ఎక్ ప్యార్ క నగ్మా హై... ఎంత అందమైన ప్రేమ గీతం
ప్రతిపాటని కనిపించకుండా రాగం నడిపించినట్లు, పాట విప్పిచూస్తే ఎన్ని విశేషాలు కనిపిస్తాయి. లతా పాడిన ఈ అందమయిన ప్రేమ గీతం విశేషాలేమిటో చూడండి...
By : Saleem Basha
Update: 2024-03-05 13:01 GMT
ఎక్ ప్యార్ క నఘ్ మా హై
మౌజోంకి రవాని హై
జిందగీ ఔర్ కుచ్ భీ నహీ
తేరి మేరీ కహానీ హై
(ఒక అందమైన ప్రేమ గీతం
అలల ప్రవాహం
జీవితమంటే మరేది కాదు
మన ఇద్దరి కథ మాత్రమే)
" యమన్ కళ్యాణ్" రాగంలో లక్ష్మీకాంత్ ప్యారేలాల్ జంట సమకూర్చిన పాటని, లతా మంగేష్కర్ తప్ప ఎవరూ పాడలేరు, అన్న స్థాయిలో లతా పాడిన పాట ఇది. ఈ పాటని లతా మంగేష్కర్, లక్ష్మికాంత్ ప్యారేలాల్ అజరామరం చేశారు.
ప్రతప్రత
డెబ్భయ్ దశకం మొదట్లో వచ్చిన "షోర్"(1972) సినిమాలోని అత్యంత ప్రజాదరణ పొందిన పాట ఇది. హిందీ పాటలు వినే వాళ్లలో ఈ పాట గురించి అప్పుడు, ఇప్పుడు తెలియని వారు అంటూ ఉండరు. కానీ ఈ పాట రాసిన రచయిత గురించి చాలామందికి తెలియదు. దానికి కారణం రచయిత ఎప్పుడు అజ్ఞాతంగానే ఉండడానికి ఇష్టపడటం. "సంతోష్ ఆనంద్" రాసింది కొన్ని పాటలే అయినా మనసును స్పందింపజేసే పాటలు. జీవితం గురించి ఇంత సులభంగా, ఇంత హాయిగా రాసిన పాటలు కొన్నే ఉంటాయి. ఆ కొన్నింట్లో ఇది మొదటి స్థానంలో ఉంటుంది.
అలిఘర్ ముస్లిం యూనివర్సిటీలో లైబ్రరీ సైన్స్ లో డిగ్రీ చదివేటప్పుడు సంగీత, సాహిత్యాల మీద
ఆసక్తి కలిగింది. అలా రాయడం మొదలుపెట్టాడు. సంతోష్ ఆనంద్ చాలా ఆలస్యంగా, 41 సంవత్సరాలు వయసులో, హిందీ సినిమా పాటలు రాయడం మొదలుపెట్టాడు.
మనోజ్ కుమార్ తీసిన "పూరబ్ ఔర్ పశ్చిం"(1970) సినిమాతో పాటలు రచయితగా తన ప్రస్తానాన్ని మొదలుపెట్టాడు.సంగీత దర్శకులు కళ్యాణ్ జి ఆనంద్ జి అతనికి ఒక అవకాశం ఇచ్చారు. " పురువా సుహాని ఆయిరే" అన్న పాట రాశాడు.
ఆ తర్వాత 1972 లో " షోర్", 1974 లో " రోటి కపడ ఔర్ మకాన్",1981 లో "క్రాంతి" వంటి మనోజ్ కుమార్ సినిమాలకు కొన్ని పాటలు రాశాడు. రోటి కపడ ఔర్ మకాన్ సినిమా లో రాసిన "మైనా భూలూంగా" కు 1975 లో మొదటి ఫిలింఫేర్ అవార్డు అందుకున్నాడు. క్రాంతి సినిమాలో ముఖేష్ కుమారుడు నితిన్ ముఖేష్, లతా మంగేష్కర్ తో కలిసి పాడిన " జిందగీ కి నా న టూటే లడీ.. ప్యార్ కర్లే ఘడీ దో ఘడీ" పాట సూపర్ హిట్ అయింది. తర్వాత " ప్యాసా సావన్" సినిమాలో రాసిన " మేఘారే మేఘారే, మత్ పరదేశ్ జారే" అని లత, సురేష్ వాడ్కర్ పాడిన పాట ప్లాటినం డిస్క్ దాటింది. ఎందుకనో రాజ్ కపూర్ తన సినిమాలకు సంతోష్ ఆనంద్ తో పాటలు రాయించలేదు. కానీ రిషి కపూర్ హీరోగా తాను దర్శకత్వం వహించిన ప్రేమ్ రోగ్((1973) సినిమాలో మాత్రం పాటలు రాయించాడు. అందులోని " మొహబ్బత్ హై క్యా చీజ్.. హం కో బతావో" అనే పాటకు తన రెండవ ఫిలింఫేర్ అవార్డు అందుకున్నాడు.
. సంతోష్ ఆనంద్ అని పేరు పెట్టుకున్నప్పటికీ, అతని జీవితంలో సంతోషము ఆనందము తక్కువగా ఉన్నాయి. చాలా కష్టాలు అనుభవించాడు. అతని జీవితంలో నుంచి భార్య తొందరగా నిష్క్రమించింది, కుమారుడు క్యాన్సర్ తో పోయాడు. ఇప్పుడు కేవలం మనుమరాలిని చూసుకొని బతుకుతున్నాడు.
ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ చలించని, ఎవరి దగ్గర చేయిచాపని స్వాభిమాని సంతోష్ ఆనంద్. " ఒక కళాకారుడిగా నాకు కేవలం గౌరవం ఇస్తే చాలు. ఇంకేది అవసరం లేదు. నేను బాగానే బతుకుతున్నాను. నాకు సాయం అవసరం లేదు" అని ఇండియన్ ఐడల్ లో జడ్జి నేహా కక్కడ్ అతనికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్తే, అతను నిరాకరించిన సందర్భంగా చెప్పాడు.
జీవితం ప్రతి దశలో విషాదాన్ని అనుభవించినప్పటికీ, రాసిన పాటల్లో గుండెలు పిండే పాటలు కాకుండా, గుండెను తడిమి తడి చేసే పాటలు రాశాడు. విషాదాన్ని భరిస్తూ కూడా ఆశావాదాన్ని పాటల్లో ప్రతిబింబజేసాడు. దీనికి ఒక ఉదాహరణ ప్యాసా సావన్ సినిమాకు రాసిన " తెరాసాత్ హై తో ముజే కమ్ నహి హై"
అనే ఆణిముత్యం లాంటి పాట పాట.
తెరా సాథ్ హైతో ముఝే క్యా కమీ హై
అంధేరో సె భి మిల్ రహి రోషిని హై
హర్ ఇక్ ముష్కిల్ సరళ్ లగ్ రహీ హై
ముఝే ఝోపుడీ భీ మహల్ లగ్ రహీ హై
(నీ తోడు ఉంటే నాకేమి తక్కువ.
చీకట్ల నుంచి కూడా వెలుతురు దొరుకుతోంది
ప్రతి సమస్య సులభంగా కనబడుతోంది
ఈ గుడిసె కూడా నాకు మహల్ లా కనబడుతోంది)
రాసి కన్నా వాసికి ప్రాధాన్యత ఇచ్చి విషాదంలో సృజనాత్మకంగా ఆశావాదాన్ని అక్షరబద్ధం చేసి, ఆణిముత్యాల లాంటి పాటలు రాసిన సంతోష్ ఆనంద్ జయంతి(5.3.1929) ఈరోజు.