అల్లరి నరేశ్ ‘12ఏ రైల్వే కాలనీ’ రివ్యూ
ఘోస్ట్ థ్రిల్లరా?...టైమ్ కిల్లరా?
అనాధ అయిన కార్తిక్ (నరేశ్) వరంగల్‌లోని రైల్వే కాలనీలో తన స్నేహితులతో (హర్ష, గెటప్ శ్రీను, సద్దాం) కలిసి ఉంటాడు. ఈ బ్యాచ్ అంతా లోకల్ పొలిటిషన్ వరంగల్ టిల్లు (జీవన్ కుమార్) దగ్గర పని చేస్తుంటారు. కార్తిక్ అంటే వరంగల్ టిల్లుకి బాగా నమ్మకం. ఇంపార్టెంట్ పనులు అతనికే అప్పచెప్తూంటాడు.
ఇక టిల్లు పొలిటికల్ లైఫ్ ఏ మాత్రం గొప్పగా ఉండదు. రెండు సార్లు ఎమ్మల్యేగా ఓడిపోయి... ఈ సారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలగా ఉంటాడు. అందుకు కార్తీక్ కూడా కృషి చేస్తూంటాడు. ఈ క్రమంలో కార్తిక్ కు ప్రక్కింటి ఆరాధన(కామాక్షి భాస్కర్ల)తో పరిచయం అయ్యి ప్రేమగా మారుతుంది. ఆమె ప్రేమను గెలవటం కోసం రకరకాల పనులు చేస్తూంటాడు కార్తీక్. బాడ్మింటన్ ప్లేయర్ అయిన ఆమెకు ఇంటర్నేషనల్ టోర్నీకి వెళ్ళేందుకు డబ్బులు అవసరం పడ్డాయని తెలిసి ఆ మొత్తం సమకూర్చాలని కార్తీక్ ప్రయత్నిస్తుంటాడు.
ఇదిలా ఉండగా ఓ రోజు వరంగల్ టిల్లు ...కార్తీక్ కు ఓ కవర్ ఇచ్చి ఎక్కడైనా దాన్ని సీక్రెట్ గా దాచమని చెప్తాడు. దాంతో ఎక్కడ దాచాలో అని ఆలోచిస్తూ ఉండగా...రెండు మూడు రోజులుగా తాళం వేసి ఉన్న తను ఇష్టపడుతున్న ఆరాధన ఇల్లు గుర్తు వస్తుంది. దాంతో అక్కడికి ఆ కవర్ పట్టుకుని వెళ్తాడు. అయితే అక్కడో ఊహించని సంఘటన ఎదురౌతుంది. ఆరాధన,ఆమె తల్లి క్రూరంగా హత్య చేయబడి కనపడతారు.
షాక్ అయిన కార్తీక్ ని ప్రైమ్ సస్పెక్ట్ కింద అరెస్ట్ చేస్తారు. అలా తను ఇష్టపడ్డ అమ్మాయి హత్య కేసులో అరెస్ట్ అయిన కార్తీక్ ఎలా బయిటపడ్డారు. ఇంతకీ ఆరాధన ని ఎవరు హత్య చేసారు. టిల్లు అన్న కార్తీక్కి ఇచ్చిన పార్సిల్లో ఏముంది? టిల్లూ ఎమ్మల్యేగా గెలిచాడా..ఇంతకీ తల్లి,కూతుళ్లను చంపింది ఎవరు,ఆరాధన తన భార్యంటూ వచ్చిన జయదేవ్ షిండే (అనీష్ కురువిల్లా)కి ఈ హత్యకు ఏమైనా సంబంధం వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
బేస్ ఏమిటి
చాలా కాలం క్రితం హైదరాబాద్ కుందన్‌బాగ్ హౌస్ లో జరిగినన కొన్ని సంఘటనలు ఆధారంగా ఈ కథను అల్లుకున్నారు. కుందన్ బాగ్ ఇంట్లో ఓ మహిళ, ఆమె ఇద్దరు కుమార్తెలు ఉండేవారు. వీళ్ళు చీకటి పడిన తరువాత కొవ్వొత్తులను పట్టుకుని ఆ ఇంటి ఆవరణలో నడిచేవారని చెప్పుకుంటారు. అలాగే వారి ఇంటి ముందర రక్తం నింపి ఉన్న ఓ బాటిల్ కూడా ఉండేదని... దీంతో ఆ చుట్టుపక్కల ఇళ్లవారు వారిని దూరం పెట్టేవారు. ఈ క్రమంలోనే ఓరోజు ఓ దొంగ ఆ ఇంట్లోకి దొంగతనానికి వెళ్లగా.. అక్కడ కుళ్లిపోయి గుర్తు పట్టలేని స్థితిలో ఉన్న మృతదేహాలు కనిపించాయి. విషయం తెలుసుకున్న పోలీసులు.. తల్లీ కూతుళ్లు మృతి చెందినట్లు గుర్తించారు. వారు మృతి చెంది కూడా ఆరు నెలలకుపైగా గడిచినట్లు నిర్దారణ అయింది. దీంతో ఇన్ని రోజులు తాము చూసింది దెయ్యాల్ని అని భయపడ్డ స్థానికులు.. ఆ ఇంటివైపు వెళ్లటమే మానేశారు.
విశ్లేషణ
కొన్ని ట్విస్ట్ లు అనుకుని వాటి చుట్టూ కథని అల్లుకున్న కథనం ఇది. ఇలా ట్విస్ట్ లపై మమకారం ఎక్కువ అయ్యి..వాటి కోసం కథను సక్రమంగా,సహజంగా వెళ్లనివ్వకుండా ఎక్కడక్కడ దారి తప్పిస్తూ,తాము దారితప్పుతూ ప్రేక్షకుడుని ట్విస్ట్ లతో బిజీగా ఉంచాలని,తాము గజిబిజి అయ్యే కథా పక్రియ ఇది.
“12A రైల్వే కాలనీ” మొదటి గంటలోనే ఓ విషయం స్పష్టం అవుతుంది—ఈ సినిమా ఏ జానర్‌లో ఉందో రైటర్లు కూడా చివరి వరకూ నిర్ణయించుకోలేదు అని. కథ–స్క్రీన్‌ప్లే చూసిన వెంటనే, ఇది డాక్టర్ అనిల్ విశ్వనాథ్ (‘పొలిమేర’ ఫేమ్) స్టైల్ అని తెలుస్తుంది. ముందు ఆయన తాంత్రిక్, సూపర్నేచురల్ ట్రాక్స్‌లో ప్రయోగాలు చేసాడు. ఈసారి మర్డర్ మిస్టరీ అనుకున్నాడు… కానీ షూటింగ్ మధ్యలో “ఇక్కడ ఒక గోస్ట్ ని పెడితే ఎలా ఉంటుంది?” అని అనిపించినట్టుంది.
ఫలితం?
సస్పెన్స్–థ్రిల్–భూతం–ఇన్వెస్టిగేషన్—అన్నీ కలిపి చేసిన ‘స్టోరీ పులిహోర’ అయ్యింది.
మర్డర్ మిస్టరీకి లాజిక్ కావాలి. ఘోస్ట్‌కు ఫాంటసీ సరి. మర్డర్ ఇన్వెస్టిగేషన్ అంటే రీజన్, ప్రాసెస్, క్లూస్. గోస్ట్ థ్రిల్లర్ అంటే ఫియర్, విజన్స్, ఆ ఎట్మాస్మియర్. కానీ ఇక్కడ… లాజిక్ , ఫాంటసీ , రెండూ నాన్ సింక్ లో నడిచాయి. ‘హీరో అని చెప్పబడే’ వ్యక్తి—లోకల్ గ్యాంగ్ బాయ్—కేసు చెడగొట్టి, తిరిగి తనే సాల్వ్ చేస్తాడు. పోలీస్ ఆఫీసర్ రానా ప్రతాప్ అటెండెన్స్ షీట్ కోసం వచ్చాడంటే నమ్ముతారు కానీ ఇన్వెస్టిగేట్ చేయడానికి అని కాదు అనిపిస్తుంది.
తల్లీకూతుళ్లు అనూహ్య రీతిలో హత్యకు గురి అయితే మరణం వెనుక మిస్టరీని హీరో ఎలా ఛేదించాడన్నదే ఈ కథ. అయితే ఇందులో కామెడీ ఏమిటంటే(కామెడీ సినిమా కాదు ఇది) లేటెస్ట్ టెక్నాలజీని.. అనుభవజ్ఞులైన-నిపుణులైన టీమ్ ఉన్నా పోలీసులు ఇందులో చేసేదేమీ ఉండదు. కానీ పెద్దగా చదువుకోని.. ఓ ఎమ్మల్యే దగ్గర పనిచేసే, అతని పనులు చేసే హీరో మాత్రం తన మాస్టర్ మైండ్ వాడేసి ఈ కేసును ఛేదించేస్తూంటాడు. అఫ్ కోర్స్ సినిమా రూల్స్ ప్రకారం..హీరోనే అన్ని ఛేధించాలి కాబట్టి తప్పుల ేదు.
మొదటి ట్విస్ట్? CID సీరియల్ ఎపిసోడ్ రీమిక్స్ లా ఉంటుంది. టీమ్‌కు అనిపించి ఉండచ్చు: “క్లైమాక్స్ ముందు రెండు ట్విస్ట్‌లు వేస్తే సరిపోతుంది. ముందు ఎంత బోర్‌గా నడిపినా పర్వాలేదు. పడి ఉంటారు” అని. అందుకే ఫస్ట్ హాఫ్ — నరేశ్ ప్రేమ ట్రాక్ , కామాక్షి నో చెప్పడం, గ్యాంగ్ డైలాగ్‌లు ఇవే నడుస్తాయి. సస్పెన్స్? నేరేషన్? పాయింట్? ఒక్కటీ ఉండదు. సెకండాఫ్ ఉన్నంతలో బెస్ట్. అందులో కాస్తంత ట్విస్ట్ లు పండుతాయి..నచ్చుతాయి. అలాగే రైల్వే కాలనీ సెట్, పేరు పెట్టారు కానీ కథకు ఆ కాలనీకు సంభందమే లేదు. ఇది ఏ కాలనీలో అయినా జరగచ్చు.
అయినా ఇంత జానర్ కన్‌ఫ్యూజన్ తో కథ ఎలా రాసుకున్నారో అనిపిస్తుంది. మర్డర్ మిస్టరీ > గోస్ట్ ఎలిమెంట్స్ > లవ్ ట్రాక్ > పొలిటికల్ షేడ్ — అన్నీ కలిపేసి ఏది ప్రధానమో క్లారిటీ లేకుండా చేసారు. అలాగే ఇంటర్వెల్ ముందు ఒక మోటివ్, క్లైమాక్స్‌లో ఇంకోటి చూపిస్తారు. ట్విస్ట్ ఉన్నా… సెట్‌అప్ లేదు. పే-ఆఫ్ అసలే లేదు. హీరోయిన్ ఆరాధన పాత్రకు షిండే, టిల్లు పాత్రలతో ఉన్న లింక్ .. తాంత్రిక పూజల వెనకున్న మర్మం ఇంట్రస్టింగ్ గానే ఉన్నా అసలు విషయం చెప్పటానికి తీసుకున్న టైమ్ ఆ థ్రిల్ ని చంపేసింది. కథలో ఒరిజనల్ సస్పెన్స్ కంటే స్క్రీన్‌ప్లే లోపాలే ఎక్కువ సస్పెన్స్ క్రియేట్ చేసాయి.
సినిమాలో ఎవరు మర్డర్ అయ్యారు?
కథ ప్రకారం ఆరాధన (హీరోయిన్).
కాని అసలు మర్డర్ అయ్యింది మాత్రం …
స్క్రిప్ట్.
ఎవరెలా ..
అల్లరి నరేష్ డిఫరెంట్ అనుకుని చేసిన సినిమా కానీ..విభిన్నత అంటే వల్గారిటీ డైలాగులు చెప్పటం, తనకు మ్యాచ్ కానీ పాత్ర చేయటం కాదు కదా. కామాక్షి భాస్కర్లకు కీలకమైన పాత్రే దక్కింది కానీ.. పండలేదు. హీరో స్నేహితుల పాత్రలన్ని రొటీన్. పొలిటీషియన్ టిల్లు పాత్రలో జీవన్ ఓకే అనిపించాడు. సాయికుమార్ చేసిన పోలీస్ పాత్ర పెద్దగా ఏమీ లేదు. అనీష్ కురువిల్లా బాగా చేసారు.
టెక్నికల్ గా
భీమ్స్ సిసిరోలియో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకుప్లస్. పాటలు బాగోలేదు. కుశేందర్ రమేష్ రెడ్డి ఛాయాగ్రహణం ఓకే. దర్శకుడు నాని కాసరగడ్డ జస్ట్ ఓకే అనిపించారు. ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా ఉండాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
ఫైనల్ థాట్
“12A Railway Colony” చూసాక ఒక విషయం మాత్రం నిర్ధారం అవుతుంది—
సినిమా మర్డర్ మిస్టరీ కాదు…
మిస్టరీ ఎలా మర్డర్ అవుతుందో చూపించిన హారర్ డాక్యుమెంటరీ.