ఓటీటీకే సవాల్ విసిరిన అమీర్ ఖాన్, షాక్ లో ఇండస్ట్రీ

షాక్ లో ఇండస్ట్రీ;

Update: 2025-05-08 08:30 GMT

"మనం స్పష్టంగా చెప్తున్నాము — థియేటర్‌ కు రావటం ఎందుకు, ఇంకొన్ని రోజులు ఆగు, ఇంట్లోనే వస్తుంది చూడు అని,ఇంకెవరు థియేటర్ కు వచ్చి సినిమా చూస్తారు? !"- అమీర్ ఖాన్

ఇది ఒక నటుడి గళం కాదు.

ఇది భారతీయ సినిమా భవితవ్యంపై వ్యక్తమవుతున్న గాఢమైన ఆవేదన.

తన సినిమాలతో దేశాన్ని ఏడిపించిన, నవ్వించిన, ఆలోచింపజేసిన నటుడు ఆమిర్‌ ఖాన్, ఇప్పుడు ఓ కీలక ప్రశ్నను లేవనెత్తారు.

ఒకప్పుడు థియేటర్లు సినిమాల పండుగలా ఉండేవి. కానీ ఇప్పుడు?

సినిమా విడుదలైన నాలుగు వారాల్లోనే ఓటీటీలో ప్రత్యక్షమవుతోంది. ప్రేక్షకుడు ఇక ఎందుకు వెళ్తాడు థియేటర్‌కు?

ఇది వాదన మాత్రమే కాదు.

ఓటీటీ వ్యాపార విధానాలపై మిస్టర్‌ పర్ఫెక్ట్‌ తిరుగుబాటు

‘వేవ్స్‌’ (Waves)లోని ‘ఇండియన్‌ సినిమా, ఓరియంటల్‌ లుక్‌’ టాపిక్‌పై మాట్లాడుతూ.. ఓటీటీపై అభిప్రాయం వ్యక్తం చేశారు. ముఖ్యంగా సినిమా విడుదల అయిన నాలుగు నుంచి ఎనిమిది వారాలకే ఓటీటీలకు అమ్మేసే ట్రెండ్‌పై తీవ్రంగా విమర్శించారు.

"ఒకప్పుడు సినిమా టీవీలో ప్రసారం కావాలంటే ఆరేడు నెలలు వేచి చూడాలి. కానీ ఇప్పుడు? ఎనిమిది వారాల్లోనే ఓటీటీలో చూసేస్తున్నారు. ఇది థియేటర్‌ అనుభవాన్ని పూర్తిగా తుడిచిపెడుతోంది" అని ఆమీర్‌ తెలిపారు.

ఓటీటీ డీల్స్‌: తక్షణ లాభాల కోసం దీర్ఘకాల నష్టాలు

"నేను మీకు ఒక వస్తువు అమ్మే సమయంలో చెబుతున్నాను — ఇప్పుడు కొనకపోతే ఎనిమిదో వారం నాడు అదే వస్తువును మీ ఇంట్లో ఉచితంగా ఇచ్చేస్తాను, అని , మీరు దాన్ని కొనుకుంటారా?" అని ప్రశ్నించి, OTT వ్యాపార మోడల్‌ ని ఆయన విమర్శించారు.

అలాగే "మనదేశ జనాభాలో కేవలం రెండు శాతం మాత్రమే థియేటర్లలో సినిమాలు చూస్తున్నారు. US‌లో 40 వేలు, చైనాలో 90 వేల స్క్రీన్లు ఉన్నాయి. మనకు కేవలం పదివేలు మాత్రమే. ఇది సిగ్గుచేటు. మనం స్క్రీన్ పెంచాలి, మార్కెట్ వృద్ధి చేయాలి, కానీ వ్యాపార దృష్టికోణంతో తక్షణంగా డబ్బు రావాలని చూస్తే నాశనం తప్పదు."" అన్నారు.

ఇది కేవలం అభిప్రాయం మాత్రమే కాదు. ఇది భారతీయ సినిమా నిర్మాణ విధానంపై, థియేటర్‌ మార్కెట్‌పై తీవ్రమైన వ్యాఖ్య.

"సితారే జమీన్‌పర్" కోసం ఓ కొత్త డిజిటల్ మార్గం

ఈ ఆలోచనలతో పాటే, ఆమిర్‌ ఖాన్‌ తన కొత్త సినిమా విషయంలో ఓ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. "సితారే జమీన్‌పర్" అనే భావోద్వేగ చిత్రాన్ని జూన్‌ 20న థియేటర్లలో విడుదల చేయనున్నారు. అయితే దీని డిజిటల్‌ హక్కులు ఏ ఓటీటీకి అమ్మకూడదనే నిర్ణయం తీసుకున్నారు.

అందుకు బదులు ఆయన యూట్యూబ్‌లో Pay-per-view మోడల్ ద్వారా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అంటే… ప్రేక్షకులు సినిమాను ఇంట్లో చూడాలంటే చెల్లించాల్సిందే! కానీ ఫ్రీగా ఓటీటీ మాదిరిగా కాదు.

"యూట్యూబ్‌ ద్వారా సినిమా రిలీజ్ చేస్తే... థియేటర్‌ ప్రాముఖ్యతను నిలబెట్టుకుంటూ, ఆ తర్వాతి వ్యాపార అవకాశాలను కోల్పోకుండా ఉంటాం. ఇది రెండు వైపులా ఫలితాన్ని ఇచ్చే మార్గం" అని చెప్పారు.

ఈ మోడల్ సక్సెస్ అవ్వాలంటే ఒకటే దారి

అమీర్ ఖాన్ తీసుకున్న ఈ నిర్ణయం ఒకవేళ విజయవంతం అయితే, అది భారతీయ సినిమా పరిశ్రమలో ఒక మార్పు తీసుకొస్తుంది. అయితే ఇక్కడే ఓ కీలకమైన ప్రశ్న... ప్రజలు ఓటిటీలలో కాకుండా, డబ్బులు ఖర్చు పెట్టి యూట్యూబ్ ద్వారా సినిమాలను చూడటానికి సిద్ధమవుతారా?

సూపర్ హిట్ అయిన సినిమాలు మాత్రమే ప్రేక్షకులను థియేటర్లకు, అలాగే డిజిటల్ వేదికలపై చూసేలా ఉత్సాహపరుస్తాయి. ముఖ్యంగా ఆ సినిమా పైరసీలో అందుబాటులో ఉండకపోతేనే. అమీర్ ఖాన్ ముందు ఉన్నది పెద్ద సవాలే. ఓటిటి ఆదాయం పోతుందని రిస్క్ చేసినా, పైరసీని అరికట్టకపోతే మొత్తం నిష్పలమే.

Tags:    

Similar News