ముగ్గురిని చంపి ఆత్మహత్య చేసుకున్న హంతకుడు
అర్ధరాత్రి నిద్రలేచిన యాదయ్య కత్తి తీసుకుని భార్య, ఒదినతో పాటు కూతుర్ల మీద దాడిచేశాడు
వికారాబాద్ జిల్లాలోని కులచర్ల మండలకేంద్రంలో ఆదివారం తెల్లవారుజామున దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో ముగ్గురిని చంపేసి చివరకు భర్త తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం ఏమిటంటే మండలకేంద్రంలో వేవూరి యాదయ్య భార్య, ముగ్గురు పిల్లలతో ఉంటున్నాడు. కొంతకాలంగా భార్య అలివేలుపై యాదయ్యకు అనుమానం మొదలైంది. వీరికి అపర్ణ, శ్రావణి అనే కూతుర్లున్నారు. ప్రతిరోజు ఏదో ఒక అనుమానంతో భార్యను భర్త కొడుతుండేవాడు.
ఇద్దరి మధ్యా గొడవలు పెరిగిపోవటంతో ఒకసారి భార్యను తీవ్రంగా యాదయ్య కొట్టాడు. దాంతో భర్త నుండి కూతుర్లిద్దరిని తీసుకుని అలివేలు విడిగా ఉంటోంది. వీళ్ళ గొడవలు తెలుసుకున్న యాదయ్య ఒదిన హన్మమ్మ శనివారం కులచర్లకు వచ్చింది. భార్యా, భర్తలను కూర్చోబెట్టి పంచాయితీచేసింది. గొడవలు మానేసి కలిసుండాలని యాదయ్యకు గట్టిగా చెప్పింది. ఒదిన చెప్పినట్లే వింటానని యాదయ్య అంగీకరించాడు.
శనవారం రాత్రి భోజనాలు చేసి అందరు పడుకున్నారు. అర్ధరాత్రి నిద్రలేచిన యాదయ్య కత్తి తీసుకుని భార్య, ఒదినతో పాటు కూతుర్ల మీద దాడిచేశాడు. ఈ దాడిలో భార్య, కూతురు శ్రావణి, ఒదినకు తీవ్రగాయాలవ్వటంతో ఇంట్లోనే కుప్పకూలిపోయారు. మరోకూతురు అపర్ణ తప్పించుకుని బయటకు పారిపోయి గట్టిగా కేకలు వేసింది. చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళ ఇంటిదగ్గరకు వచ్చి జరిగింది తెలుసుకున్నారు. ఇంట్లోకి వెళ్ళి చూడగా ముగ్గురూ కత్తిపోట్లకు గురైచనిపోగా యాదయ్య కూడా ఉరేసుకుని వేలాడుతు కనిపించాడు. విషయం తెలుసుకుని పోలీసులు వచ్చారు. అపర్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకుని పరిగి డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు జరుగుతోంది.