11 సినిమాలు రిలీజ్ .. ఒక్క సక్సెస్ కాలేదు
టాలీవుడ్‌లో ఏం జరుగుతోంది?;
2025 ఆగస్టు నెల తెలుగు సినిమా పరిశ్రమకు ఫ్లాప్‌ల పండుగను తీసుకొచ్చింది. వారానికి నాలుగైదు సినిమాలు రిలీజైనా, ఒక్కదానికీ నిలకడైన కలెక్షన్లు రాలేదు. భారీ అంచనాలతో వచ్చిన వార్ 2 , కూలీ బాక్సాఫీస్‌ను ఊపేస్తాయనుకున్నారు. కానీ కంటెంట్ లోపంతో రెండూ కుప్ప కూలిపోయాయి.
ఎంతో నమ్మకం పెట్టుకుని చేసిన చిన్న సినిమాలు కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా సరైన గుర్తింపు, కలెక్షన్స్ తెచ్చుకోలేకపోయాయి. దాంతో ఆగస్ట్ నెల హిట్స్ లేని నెల గా – ఇండస్ట్రీకి గట్టి ఆర్థిక దెబ్బ గా మిగిలింది.
బాక్సాఫీస్ బిజినెస్ బ్రేక్‌డౌన్
1 వ వారం (ఆగస్టు 2–4):
రిలీజ్ లు: థ్యాంక్యూ డియర్ , బాలు గాడి లవ్ స్టోరీ , బకాసుర రెస్టారెంట్
రిజల్ట్: రిలీజ్ అయ్యాయా లేదా అనిపించే స్థాయిలో మిగిలాయి. ప్రొడ్యూసర్లు పెట్టుబడిని కూడా రాబట్టకోలేకపోయారు. థియేటర్లలో రెండో రోజు నుంచే షోస్ మాయం అయ్యాయి.
2వ వారం (ఆగస్టు 14–18):
వార్ 2
యంగ్ టైగర్ యన్టీఆర్ (Jr NTR) నటించిన తొలి హిందీ చిత్రం కావడం, అందునా మాచో మేన్ హృతిక్ రోషన్ (Hrithik Roshan) తో యన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకోవడం, తారక్-హృతిక్ ఇద్దరూ మంచి డాన్సర్స్ అవ్వడం- వార్ 2 (War 2 Movie) మూవీపై అందరిలోనూ ఆసక్తిని పెంచింది. యశ్ రాజ్ ఫిలిమ్స్ (Yash Raj Films) నిర్మించిన స్పై మూవీ 'వార్ 2' చిత్రానికి అయాన్ ముఖర్జీ (Ayan Mukerji) దర్శకత్వం వహించారు. ఆగస్టు 14 శుక్రవారం 'వార్ 2' ప్రేక్షకులను పలకరించింది.
వార్ 2 – ప్రారంభం శనివారం, ఆదివారం కలిపి బంపర్ ఓపెనింగ్స్. కానీ కంటెంట్ బలహీనతతో వారం రోజులలోనే పూర్తి డ్రాప్.
బయ్యర్లు 30–40% వరకు నష్టాల్లోకి వెళ్లారు.
రజనీకాంత్ 'కూలీ'
రజినీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం కూలీ. నాగార్జున, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. 'జైలర్' సినిమా తర్వాత నటించిన ‘వేట్టయాన్’, 'లాల్ సలామ్’ చిత్రాలు ఆశించిన ఫలితం అందుకోలేదు. తదుపరి లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanakaraj) తెరకెక్కించిన 'కూలీ' చిత్రంపై ఫ్యాన్స్ బోలెడు ఆశలు పెట్టుకున్నారు.
ఈ సినిమా టైటిల్ నుంచి రజనీలుక్, సింపుల్ ట్రైలర్‌లో సినిమాపై హైప్ పెంచారు లోకేశ్ కనగరాజ్. పైగా ఇందులో విలన్‌గా టాలీవుడ్ కింగ్ నాగార్జున, కీలక పాత్రల్లో బాలీవుడ్ నుంచి ఆమిర్‌ఖాన్(Aamir Khan), కన్నడ నటుడు ఉపేంద్ర (Upendra) కనిపించడంతో సినిమాకు మరింత హైప్ పెరిగింది.
అయితే మాస్ క్రేజ్ తో మొదలైన సినిమా. మొదటి రెండు రోజులు హైప్ క్రియేట్ చేసింది. కానీ ఆ తరువాత ఫ్యామిలీ ఆడియెన్స్ ఆకర్షించలేకపోయింది. వీకెండ్ అయ్యి సరికి దారుణమైన డ్రాప్ మొదలైంది.
చివరకు యావరేజ్ టాక్, మిశ్రమ వసూళ్లు. కానీ మొత్తానికి డిస్ట్రిబ్యూటర్లకు నష్టమే.
3వ వారం:
పరదా (అనుపమ పరమేశ్వరన్) –
పరదా.. టైటిల్, ముసుగులతో ఉన్న ఆడవాళ్ళ పోస్టర్స్ విడుదలైనప్పటి నుంచి సినిమాపై ఆసక్తి నెలకొంది. అనుపమా పరమేశ్వరన్ కథానాయికగా దర్శన రాజేంద్రన్, సంగీత కీలక పాత్రధారులు కావడం, ‘సినిమా బండి’, ‘శుభం’ వంటి భిన్నమైన చిత్రాలతో ఆకట్టుకున్న ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో ఈ సినిమా రావడంతో సినిమాపై మరింత ఆసక్తి రేకెత్తించింది.
కంటెంట్ స్ట్రాంగ్ అయినా, నేరేషన్ ఫెయిల్. దాంతో అసలు మినిమం కలెక్షన్స్ కూడా రాబట్టలేక చతికిల పడింది.
మేఘాలు చెప్పిన ప్రేమకథ , కన్యాకుమారి – హైప్ తో వచ్చిన ఈ చిత్రాలు కూడా , ఫస్ట్ వీకెండ్ లోనే కూలిపోయాయి.
4వ వారం:
బార్బరిక్ , అర్జున్ చక్రవర్తి , సుందరకాండ
'త్రిబాణధారి బార్బరిక్'
'త్రిబాణధారి బార్బరిక్' టైటిల్ తో వచ్చిన ఈ చిత్రంలో సత్య రాజ్, వశిష్ట ఎన్ సింహా, ఉదయభాను, సత్యం రాజేశ్, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్, మేఘన కీలక పాత్రల్లో నటించారు. మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో మారుతి సమర్పణ.. వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. బార్బరీకుడు త్రిబాణాలతో కురుక్షేత్రంను ఆపగలడని, ఆయన దగ్గర ఉండే మూడు బాణాలకు ఒక్కో ప్రత్యేకత ఉంటుందని వాటిని తెలియజేస్తూ ఆసక్తికరంగా కథను ప్రారంభించాడు దర్శకుడు.
అలాగని ఇది మైథలాజికల్ సినిమా కాదు. కీలక పాత్రధారికి బార్బరికుడు అనే క్యారెక్టర్‌ను ప్రేరణగా తీసుకున్నారంతే. ఈ సినిమా మార్నింగ్ షో నుంచే కలెక్షన్స్ లేకుండా పోయాయి. దాంతో దర్శకుడు చెప్పుతో కొట్టుకుంటూ వీడియో కూడా రిలీజ్ చేసారు.
నారా రోహిత్ సుందరకాండ – మంచి రివ్యూలు తెచ్చుకుంది. కానీ స్క్రీన్ కౌంట్, ప్రమోషన్ లేకపోవడంతో కలెక్షన్లు రాలేదు.
మిగతావన్నీ పూర్తిగా ఫెయిల్.
డిస్ట్రిబ్యూటర్ల నష్టం:
ముఖ్యంగా వార్ 2 బయ్యర్లు భారీగా దెబ్బతిన్నారు. ఎక్సైట్మెంట్ తో రేట్లు పెంచి కొన్నా, రికవరీ జరగలేదు. కూలీ కూడా బయ్యర్లకు మినహాయింపు ఇవ్వలేదు.
ప్రొడ్యూసర్ల లాస్:
చిన్న సినిమాలు బాక్సాఫీస్ లో బారీగా దెబ్బతినటం వలన ప్రొడ్యూసర్లు డిజిటల్ రైట్స్ మీద ఆధారపడాల్సి వచ్చింది. కానీ అక్కడ కూడా ఆశించిన రేట్లు రావడం లేదు.
థియేటర్ ఓనర్స్ స్థితి:
ఆగస్టు మొత్తం థియేటర్లలో ఆక్యుపెన్సీ 20–25% మాత్రమే. పండగ సీజన్ కాకపోవడం ఒక కారణం అయినా, కంటెంట్ లేకపోవడమే ప్రధాన కారణంతో జనాలను థియేటర్స్ కు ఎట్రాక్ట్ చేయలేకపోయాయి.
ట్రేడ్ టాక్
ఏదైమైనా ఆగస్టు 2025 తెలుగు బాక్సాఫీస్‌కు డార్క్ మంత్ . వార్ 2 లాంటి బిగ్ బడ్జెట్ సినిమాలు ఫెయిల్ అవ్వడం వలన, రాబోయే పెద్ద సినిమాల ప్రీ-రిలీజ్ బిజినెస్ పై డైరెక్ట్ ఇంపాక్ట్ పడింది. డిజిటల్ ప్లాట్‌ఫాంలు కూడా జాగ్రత్తగా డీల్స్ క్లోజ్ చేస్తున్నాయి. ఫ్లాప్ రిజల్ట్స్ వల్ల పెద్దగా రేట్లు ఆఫర్ చేయడంలేదు. థియేటర్ ఎగ్జిబిటర్లు సెప్టెంబర్‌కి ఎదురుచూస్తున్నారు. ఒక రెండు హిట్స్ రాకపోతే పరిస్థితి మరింత కష్టతరమవుతుంది.
హెచ్చరిక
ఆగస్టులో ఒక్క హిట్ కూడా లేకపోవడం నిర్మాతలు, బయ్యర్లకు సీరియస్ అలారం . సెప్టెంబర్‌లో స్టార్ హీరో సినిమాలు, పండగ రిలీజ్‌లు కొంత సేఫ్ గా భాక్సాఫీస్ ని ఒడ్డెక్కిస్తాయనే ఆశ ఉంది. కానీ ఈ నెలలాగే ఫలితాలు వస్తే, టాలీవుడ్ బిజినెస్ స్ట్రక్చర్ లోనే మార్పులు తప్పవు.