‘కల్కి’సుడిగాలి ... అశ్వనీదత్ మనస్సులో

"ఎన్నో సినిమాలు తీసిన నాకు ఈ సినిమా చూశాక నాకు సినిమాలు తీసే విధానం నాకు తెలియదేమో ననిపిస్తూ ఉంది."

Update: 2024-06-30 03:24 GMT

ఎన్నో సూపర్ హిట్ సినిమాలు సూపర్ స్టార్స్ తీసిన భారీ నిర్మాత అశ్వనీదత్ ఆలోచనలను ‘కల్కి’ మొత్తం ఒక్కసారిగా తారుమారు చేసింది. తన అల్లుడు నాగ్ అశ్విన్, తన కుమార్తెల ప్రతిభను చూసి మురిసిపోతున్నారు. కల్కి సక్సెస్ ఆయన కళ్లల్లోనే కనపడుతోంది. నిజానికి తన బ్యానర్ పై లెక్కలేనన్ని బ్లాక్ బస్టర్స్ చూసిన ఆయనకు సక్సెస్ కొత్తేమీ కాదు. కానీ ఆయన అంతా పుత్రికోత్సాహం. తన సంస్దను అదే స్దాయిలో కొనసాగిస్తూ నిలబెట్టబోతున్నారు అనే మనో ధైర్యం అశ్వనీదత్ కు వచ్చేసింది. అందుకు కల్కి విజయం ఊతం ఇచ్చింది.


నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సైన్స్ ఫిక్షన్ మైథలాజికల్ మూవీ కల్కి 2898 ఏడీ ఇప్పటివరకు (దేశీయంగా) భారతీయ సినిమాల్లో అత్యధిక ఓపెనింగ్స్ నమోదు చేసిన 3వ సినిమాగా చరిత్ర సృష్టించింది. ఆర్ఆర్ఆర్, బాహుబలి 2 సినిమాల తర్వాత కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్ వద్ద రూ. 191.5 కోట్లతో భారీ ఓపెనింగ్స్ కలెక్ట్ చేసింది. ఇవి అశ్వనీదత్ ని గాల్లో తేలేలా చేస్తున్నాయి.

మీ అమ్మాయిలు వరల్డ్ రేంజ్ సినిమాని తీశారు. తండ్రిగా మీ ఫీలింగ్? అని ఇంటర్వూలో ప్రశ్న అడిగితే నేను గొప్ప అదృష్టవంతుడిని. మా అమ్మాయిలు సంస్థని గొప్ప శిఖరాలకి తీసుకెళుతున్నారు. తండ్రిగా చాలా గర్వపడుతున్నాను అని చెప్పారు. ఏ సంస్ద అయినా వ్యక్తులు అయినా ఓ స్దాయికి లేదా వయస్సుకు వచ్చిన తర్వాత వారసత్వం కొనసాగింపు ఉంటుందా అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా ఉంటుంది. దానికి కల్కితో అశ్వనీదత్ కు సమాధానం దొరికేసింది.

ఆంధ్రజ్యోతికు ఇచ్చిన ఇంటర్వూలో కేవలం రెండు సినిమాల అనుభవం మాత్రమే ఉన్న నాగ్ అశ్విన్ ఇలాంటి వైల్డ్ డెప్త్ వున్న సబ్జెక్ట్ ని హ్యాండిల్ చేయగలడనే కాన్ఫిడెన్స్ మీకు ఎప్పుడు వచ్చింది? అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఆసక్తికరంగా ఉంది. తన మొదటి సినిమా నుంచి తనతో జర్నీ చేస్తున్నాం. తను ఎంత పెద్ద సినిమా అయినా తీయగలడనే కాన్ఫిడెన్స్ నాకు మొదటి నుంచి వుంది. అదే మా అమ్మాయిలతో చెప్పాను. తను ఏ సబ్జెక్ట్ చెప్పినా వెంటనే దూకేయమని అన్నాను.

ఈ శతాబ్దంలో ఒక దర్శకుడు మా ఇంట్లోనే దొరికాడు(నవ్వుతూ). నా మొదటి సినిమా ఎదురులేని మనిషి నుంచి ఇప్పటివరకూ దర్శకుడు చెప్పింది వినడం, తనకు కావల్సినది సమకూర్చడం తప్పా మరో డిస్కర్షన్ పెట్టను. ఇది అందరికీ తెలుసు. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ ఇంకా ఏం కావాలని అడగడం తప్పా నేను ఎప్పుడు ఎక్కడ ఇంటర్ఫియర్ కాలేదు. నేను ఏదైతే అనుకున్నానో అలాంటి అఖండ విజయం వచ్చింది. హ్యాట్సాప్ టు నాగ్ అశ్విన్. నాకు కొడుకులేని లోటు నాగ్ అశ్వనీదత్ తీర్చాడు. ఇంత మంచి అల్లుడు లభించడం దేవుడి దయ అని నాగ్ అశ్విన్ పై తన కాన్ఫిడెన్స్ ని చెప్పారు.

తన అభిమాన హీరో ఎన్టీఆర్ సూచించిన ‘వైజయంతీ’ పేరునే బ్యానర్ గా పెట్టుకొని తొలి ప్రయత్నంలో ఎన్టీఆర్ హీరోగా కె.బాపయ్య దర్శకత్వంలో ‘ఎదురులేని మనిషి’ నిర్మించారు. ఆ చిత్రం వసూళ్ళ వర్షం కురిపించి, దత్ నిర్మాతగా నిలదొక్కుకొనేలా చేసింది. తరువాత ఎన్టీఆర్ తోనే ‘యుగపురుషుడు’ నిర్మించారు. తరువాత ఇతర హీరోలతో సినిమాలు తీయండి, మీకు మంచి భవిష్యత్ ఉందన్నారు ఎన్టీఆర్. ఆయన చెప్పిన తరువాతే దత్ ఇతర హీరోలతో చిత్రాలు నిర్మించడం మొదలు పెట్టారు.

యన్టీఆర్ తో రెండు చిత్రాలు తీసిన అశ్వనీదత్ ఏయన్నార్ తో “గురుశిష్యులు, బ్రహ్మరుద్రులు” నిర్మించారు. ఈ రెండు చిత్రాలలో వేరే హీరోలు కూడా ఉన్నారు. కృష్ణ, కృష్ణంరాజుతో ‘అడవిసింహాలు’ తెరకెక్కించారు. కృష్ణతో సోలోగా ‘అగ్నిపర్వతం’ తీశారు. చిరంజీవితో “జగదేకవీరుడు-అతిలోకసుందరి, చూడాలనివుంది, ఇంద్ర, జై చిరంజీవా” చిత్రాలు నిర్మించారు.

బాలకృష్ణతో ‘అశ్వమేధం’, అందులోనే శోభన్ బాబుతో ఓ కీ రోల్ పోషింపచేశారు. నాగార్జునతో “ఆఖరి పోరాటం, గోవింద గోవిందా, రావోయి చందమామా, ఆజాద్” తెరకెక్కించారు. వెంకటేశ్ తో ‘బ్రహ్మరుద్రులు, సుభాష్ చంద్రబోస్’ తీశారు. పవన్ కళ్యాణ్ తో ‘బాలు’, జూనియర్ యన్టీఆర్ తో “కంత్రి, శక్తి” చిత్రాలు నిర్మించారు. మహేశ్ బాబును హీరోగా పరిచయంచేస్తూ ‘రాజకుమారుడు’ తెరకెక్కించారు. ఆయనతోనే ‘సైనికుడు’ నిర్మించారు. రామ్ చరణ్ ను హీరోగా పరిచయంచేస్తూ ‘చిరుత’ రూపొందించారు. ఈయన నిర్మించిన సినిమాల్లో ఎక్కువ శాతం బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి.

వైజయంతీ మూవీస్ పతాకంపైనే కాకుండా స్వప్న సినిమా పతాకంపైనా ఆయన సినిమాలు నిర్మించారు. ఈ బ్యానర్ పై రూపొందిన ‘స్టూడెంట్ నంబర్ వన్’ ద్వారా రాజమౌళిని దర్శకునిగా పరిచయంచేశారు. ‘ఒకటో నంబర్ కుర్రాడు’తో తారకరత్నను హీరోని చేశారు. ‘ఎవడే సుబ్రమణ్యం’తో నాగ్ అశ్విన్ ను దర్శకునిగా నిలిపారు. ఆ మధ్య ఘనవిజయం సాధించిన చిన్న సినిమా ‘జాతి రత్నాలు’ కూడా ఈ పతాకంపైనే రూపొందింది.

ఇక తన బ్యానర్ లోగోలో ‘శ్రీకృష్ణావతారం’లో యన్టీఆర్ విజయశంఖారావం చేసే బొమ్మనే పెట్టుకున్నారు దత్.తరువాత నాటి టాప్ స్టార్స్ తోనూ తరువాతి తరం స్టార్ హీరోలతోనూ చిత్రాలను నిర్మించి జనం మదిలో మరపురాని స్థానం సంపాదించారు అశ్వనీదత్. ప్రస్తుతం ఆయన కూతుళ్ళు చిత్రనిర్మాణంలో ఉన్నారు. వారికి తగిన సలహాలూ, సూచనలూ చేస్తూ అశ్వనీదత్ అభిరుచిగల చిత్రాలను నిర్మిస్తున్నారు.


ప్రస్తుతం ఆయన బ్యానర్ నుంచి వచ్చిన లేటెస్ట్ సెన్సేషన్ ‘కల్కి’భాక్సాఫీస్ దగ్గర రికార్డ్ లు సృష్టిస్తోంది. ఇతిహాసానికి, సైన్స్‌ను ముడిపెట్టి నాగ్ అశ్విన్‌ తెరకెక్కించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ప్రభాస్‌తో (Prabhas) పాటు అగ్రనటీనటుల నటనకు ఆడియన్స్‌ ఫిదా అవుతున్నారు. రిలీజ్‌కు ముందే ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న ‘కల్కి’.. విడుదల తర్వాత కూడా హవా కొనసాగిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా నార్త్ లో కూడా కలెక్షన్స్ దుమ్ము రేపుతోంది.


Tags:    

Similar News