తెలంగాణ లో పంటల భీమా పథకం ఎందుకు లేదు?

2020 లో కేంద్ర పథకం నుండి వైదొలగిన బిఆర్ఎస్; హామీ మేరకు పునరుద్దరించని కాంగ్రెస్ ప్రభుత్వం

Update: 2025-11-02 02:30 GMT

రాష్ట్రం లో మొంథా తుఫాను మిగిల్చిన భీభత్సం నేపధ్యం లో రాష్ట్రం లో పంట భీమా పథకం లేమి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ప్రభుత్వ ప్రాథమిక గణాంకాల ప్రకారమే మొoథా తుఫాన్ వలన రాష్ట్రం లో 4.47 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది.

రాష్ట్రం లో అత్యంత ఎక్కువ గా తుఫాను తో ప్రభావితం అయిన వరంగల్ జిల్లా లో పర్యటించిన రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఎకరాకు పది వేలు చెల్లిస్తామని చెప్పారు. ప్రస్తుత విపత్తు వలన 12 జిల్లాల్లో ని 179 మండలాల్లో 2,53,033 మంది రైతులు ప్రభావితం అయ్యారు. ఈ సంఖ్య యింకా పెరిగే అవకాశం వుంది. పంట నష్టం ఎక్కువ గా వరి 2,82,379 ఎకరాల్లో పత్తి 1,51,707 ఎకరాల్లో జరిగింది.

నష్టపోయిన రైతుల ను ఆదుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక ప్రకటన లో చెప్పారు. అయితే ప్రకటించిన పది వేలు తమను జరిగిన నష్టం నుంచి ఏమాత్రం బయట పడేయదని తమకు మెరుగైన పథకం కావాలని రైతులు కోరుతున్నారు. ప్రకటించిన పది వేలు కూడా తమకు యింతకుమునుపు అందలేదని వారు చెప్తున్నారు.

2016 లో ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన ప్రారంభం లో అందులో చేరిన తెలంగాణ 2020 లో పథకం నుండి వైదొలగింది. ఆ సమయంలో పథకం కేవలం కార్పొరేట్ లకు మాత్రమే ఉపయోగపడుతోందని కెసిఆర్ ఆరోపించారు. తెలంగాణ తో పాటు బీహార్, పశ్చిమ బెంగాల్, ఆంధ్ర ప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాలు యిదే బాటలో పయనించాయి. అయితే చాలా రాష్ట్రాలు తమ స్వంత పథకాలను ప్రవేశపెట్టాయి. బిఆర్ఎస్ మే 10, 2018 లో రైతు బంధు పథకం ప్రవేశపెట్టాక ఎన్ని విమర్శలు ఎదురైనా మళ్ళీ ఇన్షూరెన్స్ పథకం గురించి పునరాలోచించలేదు.

అప్పటినుండి పంట నష్టం జరిగిన సమయం లో ఎకరాకు పది వేలు బిఆర్ఎస్ ప్రభుత్వం యిస్తామని ప్రకటించింది. కానీ అది కూడా తమకు బిఆర్ఎస్ ప్రభుత్వం లో కానీ యిప్పుడు ఉన్న కాంగ్రెస్ పాలన లో నూ నష్టాలు జరిగినప్పుడు అందలేదని కరీంనగర్ జిల్లా చొప్పదంటి మండల రైతు జి. రవీందర్ రెడ్డి వాపోయారు.

“బిఆర్ఎస్ హయాం లో కెసిఆర్ మా ప్రక్క మండలం రామడుగు వచ్చి ఎకరాకు పది వేలు యిస్తామని ప్రకటించారు. అక్కడా చాలా తక్కువ మందికే యిచ్చారు. కానీ మాకు ఒక్క పైసా రాలేదు. పత్తి కి ఎకరాకు ముప్పై వేలు వరికి ముప్పై ఐదు వేలు వరకు ఖర్చు పెట్టాను. పంట చివర దశలో ఉంది. యిప్పటికే పది లక్షల అప్పు ఉన్న నేను భూమి పాస్ బుక్ బ్యాంకు లో పెట్టి రెండు లక్షల పంట రుణం తీసుకున్నాను. ప్రభుత్వం మాకు జరిగిన నష్టానికి తగిన సహాయం చేయాలి, అని ఆ రైతు తన ఆవేదన వ్యక్తం చేశారు.

పంట నష్టం అతి ఎక్కువ గా ఎదుర్కొన్న వరంగల్ జిల్లా వ్యంజరపల్లి గ్రామ రైతు ఎస్. రవీందర్ (43) తన ఎకరా చిక్కుడు, కాలీఫ్లవర్ పంట లకు యిప్పటికి పెట్టిన యిరవైవేలు, రెండు ఎకరాల వరికి యాభై వేలు ఖర్చు పెట్టి మొత్తం నష్టపోయారు. “కాలీఫ్లవర్ కు రాబోయే కార్తీక మాసం లో మంచి డిమాండ్ వుంటుందని వేశాను కానీ మొత్తం పంట కుళ్ళి పోయింది. అందుకే కూరగాయల ధరలు మార్కెట్ లో పెరుగుతున్నాయి. మా పంట నష్టం ఎక్కువైనా మాకు ఒకే ఒక సారి కెసిఆర్ ప్రకటించిన ఎకరాకు పది వేలు వచ్చింది. యిప్పుడు పంట భీమా పథకం అమలు లో లేదు కాబట్టి ప్రభుత్వం దయ మీద ఆధార పడాల్సిందే. నేను పెట్టుబడికి బయటి అప్పులు రెండు రూపాయల వడ్డీ కి తెచ్చాను,” అన్నారు.

అదిలాబాద్ రైతు కె. ప్రతాప్, “వర్షాల వలన పత్తి నల్ల బడింది. పంట పూత దశలో వర్షాలు రావటం తో రాలిపోయింది. పత్తి సాధారణంగా ఎకరాకు వచ్చే 12 క్వింటాల్ దిగుబడి 8 కి పడిపోయింది. సోయా బీన్ పంట కు కూడా నష్టం జరిగింది. మాది ఎత్తు ప్రాంతం కాబట్టి నీరు నిల్వ ఉండదు. పత్తి లో తేమ శాతం ఎక్కువ గా వుంది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) వాళ్ళు పత్తి లో 12 శాతం కంటే ఎక్కువ గా ఉంటే అధికంగా ఉన్న ఒక్కో శాతానికి ఒక క్వింటాల్ కు ఎనభై రూపాయలు ధర తగ్గిస్తారు. యిప్పుడు తేమ శాతం 16 నుండి 18 శాతం గా వుంది. యిప్పుడు పత్తి తీస్తే కూలీలు కూడా ఎక్కువ అవుతాయి. వ్యవసాయ అధికారులు రైతులకు యిప్పుడే పత్తి కోయ వద్దని చెప్తున్నారు. నాకు 2018-19 లో మాత్రమే ఒక సారి ఎకరాకు Rs 17,500 పంట భీమా వచ్చింది. ఆ తరువాత ఎప్పుడు నష్ట పరిహారం రాలేదు,” అన్నారు.

రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల యిప్పటికే పత్తి తేమ శాతం లో సడలింపు కోరుతూ కేంద్రానికి ఉత్తరం రాసిన విషయం తెలిసిందే.

యిక అదిలాబాద్ జిల్లా, యపలగూడ గ్రామ రైతు కుమర లక్ష్మణ్ తమ మూడు ఎకరాల పొలం కొట్టుకు పోయిందని చెప్పారు. “ఈ నష్టాలు మాకు 2018, 2022, 2023 లో మళ్ళీ 2025 ఆగస్టు లోనూ జరిగాయి. ఎకరాకు యిరవై వేల చొప్పున అరవై వేలు నష్టపోయాం. వ్యవసాయ శాఖ వాళ్ళు నమోదు చేసుకుని పోయారు కానీ పైసా చెల్లించలేదు. 2013 లో మాత్రం మాకు నష్ట పరిహారం వచ్చింది. నా తో సహ 15 మంది రైతులు మాకు పంట నష్ట పరిహారం కోరుతూ హై కోర్టు లో మేము కేసు వేసి గెలిచాక రాష్ట్ర ప్రభుత్వం దాని పై సుప్రీం కోర్టు కు అప్పీల్ వెళ్ళింది,” అని చెప్పారు.

ఈ కేసు వేసిన రైతు స్వరాజ్య వేదిక (PIL 290/2020) కార్యకర్త బి. కొండల్ రెడ్డి దీని పై మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వాలు పంట నష్టం జరిగినప్పుడు అప్పుడప్పుడు పది వేలు ఎకరాకు నష్టపరిహారం ఇస్తున్నాయి కానీ పంట నష్టం నమోదు చేసుకోవడంలో తీవ్రమైన అన్యాయం జరుగుతోంది అన్నారు. “ప్రాథమిక నివేదిక అంటూ మూడు లక్షల ఎకరాలలో లేదా నాడు లక్షలు ఎకరాలలో పంట నష్టపోయినట్లు ప్రకటన వస్తుంది. ఆ సంఖ్యను తదుపరి కుదించి నష్టపరిహారం ఇస్తున్నారు. పంట నమోదు సరిగ్గా జరగకపోతే నిజమైన అర్హులు ఎవరో రికార్డు వుండదు. జులై నుండి సెప్టెంబర్ 2021 మద్యన ఈ కేసు లో హై కోర్టు Rs 188.23 కోట్ల నష్ట పరిహారం చెల్లించాలని యిచ్చిన తీర్పు ను అమలు చేయకుండా అప్పటి కెసిఆర్ ప్రభుత్వం సుప్రీం కోర్టు కు పోయింది. యిప్పటికి అది విచారణకు నోచుకోలేదు.”

ఒక వైపు రాష్ట్ర ప్రభుత్వాలు తాము ఖర్చు పెట్టిన సొమ్ముకు లెక్కలు యివ్వక పోవడం తో అది సాకుగా చూపి కేంద్రం కూడా తదుపరి తాను యివ్వాల్సిన నిధులను యివ్వకుండా చేస్తోంది. దీనితో నష్టపోయిన రైతులకు సహాయం అందటం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు SDRF (State Disaster Response Fund) లో తాము ఖర్చు పెట్టిన సొమ్ముకు లెక్కలు యివ్వక పోవడం తో అది సాకుగా చూపి కేంద్రం తదుపరి నిధులు యివ్వకుండా ఆలస్యం చేయటం పరిపాటి అయిపోయింది. దీనితో నష్టపోయిన రైతులకు సహాయం అందటం లేదు, అని ఆయన వాపోయారు.

ఈ ఏడు అక్టోబర్ మొదటి వారం లో వచ్చిన వర్షాల వలన పంట నష్టం జరిగిన ప్రాంతాలలో తాము జరిపిన నిజ నిర్ధారణ సందర్భంగా తన అనుభవాన్ని చెబుతూ, “మేము యిటీవల వికారాబాద్ జిల్లాకు వెళితే ఒక్క గ్రామంలోనే 500 ఎకరాల్లో పంట నష్టం జరిగితే అధికారులు మొత్తం మండలం లో 100 ఎకరాలలో మాత్రమే పంట నష్టం జరిగినట్టు నమోదు చేశారు. ఈ వర్షాల కారణంగా పత్తి అమ్ముకోవడంలో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఉదాహరణకు మేము మొన్న జిన్నింగ్ మిల్లుకు వెళ్ళినప్పుడు మొత్తం వచ్చిన 15 లోడ్లు లో కేవలం రెండు లోడ్లు లో మాత్రమే 12 లోపు తేమ శాతం ఉంది. రైతులకు ఒక్కొక్క లోడ్ మీద ట్రాక్టర్ బాడుగ కూలీలకు Rs 6,500 ఖర్చు వస్తుంది. కాబట్టి రైతులు పత్తి మళ్ళీ వెనక్కి తీసుకెళ్లలేక తక్కువ ధరకు అమ్ముకుంటున్నారు.”

యిప్పుడే కౌలు రైతుల కు జరిగిన నష్టం నమోదు చేయక పోతే వారికి నష్ట పరిహారం రాదు, వారి మరణాలు ఆగవు, అని కొండల్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రం లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ అధీకృత సాగుదారుల చట్టం 2011 ప్రకారం కౌలు రైతులను గుర్తించి వాళ్ళను ఆదుకోవాలి.

దీనిపైన అధ్యయనం చేసిన ముంబై లో (Tata Institute of Development Studies) ని ప్రొఫెసర్ ఆర్. రామ్ కుమార్ భీమా యోజన లో కేంద్రం తన వాటా యివ్వడం తగ్గిస్తోందని చెప్పారు. “పథకం లో కేంద్రం రాష్ట్రాలు 50:50 నిష్పత్తి లో చెల్లిస్తాయి. ప్రారంభంలో రాష్ట్రాల వాటా Rs 7,400 వుండగా అది యిప్పుడు Rs 10,700 కోట్లకు పెరిగింది. అయితే కేంద్రం వాటా మాత్రం Rs 7,100 నుండి Rs 8,200 కు మాత్రమే పెరిగింది. అలాగే యిచ్చే నష్ట పరిహారం 2018 లో Rs 14,800 వుండగా 2023 నాటికి Rs 10,400 కు పడిపోయింది. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద Rs 6,000 పొందే 12 కోట్ల రైతులలో 2018 లో 2.17 కోట్ల రైతులు భీమా పథకం పరిధిలో వుండగా 2022 నాటికి వారి సంఖ్య 1.9 కోట్ల రైతులకు పడిపోయింది. అందుకే ఆంధ్ర ప్రదేశ్, జార్ఖండ్, గుజరాత్, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాలు భీమా పథకం నుండి బయటికి వచ్చాయి. ఒక సమగ్రమైన పంట భీమా పథకాన్ని మనం యింకా రూపొందించుకోవాల్సి వుంది,” అని అన్నారు.

రాష్ట్రాలు పథకం నుండి బయటికి రావటానికి గల కారణాలను చెప్తూ, “ఈ పథకం లో నష్టపరిహారం లెక్కకట్టేందుకు గడిచిన ఏడు సంవత్సరాలలో అందులో విపత్తులు వచ్చిన రెండు సంవత్సరాల నష్టాలను మినహాయించి లెక్కగడతారు. యిది మెట్ట ప్రాంత రైతులకు అనుకూలం కాదు,” అని పేర్కొన్నారు.

కేంద్రం ఈ పథకాన్ని ప్రవేశపెట్టాక దానికి బడ్జెట్ లో కేటాయింపు ప్రతి ఏడు తగ్గిస్తోంది. పథకానికి కేంద్ర కేటాయింపులు ఈ సంవత్సరం పోయిన ఏడు Rs 19,000 కోట్ల నుంచి Rs 13,000 కోట్లకు తగ్గించారు. దీనితో దేశం లో ఆరుకోట్ల మంది రైతులు లబ్ధి దారులుగా మొదలయిన పథకం నేడు అందులో సగం మంది మూడు కోట్ల రైతులకే ఉపయుక్తంగా వుంది, అని అఖిల భారత కిసాన్ సంఘ నాయకులు సారంపల్లి మల్లా రెడ్డి అన్నారు.

పశ్చిమ బెంగాల్, పంజాబ్ రాష్ట్రాలు తమ స్వంత పథకాన్ని ప్రవేశపెట్టాయి. కానీ అవి కూడా వెనక్కి తగ్గుతున్నాయి. ఈ ఇన్షూరెన్స్ అమలు కష్టం యితర పథకాల లాగా చేయలేరు. దీనికి సరాసరి పంట దిగుబడి చూసి లెక్కకట్టాలి. ప్రతి పంటకు రాష్ట్ర సరాసరి కేంద్రం సరాసరి వుంటాయి. పంట కోత పరీక్షలు ఎప్పటికప్పుడు చేయరు. ఈ పరిస్థితి లో యిది అమలు కాదని ప్రొఫెసర్ దండేకర్ ముందే వారించారు. అమెరికా లో ప్రీమియం రైతులే కడతారు. నష్టం జరిగితే ప్రభుత్వం కంపెనీ సగం సగం భరించి పంపుతాయి. రైతులకు పంట పెట్టుబడి మారుతుంటుంది అలాగే దిగుబడి మారుతుంది. ఇన్షూరెన్స్ లేనప్పుడు పరిహారం యివ్వాలి. ఎకరానికి సిఎం చెప్పినట్టు పది వేలు కాకుండా Rs 25,000 డిమాండ్ చేయాలి.

కేంద్ర ఇన్షూరెన్స్ కావాలంటే దానికి నిర్ణీత సమయం లో రాష్ట్రం ప్రీమియం చెల్లించాలి. బ్యాంకులు స్కేలు ఆఫ్ ఫైనాన్స్ ను బట్టి అప్పుయివ్వాలి. ఆ సొమ్మును జిల్లా లో ని కమిటీ సిఫారసు ను బట్టి నిర్ణయిస్తారు. కానీ బ్యాంకులు అంత యివ్వవు. తక్కువ యిస్తాయి. భూమి మీద వేసే పంటలు నిరంతరం మారుతుంటాయి. వాటిని నమోదు చేయాలి. గ్రామాల్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ వీఆర్వొ లు లేరు. దీని అమలు కేంద్రం రాష్ట్రం కలిసి చేయాలి. కాబట్టి రాష్ట్ర వ్యవసాయ శాఖకు దీని అమలు గురించిన ఆసక్తి లేదు. పంట నష్టం జరిగాక పరిహారం చెల్లించటమే మెరుగైన పరిష్కారం. ఎంత జరిగితే అంత యివ్వాలి.

ప్రభుత్వం వెంటనే పంట కోత పరీక్షలు (crop cutting experiments) చేసి రైతులకు నష్ట పరిహారం యివ్వాలి. 2014 నుండి 2025 సెప్టెంబర్ వరకు రాష్ట్రం లో 56 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. కేంద్రం కార్పొరేట్ ల పక్షపాతి గా వారికి లాభాలు చేకూరే విధంగా ప్రధాని ఫసల్ భీమా పథకాన్ని అమలు చేస్తోంది. అందులోని లోపాలను ఎత్తి చూపుతూ అందులో నుండి బయటి కి వచ్చిన కెసిఆర్ ప్రభుత్వం పథకాన్ని నిలిపివేసింది. బయటికి వచ్చిన మిగిలిన రాష్ట్రాలు తమ స్వంత భీమా పథకాలను ప్రారంభించాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బిఆర్ఎస్ బాటలోనే పయనిస్తోంది, అన్నారు.

కేంద్ర ఇన్షూరెన్స్ పథకం రాష్ట్రాలకు తమ అవసరాలకు అనుగుణంగా నిబంధనలు మార్చుకునే అవకాశం యివ్వదు. రాష్ట్రాల మధ్యన పంటలు అవి ఎదుర్కునే సమస్యలు వేరుగా వుంటాయి. కొన్ని రాష్ట్రాలు రైతుల ప్రీమియం అవే చెల్లించి పథకాన్ని బ్యాంకు లోన్ లతో సంబంధం లేకుండా అందరికీ వర్తింప చేయాలంటే అందుకు దాని నియమాలు ఒప్పుకోవు. తమ రైతులు ప్రీమియం చెల్లించలేరని అవి భావించి వారికి సహాయం చేయాలని అనుకున్న సాధ్యం కాని పరిస్థితి, అని రాష్ట్రాలు పథకం నుండి వెలుపలికి రావటానికి కారణాలను రామ్ కుమార్ చెప్పారు.

22 లక్షల మంది కౌలు రైతులు రాష్ట్రం లో వున్నారని. 40 శాతం భూమి వారే సాగు చేస్తున్నారని. తాము అధికారం లోకి రాగానే వాళ్ళను పంట నష్టాలు జరిగినప్పుడు ఆదుకుంటామని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి వారికి హామీ యిస్తూ బహిరంగ లేఖ రాసిన విషయం యిక్కడ గుర్తు చేసుకోవడం సందర్భోచితమే. అయితే ఇంత వరకు అటువంటి ప్రయత్నం జరగక పోవడం కొసమెరుపు.

Tags:    

Similar News