‘రాజకీయ నాయకులుగా మనం ఫెయిల్ అవుతున్నాం’

తెలంగాణ చరిత్ర మొత్తాన్ని ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు గుంటూరుకు తీసుకెళ్లారన్న కవిత.

Update: 2025-11-12 07:53 GMT

బీఆర్ఎస్‌ను తిట్టి తిట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు ఏం చేస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రశ్నించారు. ఆమె చేపట్టిన జాగృతి జనం బాట.. బుధవారం నల్గొండలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆమె పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మనమంతా రాజకీయ నాయకులుగా విఫలమయ్యామని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించకపోవడం అందుకు నిదర్శనమన్నారు. తెలంగాణ చరిత్ర మొత్తాన్ని ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు గుంటూరుకు తీసుకెళ్లారని, దానిని వెనక్కు తీసుకురావాలని అన్నారు. ‘‘ఎస్ఎల్ బీసీ, నక్కలగండి, డిండి ప్రాజెక్ట్ లు ఎప్పుడు పూర్తి చేస్తారు?సుంకిశాల ప్రమాదంపై కాంట్రాక్ట్ సంస్థపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? మేఘాతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులది ఫెవికాల్ బంధం ఏంటీ?’’ ప్రశ్నలు గుప్పించారు.

‘‘నల్గొండ జిల్లా అంటేనే ఎంతో చరిత్ర కలిగిన జిల్లా. రాజ్యాలు, ప్రజా ఉద్యమాలు, విప్లవాత్మక ఆలోచనలు కలిగిన ప్రాంతం. ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే ఒకప్పుడు బౌద్ధం, జైనం తో పాటు అద్భుతమైన ఆలోచన సరళి కలిగిన జిల్లా. ఉమ్మడి రాష్ట్రంలో మా ఇక్కడి చరిత్రను గుంటూరుకు తీసుకెళ్లారు. ఉద్యమం సమయంలో దీనిపై మేము పోరాటం చేశాం. నాగార్జున కొండ వద్ద ఉన్న స్థూపాన్ని కూడా గుంటూరు కు తీసుకెళ్లారు. పానగళ్లు లో ఉన్న ఎన్నో విగ్రహాలను అక్కడకు తీసుకెళ్లారు. తెలంగాణ వచ్చాక కూడా అవన్నీ రిటర్న్ రాలే. జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ చరిత్ర కాపాడుకునే ప్రయత్నం జరుగుతుంది’’ అని అన్నారు.

‘‘మేము ఇక్కడి చరిత్ర తెలుసుకునే క్రమంలో 60 వేల ఏళ్ల చరిత్ర ఈ ప్రాంతానికి ఉందని తెలిసింది. పచ్చల, ఛాయ సోమేశ్వరం ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. ఇంకో పక్క సాయుధ రైతాంగ పోరాటం జరిగింది. సాయుధ రైతాంగ పోరాటం చేయని ఇళ్లు ఇక్కడ లేదు. ఆనాటి ఉద్యమ కారులు మల్లు స్వరాజ్యం గారిని ఇటీవలే మనం కోల్పోయాం. కానీ ఇప్పటికీ కూడా జిల్లాలో అదే చైతన్యం ఉంది. ఆలోచనపరులు, చైతన్య వంతులు కలిగిన జిల్లా ఇది. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రతి నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలు తిరిగాను. హుజుర్ నగర్ లో సిమెంట్ ఫ్యాక్టరీలలో కొలువు కోసం కొట్లాట అనే కార్యక్రమాలు చేశాం’’ అని చెప్పారు.

‘‘కానీ జిల్లాకు నీళ్లు అంటే కృష్ణానది మీదనే ఎక్కువ ఆధారపడాల్సిన పరిస్థితి. మరి బీఆర్ఎస్ పదేళ్లు, కాంగ్రెస్ రెండేళ్లు పన్నెండేళ్లలో కృష్ణానది నీళ్లు తెచ్చుకున్నామా ఆలోచన పరులు ఆలోచించాలి. నాగార్జున సాగర్ డ్యామ్ ఇక్కడే కనబడుతుంది. కానీ చుట్టు ఉన్న ఐదు మండలాలకు నీళ్లు రావు. నెల్లికల్లు ప్రాజెక్ట్ పూర్తైతే 5 మండలాలకు నీళ్లు వస్తాయి. కానీ ఇప్పటి వరకు ఎవరు పూర్తి చేయలేదు. బీఆర్ఎస్ ను ఇదే అంశంలో విమర్శించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లైనా ఎందుకు పనులు చేయటం లేదు. బీఆర్ఎస్ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా సరే సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయి. అందుకే ప్రభుత్వాన్ని అడిగే వాళ్లు ఉండాలి. వారిపై ఒత్తిడి పెట్టినప్పుడే పనులు అవుతాయి. ఇక్కడి సుంకిశాలను హైదరాబాద్ నీటి అవసరాలకు సెకండ్ అల్టర్ నేట్ అని గతంలో కేటీఆర్ ప్రారంభించారు’’ అని గుర్తు చేశారు.

‘‘ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిటైనింగ్ వాల్ కొట్టుకుపోయిన పరిస్థితి. కనీసం ఆ విషయాన్నిబయటకు కూడా చెప్పలేదు. ఎంప్లాయిస్ తీసిన వీడియో ద్వారా ఆ విషయం బయటకు తెలిసింది. దీంతో ఆగమేఘాల మీద అధికారులను తీసేశారు. ఎంక్వైరీ వేశామన్నారు. విచారణ కమిటీ కాంట్రాక్ట్ సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని సూచించింది. కానీ కాంట్రాక్టర్ ను ఏమీ చేయలే. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకట్ రెడ్డి గారు ఒక్క మాట అనలే. ఇక మేఘాతో సీఎం ఫెవికల్ బంధం తెలిసింది. ఆయన ఒక్క మాట మాట్లాడలేదు. ఇలాగే ఎన్ని ఏళ్లు పనులు చేసుకుంటూ పోతారు. కిష్టరాయినిపల్లె, నెల్లికల్ ప్రాంతాల్లో భూసేకరణ చేసిన 17 ఏళ్లు అవుతోంది’’ అని చెప్పారు.

‘‘బీఆర్ఎస్ ను ఇవే అంశాలపై తిట్టి తిట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ స్కూల్స్, వెల్ఫేర్ హాస్టల్స్ ను పట్టించుకోవటం లేదు. కలెక్టర్లు వారానికి ఒకసారి సోషల్ వెల్ఫేర్ స్కూల్ లో నిద్ర చేయాలని సీఎం గారు చెప్పారు. ఎక్కడైనా కలెక్టర్లు ఆ మాటను పట్టించుకున్నారా? సీఎం మాట అంటే కలెక్టర్లకు లెక్క లేదు. ఉదయం మేము మెటర్నటీ హాస్పిటల్ కు వెళ్లాం. ఒక్కో బెడ్ మీద ఇద్దరు పేషెంట్లను, పిల్లలను పడుకోబెట్టారు. డాక్టర్లు, నర్సుల ఓపికకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. సౌకర్యాలు లేకపోయినా వారు పనిచేస్తున్నారు. కానీ రాజకీయ నాయకులుగా మనం ఫెయిల్ అవుతున్నాం. హాస్పిటల్ డెవలప్ మెంట్ అథారిటీ అని ఒకటి ఉంటుంది. రోజు వారీ అవసరాలకు ఇక్కడి హాస్పిటల్ లక్షా 20 వేల ఖర్చు ఉంటుంది’’ అని తెలిపారు.

Tags:    

Similar News