ఫుల్ కామెడీ.. ‘గురువాయుర్‌ అంబలనాదయిల్‌’ ఓటీటి మూవీ రివ్యూ

ప్రస్తుతం ఓటీటీ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటున్న సినిమా గురువాయుర్‌ అంబలనాదయిల్‌. ఈ సినిమాలో ప్రేక్షకులకు అంతగా నచ్చిన విషయం ఏమిటో చూద్దాం.

Update: 2024-07-01 04:46 GMT

ఓటీటీలలో మలయాళ డబ్బింగ్ సినిమాల ట్రెండ్ కంటిన్యూ అవుతూనే ఉంది. మిగతా భాషల సినిమాల కన్నా ఇవే ఎక్కువ జనాదరణ పొందుతున్నాయి. దానికి తోడు మలయాళ సినీ ఇండస్ట్రీకి 2024 ఇప్పటి వరకు సూపర్‌గా కలిసి వచ్చింది. చాలా చిన్న సినిమాకు అక్కడ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. కొన్ని సినిమాలు రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టాయి. ఏ పరిశ్రమలోనూ లేని విధంగా సక్సెస్ రేట్ ఎక్కువగా నమోదైంది. మంజుమ్మల్ బాయ్స్ రూ.200 కోట్ల కలెక్షన్లను దాటిన తొలి మలయాళ మూవీగా ఘనత సాధించింది. ప్రేమలు, ఆవేశం సహా మరిన్ని చిత్రాలు సూపర్ హిట్స్ అయ్యాయి. అదే క్రమంలో తాజాగా ‘గురువాయుర్‌ అంబలనాదయిల్‌’అనే చిత్రం కూడా సూపర్ హిట్ అయ్యింది.

ఈ సంవత్సరం మే 16న కేరళలో విడుదలైన ‘గురువాయుర్‌ అంబలనాదయిల్‌’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా రూ.90 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు ఈ సినిమా ఓటిటిలో రిలీజైంది. ఈ వారం నుంచే ఓటీటీ వేదిక డిస్నీ+హాట్‌స్టార్‌‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. మలయాళంతో పాటు, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా కథలో జనాలకు అంతగా నచ్చిన విషయాలు ఏమిటో చూద్దాం.

స్టోరీ లైన్

బ్రేకప్ అయిన బాధలో ఉన్న విను రామచంద్రన్‌ (బసిల్‌ జోసెఫ్‌) కి పెళ్లి సెట్ చేస్తాడు ప్రెండ్, గైడ్, ఫిలాసఫర్ ఇలా అన్ని అయిన ఆనంద్ (పృథ్వీరాజ్ సుకుమారన్). అమ్మాయి మోసం చేసిందని బాధలో ఉన్నాడని దాని నుంచి బయిటపడేయటానికి తన చెల్లి అంజలిని ఇచ్చి పెళ్లి చేయాలని పెద్దలను ఒప్పిస్తాడు. దాంతో విను ...ఆనంద్‌ని దేవుడులా చూస్తూంటాడు. ఈ క్రమంలో ఆనంద్‌కు ఏదైనా చేయాలని విను అనుకుంటాడు. ఆనంద్ కూడా బాధలో ఉన్నాడు. అదేమిటంటే అతనికి భార్య పార్వతి (నిఖిలా విమల్‌) మీద అనుమానం. పెళ్లికి ముందు ఆమెకో లవర్ ఉన్నాడని తెలిసిన నాటి నుంచి ఆమెను భరించలేక దూరం పెడితే ఆమె పుట్టింటికి కొడుకుని తీసుకుని వెళ్లిపోతుంది.

తనకు పెళ్లి సెట్ చేసి లైఫ్ సెట్ చేస్తున్న ఆనంద్ ఫ్యామిలీ లైఫ్ సెట్ చేయాలనుకుంటాడు విను. అందుకోసం ప్రయత్నాలు మొదలెడతాడు. ఆనంద్‌ని ఒప్పించి తన పెళ్లికి భార్యను తీసుకుతెచ్చుకునేలా చేస్తాడు. పార్వతి కూడా నిండు మనస్సుతో క్షమించి ఆనంద్ దగ్గరకు వస్తుంది. ఆ జంటను చూడటానికి వస్తాడు విను. అయితే అక్కడే అతను షాక్ అవుతాడు. ఆనంద్ భార్య మరెవరో కాదు.. ఒకప్పుడు తనతో ఐదేళ్లు ప్రేమలో ఉండి బ్రేకప్ చేసుకుని వెళ్లిపోయిన పార్వతే. ఈ షాక్ నుంచి కోలుకున్న విను..ఇంక తన పెళ్లి ఎలాగైనా ఆపేయాలనుకుంటాడు. ఆనంద్‌కు ఈ విషయం తెలియనివ్వకూడదనుకుంటాడు. అయితే మరికొద్ది రోజుల్లో పెళ్లి అనుకుంటే అప్పటికప్పుడు ఆపటం సాధ్యమవుతుందా... ఆ క్రమంలో విను చేసే ప్రయత్నాలు ఏమిటి...ఆనంద్‌కు అసలు విషయం తెలిసిందా.. అతను ఎలా రియాక్ట్ అయ్యాడు. చివరకు ఈ కథ ఏ తీరం చేరిందనేది తెలియాలంటే ఈ ఫన్ ఎంటర్టైనర్ చూడాలి.

విశ్లేషణ

ఈ సినిమా కథను పూర్తి స్థాయి కామెడీగా డీల్ చేశారు. ప్రతీ సీన్ నవ్వుకునేలా, ప్రతీ డైలాగు ఎంజాయ్ చేసేలా రాసుకున్నారు. సినిమా ప్రారంభం పదినిముషాలు సాదాగా వెళ్లిపోయినా ఆ తర్వాత కథలో అసలు విషయం రివీల్ అయ్యాక ఫన్ ప్రారంభం అవుతుంది. అక్కడ నుంచి రకరకాల క్యారక్టర్స్, టెన్షన్, పెళ్లి నేపథ్యం సినిమాకు నిండుతనం తెచ్చాయి. అక్కడక్కాడా లాజిక్ లేకుండా కథ వెళ్తున్నట్లు అనిపించినా నవ్వుల్లో అది కొట్టుకుపోతుంది. కథ సింగిల్ థ్రెడ్ మీద నడిచినా ట్విస్ట్‌లు పెట్టి ఇబ్బంది అనిపించకుండా చేశారు. ప్రియదర్శన్ నాటి కామెడీలు గుర్తు వస్తాయి. తెలుగులో అయితే ఇవివి స్టైల్ కామెడీ అని చెప్పవచ్చు. కథ డ్రాప్ అవుతోంది అనగానే యోగిబాబు లాంటి పాత్రను తీసుకొచ్చి పరుగెట్టించారు. క్లైమాక్స్ కూడా హంగామాగానే చేశారు.

టెక్నికల్‌గా ఈ సినిమా స్క్రిప్టు రైటర్స్ సినిమా. మ్యూజిక్ డైరక్టర్ పాత కాలం సూపర్ హిట్ పాటలను తీసుకొచ్చి అవకాశం వచ్చినప్పుడు కలపడం కూడా బాగా ప్లస్ అయ్యింది. ఎడిటింగ్, కెమెరా వర్క్ బాగున్నాయి. తెలుగు డబ్బింగ్ మాత్రం గొప్పగా లేదు. నామ మాత్రంగా చేసుకుంటూ పోయారు.

చూడచ్చా

ప్యామిలీతో కూర్చుని ఎక్కడా అసభ్యత, హింస లేని ఈ కామెడీ ఎంటర్టైనర్‌ని ఎంజాయ్ చేయచ్చు.

ఎక్కడ చూడచ్చు

డిస్నీ+హాట్‌స్టార్‌ ఓటీటిలో తెలుగులో ఉంది.

Tags:    

Similar News