కన్నడ నటుడు దర్శన్ సినిమాలకు దూరమయ్యారా?

కన్నడ నటుడు దర్శన్ (Darshan) తన పుట్టిన రోజుకు అభిమానులను ఏం కోరారు? ఎక్స్ (ట్విట్టర్) పోస్టులో ఆయన ఏం రాశారు?;

Update: 2025-02-09 09:59 GMT

జైలు నుంచి విడుదలైన తర్వాత క్లిష్ట సమయంలో తనను ఆదరించి, మద్దతిచ్చిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు నటుడు దర్శన్. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఇలా స్పందించారు.

"నాపై మీకున్న ప్రేమాభిమానానికి నా ధన్యవాదాలు. మీకు నమస్కారం పెట్టినా లేక థాంక్స్ చెప్పినా తక్కువే! మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు," అని పోస్ట్ చేశారు.

ఎందుకు దర్శన్ జైలుకెళ్లారు?

దర్శన్ అభిమాని అయిన 33 ఏళ్ల రేణుకాస్వామి (Renukaswamy) నటి పవిత్ర గౌడ(Pavithra Gowda)కు అనుచిత సందేశాలు పంపించాడని దర్శన్ ఆగ్రహానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో 2024 జూన్ 8న అతనిని చిత్రదుర్గ నుంచి బెంగళూరుకు రప్పించి.. ఒక షెడ్లో తీవ్రంగా హింసించి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. జూన్ 9న బెంగళూరులోని సుమనహళ్లి వద్ద ఉన్న ఓ డ్రైనేజీ వద్ద రేణుకాస్వామి మృతదేహం కనిపించింది. పోస్ట్‌మార్టం నివేదిక ప్రకారం.. రేణుకా స్వామికి కరెంట్ షాక్ ఇవ్వడం వల్ల రక్తస్రావంతో మరణించినట్టు తేలింది. హత్య కేసులో నిందితులుగా ఉన్న దర్శన్ (47), ఆయన స్నేహితురాలు, నటి పవిత్ర గౌడ సహా మొత్తం 17 మంది గతేడాది బెయిల్‌పై విడుదలయ్యారు.


మిమ్మల్ని కలవలేకపోతున్నందుకు బాధపడుతున్నా..

వైద్య కారణాలతో మధ్యంతర బెయిల్‌పై విడుదలయిన దర్శన్‌.. తన ఆరోగ్య పరిస్థితిని అభిమానులతో పంచుకున్నారు. ఫిబ్రవరి 16న తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు తన ఇంటి వద్ద గుమికూడవద్దని కోరారు.

"ఇప్పటివరకు ఏటా మీ అందరిని కలవాలని కోరుకునేవాణ్ణి. కానీ ఈసారి నా ఆరోగ్య అందుకు సహకరించడం లేదు. నా వెన్నెముక సమస్య మీకు తెలిసిందే. ఎక్కువసేపు నిలబడలేను. ఇంజెక్షన్ తీసుకుంటే 15-20 రోజులు బాగుంటాను. దాని ప్రభావం తగ్గిన తర్వాత మళ్లీ నొప్పి ప్రారంభమవుతుంది. ఓపరేషన్ చేయించుకోవాల్సి వస్తుంది. త్వరలో మీ అందరిని కలుస్తాను," అని తెలిపారు.

సినిమాల గురించి ..

సినిమాలలో నటించడంపై కూడా క్లారిటీ ఇచ్చారు దర్శన్. ఆయన మాటలకు బట్టి ఇప్పట్లో ఆయన చిత్రాలు లేనట్టే. "నా కోసం వేచి చూసిన నిర్మాతలకు కృతజ్ఞతలు. వాళ్లు ఇతర ప్రాజెక్టులు ప్లాన్ చేసుకుని ఉంటారు. నిర్మాత సూరప్ప బాబు నాకు ఇచ్చిన అడ్వాన్స్‌ను తిరిగి చెల్లించాను," అని తెలిపారు.

Tags:    

Similar News