తులంబంగారానికి వడ్డీగా తులమున్నర బంగారం
మెదక్ జిల్లాలో రెచ్చిపోతున్న ప్రయివేటు ఫైనాన్స్ వ్యాపారులు
మెదక్ జిల్లాలో ప్రయివేటు ఫైనాన్స్ వ్యాపారుల ఆగడాలకు అడ్డులేకుండా పోతోంది. ఎక్కడా లేని నిబంధనలతో డబ్బు అవసరం ఉన్నవారిని ముప్పుతిప్పలు పెడుతున్నారు. తులం బంగారం అప్పుగా ఇస్తే.. దానికి వడ్డీ కలుపుకుని తిరిగి తులమున్నర బంగారం ఇవ్వాలని సొంత రూల్స్ పెట్టారు. ఈ రూల్‌ను పాటించడంలో ఒక కుటుంబం విఫలమైనందుకు వారిపై దాడి చేశారు. ఈ ఘటన మెదక్ జిల్లా కోల్చారం మండలం పోతన్ శెట్టి పల్లి గ్రామంలో జరిగింది. పోతన్ శెట్టి గ్రామం వడ్డెర కాలనీకి చెందిన బోసు రమణి, రవి దంపతులు ఇంటి నిర్మాణం కోసం రెండేళ్ల క్రితం ఐదుగురు ఫైనాన్స్ వ్యాపారుల దగ్గర నుంచి తొమ్మిది తులాల బంగారం అప్పుగా తీసుకున్నారు. దానిని తిరిగి ఇవ్వడంలో దంపతులు ఆలస్యం చేశారు. దీంతో దంపతుల ఇంటిపై ఫైనాన్స్ వ్యాపారులు మూకుమ్మడిగా దాడి చేశారు. రుణగ్రహిత కుటుంబ సభ్యులను కరెంటు స్తంభానికి కట్టేసి కొట్టారు.