మాంసప్రియుల తెలంగాణలో కూరగాయలు ఉత్పత్తి సర్కార్  కు ఒక సవాల్
x

మాంసప్రియుల తెలంగాణలో కూరగాయలు ఉత్పత్తి సర్కార్ కు ఒక సవాల్

పట్టణీకరణ తదితర కారణాలతో గతంలో మూడు లక్షల ఎకరాల్లో పండిన కూరగాయలు లక్ష ఎకరాలకు పడిపోయింది


తెలంగాణ ఎదుర్కొంటున్న 50 శాతం కూరగాయల కొరతను తీర్చటానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ దిశగా ప్రయత్నాల్లో భాగంగా వచ్చే ఏడాదికి ప్రస్తుత లక్ష ఎకరాల నుండి వాటి సాగును రెండు లక్షల ఎకరాలకు పెంచటానికి ప్రణాళికలు రచిస్తోంది.

ఈ లక్ష్యానికి అనుగుణంగా ఒక సమగ్ర ప్రణాళిక తయారు చేస్తున్నట్టు తెలంగాణ వ్యవసాయ కార్యదర్శి కే. సురేంద్ర మోహన్ చెప్పారు. ఆయన హైదరాబాదులోని రాజేంద్రనగర్ లో శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వేదికగా జరుగుతున్న కూరగాయల పంటలపై అఖిలభారత సమన్వయ పథకం 44వ వార్షిక సమావేశ కార్యక్రమం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో మౌలికంగా మాంసాహార రాష్ట్రం. ఇక్కడ ప్రజలు సగటున మాంసం దేశంలో అందరికంటే ఎక్కువ మాంసం తింటారు. రాష్ట్రంలో 98 నుంచి 99 శాతం మాంసాహారులున్నారు. ఇందులో 48 శాతం కోడి మాంసం తింటారు. మటన్ ని తెలంగాణ ప్రజలకు చాలా ఇష్టమయినది. తెలంగాణలో తలసరి ఏడాది కి 24 కెేజీ మాంసం భుజిస్తారు. ఇది జాతీయ సగటు(7 కేజీలు) కంటే మూడు రెట్లు ఎక్కువ. తెలంగాణా ఒక వైపు మాంసాహారం పెరిగితే మరొక వైపు కూరగాయల పంట విస్తీర్ణం బాగా తగ్గిపోయింది. రాష్ట్రంలో కూరగాయల పంట విస్తీర్ణం పెంచేడం ప్రభుత్వానికి ఒక సవాల్. ఈ నేపథ్యంలో ఈ రోజు దేశంలోని కూరగాయల శాస్త్రవేత్తలు హైదరాబాద్ లో మూడు రోజుల పాటు సమావేశమయి కూరగాయల ఉత్పత్తి పెంచే వ్యూహాల గురించి చర్చిస్తున్నారు. ఈ సభలొో సురేంద్రమోహన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

“ఇందులో భాగంగా 908 కి పైగా ఉన్న ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ఆధ్వర్యంలో ఎనిమిది వందలకు పైగా ఉత్తమ కూరగాయల సాగు వాలంటీర్లుగా రైతులను తీర్చిదిద్ది, వారిచేత ఇతరులకు శిక్షణ ఇస్తాం. రాష్ట్రంలో ఉన్న వెయ్యి ఎఫ్‌పీవో (రైతు ఉత్పత్తిదారుల సంస్థ) లను ఈ ప్రయత్నంలో భాగం చేస్తాం. ఈ సదస్సులో భాగం అయిన సైంటిస్టులను సలహాలు కోరాం. చర్చల్లో వచ్చిన సలహాలను పొందుపరుస్తాం. రాష్ట్రంలో రైతుల ఆదాయం రెండింతలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది వారికి మార్కెటింగ్ వ్యవస్థను తీసుకోస్తాం. కూరగాయల ఉత్పాదకతను పెంచడానికి దేశవ్యాప్తంగా ఉన్న ఉత్తమ పద్ధతులను రైతులకు పరిచయం చేస్తాం,” అని చెప్పారు.

2047 నాటికి వికసిత్ భారత్ లో భాగంగా గ్లోబల్ సమ్మిట్ లో 12 ఫోకస్ ఏరియాల తో ఉద్యాన రంగాన్ని రాష్ట్రంలో బలోపేతం చేసేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నామని, రాష్ట్ర జిడిపి మూడు ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడానికి రైతుల పాత్ర ముఖ్యమని, అలాగే సమతుల్య ఎరువుల వాడకంతో నేలల్లో కర్బన శాతం పెంచుకోవాలి. ప్రస్తుతం 0.3 శాతం కర్బనం ఉందని వ్యవసాయ కార్యదర్శి సురేంద్రమోహన్ అన్నారు.

సైంటిస్టుల అభిప్రాయం:

రాష్ట్రంలో కూరగాయల సాగు కనీసం 2.47 లక్షల ఎకరాలకు పెంచాల్సిన అవసరం ఉందని ఉద్యాన వర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ దండి రాజిరెడ్డి అన్నారు. “గతంలో మూడు లక్షల ఎకరాల్లో ఉన్న కూరగాయల సాగు లక్ష ఎకరాలకు పడిపోయిందని, వెంటనే మరో రెండింతల మేర ఈ విస్తీర్ణం పెరగాలి. ఇందుకు అందుబాటులో ఉన్న ఉత్తమ టెక్నాలజీలను మనం వాడుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఉద్యాన పంటలు 12 లక్షల ఎకరాల్లో ఉంటే కూరగాయలు లక్ష ఎకరాల్లో మాత్రమే పండుతున్నాయి. కూరగాయల నిల్వ కాలం తక్కువ కాబట్టి వాటికి మార్కెటింగ్ సౌకర్యం కోసం చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. పంట కోత అనంతర నష్టాలను 30 శాతం ఉన్నాయి. దీన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. అందుకు అవసరమైన పరిశోధనలు చేస్తున్నాం,” అని చెప్పారు.

రైతులు కూరగాయల నుంచి దూరంకావటానికి కారణాలను వివరిస్తూ, “హైదరాబాద్ చుట్టూ పక్కల భూములు రియల్ ఎస్టేట్ గా మారటంతో పాటు సాగుకు నీటి సౌకర్యం పెరగటం కూడా ప్రధాన కారణమే. గతంలో 30 నుండి 40 లక్షల ఎకరాల్లో పండిన వరి నేడు కోటి ఎకరాలకు చేరుకుంది. రాష్ట్రంలో 10 ఏళ్ల నుంచి పడుతున్న మంచి వర్షాల వలన కరువు లేకపోవటంతో రైతులు వడ్ల సాగువైపు మళ్ళారు,” అని చెప్పారు.

జాతీయ రహదారుల పక్కన మార్కెట్ లను తెరవాలని, ధాన్యం అమ్మే మార్కెట్లలోనూ కూరగాయల అమ్మకానికి అవకాశం కలిపించాలని రైతులు కోరినట్టు రాజి రెడ్డి చెప్పారు. ఆయిల్ పామ్ పంటలోనూ అంతర పంటగా వీటిని పెంచమని ప్రోత్సాహిస్తున్నాం. కాన్ఫరెన్స్ ఆఖరు రోజున రైతులకు డ్రిప్, పిచకారి చేసే పరికరాలను ప్రదర్శిస్తాo. మిద్దె సేద్యం, హైడ్రో పోనిక్స్ పద్దతిలో కూరగాయల పెంపకాన్ని చేపట్టచ్చు అని చెప్తూ రాష్ట్రం లో కోతుల బెడదను ఎదుర్కోవటానికి సోలార్ ఫెన్సింగ్ ఒక పరిష్కారం అని అభిప్రాయపడ్డారు.

2047 విజన్ డాక్యుమెంట్ లో చెప్పినట్టు సేంద్రీయ వ్యవసాయానికి పెద్దపేట వేస్తామని అందులో భాగంగా 61,000 ఎకరాల్లో అరవై ఒక్క వేల మంది రైతులను భాగం చేస్తున్నాం. వాళ్ళకు రు. 4,000 ప్రోత్సాహకం ఇస్తాం, అని సురేంద్ర మోహన్ చెప్పారు.

సదస్సులో మాట్లాడిన భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సుధాకర్ పాండే దేశంలో ఉద్యాన రంగం ప్రాముఖ్యత పెరగడం శుభదాయకమని, ఉద్యాన పంటల విలువ సాలిన 7.6 లక్షల కోట్లు ఉందని అన్నారు. గత 12 సంవత్సరాల్లో ఉద్యాన పంటల విస్తీర్ణం రెండింతలు అయిందని, 2047 నాటికి 747 బిలియన్ డాలర్ల విలువతో ఈ రంగం ఉంటుందన్నారు. దేశంలో 13 శాతం సాగు విస్తీర్ణంలో 36.9 కోట్ల టన్నుల ఉత్పత్తి సాధ్యమవుతుందన్నారు. 2047 నాటికి 59.9 కోట్ల టన్నుల ఉత్పత్తి అవసరం ఉందని తెలిపారు, ధాన్యాల ఉత్పత్తి వినియోగం నెలకు 11 కిలోల నుండి 9 కిలోలకు తగ్గిందని, అదే విధంగా ఉద్యాన ఉత్పత్తుల వినియోగం ఐదు కిలోల నుండి 9.7 కిలోలకి పెరిగిందని ఆయన పేర్కొన్నారు.

“స్పీడ్ బ్రీడింగ్, స్పీడ్ జీనోమిక్స్, జీనోమ్ ఎడిటింగ్ వంటి ఆధునిక సాంకేతికతలను కూరగాయల అభివృద్ధికి వాడుకోవాలి. ఏడాదికి 5700 కోట్ల రూపాయలు విలువైన పంటకోత అనంతరం ఉద్యాన ఉత్పత్తుల నష్టం జరుగుతొంది. భవిష్యత్తులో పర్యావరణ మార్పులకు తట్టుకునే, ఎగుమతికి అనువైన, పలు చీడపీడలు తట్టుకునే, మేలైన నీటి వాడకం, అధిక పోషకాలు కలిగిన కూరగాయల రకాల అభివృద్ధికి పరిశోధనలను ముమ్మరం చేయాలి. విత్తన ఉత్పత్తిలో మేలైన సాంకేతిక పద్ధతులు ఇప్పటికే అభివృద్ధి చేశాం,” అని సుధాకర్ పాండే చెప్పారు.

సాగునీటి సౌకర్యం పెరగటం వలన వాణిజ్య పంటలైన మిరప, పత్తి, వరి పంట వైపు మళ్ళిన రైతులకు ఎరువులు, విత్తనాలు ఇచ్చి డ్రిప్ ఇరిగేషన్ పథకాలను అమలు చేసి కూరగాయల సాగు వైపు మళ్లించవచ్చని ఉద్యాన వర్సిటీలో డీన్ డా. జె. చీమ నాయక్ చెప్పారు. “కాలానికి అనుగుణంగా వాతావరణ పరిస్థితులను తట్టుకునే రకాలను ఎంచుకోవాలి. అలాగే భూసారం తగ్గిపోకుండా పశువుల రొట్టె, పిల్లి పెసర వంటి ఎరువులను ఎప్పటికప్పుడు వినియోగించాలి. హైదరాబాద్ తో పాటు వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ లాంటి ప్రాంతాల చుట్టూ కూరగాయల పెంపకం పెంచాలి. తెలంగాణ లో ఎక్కువ మంది చిన్న సన్నకారు రైతులు కూరగాయల వైపు మొగ్గు చూపటం లేదు. వీటికి రోజువారీగా సంరక్షణ చర్యలు చేపట్టి కోసి మార్కెట్ లో అమ్ముకోవాలి. అదే రైతు వరి పండిస్తే కూలీకి పోయి అదనంగా సంపాదించుకోవచ్చు,” అని చీమ వివరించారు.

ప్రతి మార్కెట్లో కోల్డ్ స్టోరేజ్ లను ఏర్పాటు చేస్తే కూరగాయల రైతులకు ఉపయోగపడతాయని ఆయన సూచించారు.

దేశంలోని 60 పరిశోధన స్థానాలు కూరగాయలపై ముమ్మర పరిశోధనలను చేపడుతున్నాయని భారతీయ కూరగాయల పరిశోధన సంస్థ డైరెక్టర్ డాక్టర్ రాజేష్ కుమార్ అన్నారు. ఇప్పటికే ఐదు దశకాలలో 640 నూతన కూరగాయల రకాలు అభివృద్ధి చేశామని, వైరస్ ను తట్టుకునే రకాలు, అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ రకాలపై పరిశోధనలపై దృష్టి సారిస్తున్నామన్నారు.

పబ్లికేషన్స్ విడుదల:

2025 కు ఉత్తమ అఖిల భారత సమన్వయ పరిశోధన ప్రాజెక్ట్ (AICRP) కేంద్రంగా MPKV, రాహురి కి అందింది. ఈ సందర్భంగా అఖిల భారత సమన్వయ పరిశోధన ప్రాజెక్ట్ వార్షిక నివేదిక, ఉద్యానవర్సిటీ వార్షిక నివేదిక, బెండ, బీరలో డ్రోన్ పరిశోధనపై రచనలను ఈ సందర్భంగా విడుదల చేశారు.

కార్యక్రమంలో బెంగళూరులోని ఐ హెచ్ ఆర్ డైరెక్టర్ డాక్టర్ టికె బెహరా, నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ (NBPGR) డైరెక్టర్ డాక్టర్ జిపి సింగ్, మాజీ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ లవoడి, ఎన్ఐఆర్సిఏ రాజమండ్రి డైరెక్టర్ డాక్టర్ శేషు మాధవ్, పరిశోధన సంచాలకులు లక్ష్మీనారాయణ, లోకల్ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ అనిత కుమారి, డాక్టర్ చీనా, డాక్టర్ పి ప్రశాంత్, దేశవ్యాప్తంగా కూరగాయల్లో పరిశోధన చేస్తున్న 300 మంది శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

Read More
Next Story