
తిరుమల వేసవి రద్దీకి సిద్ధమవుతున్న టిటిడి
సామాన్య భక్తులకు వీలైనంత త్వరగా దర్శనం కల్పించేలా చర్యలు
వేసవి సెలవులు సమీపిస్తున్న వేళ తిరుమలలో భారీ రద్దీకి సిద్ధమైంది టీటీడీ. డేటా ఆధారిత ప్రణాళికతో భక్తులకు మరింత సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు వేగవంతమయ్యాయి. ముఖ్యంగా సామాన్య భక్తులకు వేచి ఉండే సమయం తగ్గించే దిశగా ప్రత్యేక దృష్టి సారించారు.
తిరుమలలోని పద్మావతి అతిథి గృహం సుధర్మ సమావేశ మందిరంలో శుక్రవారం సమీక్షా సమావేశం జరిగింది. టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్. వెంకయ్య చౌదరి అధికారులతో కలిసి వేసవి ఏర్పాట్లపై సమగ్రంగా చర్చించారు. గత రెండు నుంచి మూడు సంవత్సరాల వేసవి డేటాను విశ్లేషించినట్లు తెలిపారు. దర్శనాల సంఖ్య, వేచి ఉండే సమయం, తదుపరి రోజు దర్శనాల కోసం క్యూలైన్లలో నిలిచే భక్తుల వివరాలపై విస్తృతంగా సమీక్షించినట్లు వెల్లడించారు.
భక్తులకు మెరుగైన సౌకర్యాల కోసం అన్నప్రసాదం, తాగునీటి పంపిణీని విస్తరించనున్నట్లు చెప్పారు. నడక దారి భక్తుల కోసం మార్గమధ్యంలో షెడ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మాడ వీధులు సహా అవసరమైన ప్రాంతాల్లో కూల్ పెయింటింగ్ చేయనున్నారు. మజ్జిగ పంపిణీ కేంద్రాల సంఖ్యను పెంచి వేసవిలో దాహార్తిని తగ్గించే చర్యలు చేపడతామని పేర్కొన్నారు.
వేసవి సెలవుల్లో కుటుంబాలతో వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుందని అంచనా వేశారు. అందుకు అనుగుణంగా వసతి సదుపాయాలు, అన్నప్రసాదం నిర్వహణను సమర్థంగా అమలు చేయాలని నిర్ణయించారు. నడకదారి భక్తులు, అధిక రద్దీ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలను బలోపేతం చేయాలని సూచించారు.
సామాన్య భక్తుల దర్శనానికి ప్రాధాన్యత ఇస్తూ వేచి ఉండే సమయాన్ని తగ్గించడమే లక్ష్యమని తెలిపారు. ఈసారి ఇంటిగ్రేటెడ్ ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా టెక్నాలజీ వినియోగాన్ని పెంచనున్నట్లు చెప్పారు. గంటల వారీగా ఇన్–అవుట్ ఫ్లో, వేచి ఉండే సమయాన్ని ప్రతి నిమిషం పర్యవేక్షించి తక్షణ నిర్ణయాలు తీసుకుంటామని వివరించారు. వివిధ కేటగిరీల దర్శనాలను డేటా ఆధారంగా సమన్వయం చేసి క్యూలైన్లలో వేగవంతమైన ప్రవాహం కల్పించనున్నట్లు తెలిపారు.
గత వేసవిలో జూన్ నెలలో రోజుకు సగటున 80 నుంచి 82 వేల మందికి దర్శనం కల్పించామని గుర్తు చేశారు. 2026 జనవరిలో రోజుకు 74 వేల మందికి పైగా దర్శనం అందించామని చెప్పారు. సమర్థవంతమైన టైమ్ మేనేజ్‌మెంట్, విభాగాల సమన్వయం వల్లే ఇది సాధ్యమైందని వివరించారు.
వేసవిలో భక్తులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన దర్శనం కల్పించడమే లక్ష్యంగా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తాయని అదనపు ఈవో స్పష్టం చేశారు.

