ దూకుడు పెంచింది. రానున్న రోజుల్లో ఈ కేసులతో సంబంధమున్న ప్రముఖులను సిట్ విచారించనుంది. ఈ కేసులో సంచలన విషయాలు బయటకు రానున్నాయి.

Tags:    

Similar News