షాద్ నగర్ జాతీయ రహదారిపై విద్యార్థినుల మెరుపు సమ్మె

నాగర్ కర్నూల్ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యార్ధినులు రోడ్డుపై బైఠాయింపు

Update: 2025-11-02 11:01 GMT
Shadnagar highway students strike

షాద్ నగర్ పట్టణంలో నిర్వహిస్తున్న నాగర్ కర్నూల్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థినిలు వందలాది మంది రోడ్లపైకి వచ్చి మెరుపు సమ్మెకు దిగారు. గురుకులంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై నిరసిస్తూ ఆదివారం మధ్యాహ్నం విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. వారిని ఆపడానికి అధ్యాపక బృందం ప్రయత్నించింది. అయినా విద్యార్థినిలు వారిని లెక్కచేయకుండా రోడ్లపైకి వచ్చి న్యాయం చేయాలి అంటూ బైటాయించారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని కమ్మదనం శివారులో నూర్ ఇంజనీరింగ్ కళాశాల భవనంలో నిర్వహిస్తున్న నాగర్ కర్నూల్ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యార్థినిలు వందలాదిగా గురుకులం నుండి పాదయాత్రగా నడుచుకుంటూ వచ్చి షాద్ నగర్ పట్టణంలోని బైపాస్ రహదారిపై కూర్చున్నారు. ముందు అక్రమాలు ఆపండి ఆ తర్వాత విద్యను అందించండి అంటూ ప్ల కార్డ్స్ లను ప్రదర్శించారు. అదేవిధంగా లంచగొండితనాన్ని రూపుమాపాలి అంటూ ప్ల కార్డులపై రాశారు. ప్రిన్సిపాల్ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రోడ్లపైకి వచ్చారు. రోడ్డుపైకి  వచ్చిన విద్యార్థులను చూసి వాహనదారులు అక్కడే ఆగిపోయారు. ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉండడంతో సమాచారం అందుకున్న పోలీసులు కూడా ఘటనా స్థలికి చేరుకున్నారు. వారితో మాట్లాడి  ఆందోళన విరమింపింపజేసే దిశగా ప్రయత్నాలు జరుపుతున్నారు. అయితే విద్యార్థులు మాత్రం భీష్మించుకుని అక్కడే కూర్చున్నారు.

Tags:    

Similar News