
జీవన్ రెడ్డికి జగ్గారెడ్డి సపోర్ట్.. హైకమాండ్‌కు కీలక డిమాండ్
తెలంగాణ కాంగ్రెస్‌లో కొంతకాలంగా జగిత్యాల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వివాదం కొనసాగుతోంది. అవకాశం దొరికిన ప్రతిసారి పార్టీ వైఖరిపై జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశం పార్టీ హైకమాండ్ వరకు చేరింది. ఢిల్లీ నుంచి జీవన్ రెడ్డికి ఫోన్ కూడా వచ్చింది. అయితే తాజాగా జీవన్ రెడ్డి వివాదం కీలక మలుపు తీసుకుంది. ఈ వివాదంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి జోక్యం చేసుకున్నారు. జీవన్ రెడ్డికి మద్దతుగా మాట్లాడారు. జీవన్ రెడ్డికి అవమానం కలిగే నిర్ణయాలు తీసుకోవద్దని హైకమాండ్‌ను కోరారు. కాంగ్రెస్ కష్టకాలంలో కూడా జీవన్ రెడ్డి పార్టీతోనే ఉన్నారని, అలాంటి నేతకు గరవం దక్కేలా చర్యలు తీసుకోవాలని జగ్గారెడ్డి పార్టీ హైకమాండ్‌ను డిమాండ్ చేశారు.
‘‘పార్టీ కార్యకర్తగా, నాయకుడిగా జీవన్ రెడ్డి విషయంలో నాకున్న అభిప్రాయాన్ని పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్‌కు తెలియజేస్తున్నాను. జీవన్ రెడ్డికి ఎంపీ, ఎమ్మెల్యే టికెట్‌లు ఇచ్చారు. కానీ పరిస్థితులు అనుకూలించక ఆయన ఓటమిపాలయ్యారు. రాష్ట్రంలో పది సంవత్సరాల పాటు కాంగ్రెస్ ప్రతిపక్షంలోనే ఉంది. ఆ సమయంలో కూడా ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా జీవన్.. పార్టీతోనే ఉన్నారు’’ అని గుర్తు చేశారు. రాజకీయంగా ఎన్ని అవకాశాలు వచ్చినా ఆయన పార్టీతోనే ఉన్నారని, అలాంటి వ్యక్తికి అగౌరవం జరగకుండా పార్టీ చొరవ తీసుకోవాలని ఆయన కోరారు.
జీవన్ రెడ్డికి అస్వస్థత..
పార్టీలో తన వ్యవహారం కీలకంగా మారుతున్న సమయంలోనే జీవన్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. గురువారం రాత్రి నుంచి వాంతులు, విరేచనాలు అవుతుండటంతో ఆయనను కుటుంబ సభ్యులు కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షలు చేసిన వైద్యులు.. ఫుడ్ పాయిజన్ అయినట్లు గుర్తించారు. ఆయనకు వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో జీవన్ రెడ్డి అస్వస్థతకు గురికావడంతో కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జీవన్ రెడ్డి ఆరోగ్యం అంతా బాగానే ఉందని కుటుంబ సభ్యులు తెలియజేశారు. సమయానికి ఆహారం తీసుకోకపోవడం, వాతావరణ పరిస్థితుల కారణంగానే ఆయన అనారోగ్యానికి గురయ్యారని, సీరియస్ ఏమీ లేదని వివరించారు.

