క్లీన్ కామెడీనే కానీ... : ‘విద్యాపతి’ ఓటీటీ మూవీ రివ్యూ
మరి మనకు ఎక్కే సినిమానేనా, చిత్రం కథేంటి? చూద్దాం మరి!;
సమ్మర్ వచ్చేసింది… సీరియస్ సినిమాలకు సెలవులు, లైట్ హార్ట్ కామెడీలకు మంచి వెల్కమ్ పలుకుతాయి ఫ్యామిలీలు! ఇలాంటి టైమ్‌లో ఓటీటీలో రిలీజ్ అయిన ‘విద్యాపతి’ అనే కన్నడ కామెడీ సినిమా, ఇప్పుడు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా, హాస్యం, హంగామా, హార్ట్ టచ్ — అన్నీ కలిపి వేసిన రుచి వంటకంలా ఉందన్నారు కన్నడ ప్రేక్షకులు. మరి మనకు ఎక్కే సినిమానేనా, చిత్రం కథేంటి? చూద్దాం మరి!
స్టోరీ లైన్
ఇది సిద్ధూ (నాగభూషణ) కథ. ఇంట్లో ఉన్న దోశ బండి అంటే చిన్నప్పటి నుంచి చిరాకు. కష్ట పడాలంటే వణుకు. డబ్బు కోసం ఏదైనా చేసేసే ఓ లోఫర్ మనస్తత్వం. కాని లైఫ్‌లో ఒక స్మార్ట్ మూవ్ తో... ఒక్కసారి స్టార్ హీరోయిన్ విద్య (మలైకా వాసుపాల్) జీవితంలోకి ఎంటరవుతాడు. ఆమెకు “హజ్బెండ్+మేనేజర్” గా సెటిలైపోతాడు. ఆమెను ప్రేమించాడు కాదో తెలియదు… కానీ ఆమె స్టార్‌డమ్‌ను మాత్రం పిచ్చపట్టినట్టు ప్రేమింస్తూంటాడు! అందుకే అందరూ అతన్ని ‘విద్యాపతి’ అని పిలుస్తారు — అంటే విద్య పై ఆధారపడే జీవితం!
కానీ జీవితాన్ని ఎప్పటికీ మేనేజ్ చేయలేం కదా? ఒకరోజు విద్య ఓ గట్టి షరతు పెడుతుంది. “నన్ను అవమానించిన రౌడీ జగ్గూ ( గరుడ రామ్)ని నా ముందు లాక్కొచ్చి... సారీ చెప్పించు!” అంటుంది. ఇన్నాళ్లూ లగ్జరీ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న సిద్ధూ,ఇప్పుడు ఇరుకున పడ్డాడు. జగ్గూతో పెట్టుకోవడం అంటే మాటలు కాదు. తప్పనిసరి పరిస్థితుల్లో అసలైన గ్రౌండ్ లోకి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు ఏమైంది? అసలు అలాంటి కండీషన్ విద్య ఎందుకు పెట్టింది. అనేది మిగతా కథ.
విశ్లేషణ
ఎంటర్‌టైన్‌మెంట్ టోన్‌తో మొదలయ్యే ఈ సినిమాలో సిద్ధూ పాత్రను ఓ మోసగాడిగా, కష్టపడటానికి ఇష్టపడటానికి ఇష్టపడని వ్యక్తిగా పరిచయం చేస్తారు . విద్యను మాయ చేసి పెళ్లి చేసుకున్న వరకు కథ లైట్ గా సాగుతుంది. జగ్గూ పాత్ర ఎంట్రీతో కథలో Conflict Trigger అయ్యింది. ఆ తర్వాత విద్య పెట్టిన షరతు తో ఫెరఫెక్ట్ గానే మలుపు తిరిగింది.అయితే స్పీడు అందుకోలేదు. ఇలాగే కథ జరుగుతుందనే ప్రెడిక్టబులిటి కనిపించింది.
ఆ తర్వాత స్క్రాప్ యార్డ్ లో సిద్ధూ ప్రయాణం ప్రారంభం అవుతుంది. ఇది మెటాఫిజికల్ స్పేస్. అతని అంతర్గత అవమానాల ప్రతిబింబం. ఆ తర్వాత అనకొండ (ధనంజయ)గా ఎంట్రీ. అక్కడ నుంచి "Mentor enters at lowest point" మోడల్ లో కథ నడుస్తుంది.
ఆ తర్వాత కథకు అవసరమైన Redemption & Resolution వైపు వెళ్లిపోయారు. క్లైమాక్స్ లో జగ్గూని ఎదిరించే క్లైమాక్స్ బ్లాక్ – ఫిజికల్‌గా పెద్దది కాదు, కానీ ఎమోషనల్‌గా అతని గ్రోత్‌కు నిదర్శనం. చివర్లో విద్యతో మళ్లీ కలవడంలో హీరో గెలుపు లేదు – ఒక వ్యక్తిగా పునరావిష్కరణే గెలుపు. ఇది ట్రెడిషనల్ హీరో ఆర్క్ కాకపోయినా, మానవతా విలువల ఆధారంగా నిర్మితమైన విలక్షణ పాత్రగా కొంతవరకూ ఆకట్టుకుంటుంది.
కాన్సెప్ట్ బాగానే ఉన్నా కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ ఆశించిన స్థాయిలో పండకపోవడం ఈ మూవీకి మైనస్‌గా మారింది.
ఎవరెలా చేశారు
యూట్యూబర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన నాగభూషణ సంకష్ట కర గణపతి మూవీతో యాక్టర్‌గా శాండల్‌వుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. హీరోయిన్‌గా మలైకావాసుపాల్‌కు విద్యాపతి మొదటి సినిమా కావడం గమనార్హం. పుష్ప లో విలన్ గా నటించిన డాలీధనుంజయ…విద్యా పతి మూవీలో గెస్ట్ రోల్‌లో కనిపించాడు. కేజీఎఫ్ ఫేమ్ రామచంద్రరాజు విలన్‌గా నటించాడు. అద్బుతం అనలేము కానీ కథ ప్రకారం లైటర్ వీన్ లో అలా నడుచుకుంటూ వెళ్లారు. సినిమాటోగ్రఫీ ..బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. ఎడిటింగ్ జస్ట్ ఓకే అన్నట్లు ఉన్నాయి.
ఫైనల్ థాట్
"కష్టపడకుండా జీవితం లభించదు" – ఈ థీమ్ ఓల్డ్‌గా ఉన్నా, కొత్తగా పాకేజింగ్ చేసే ప్రయత్నం చేశారు. లైఫ్‌కి షార్ట్‌కట్ ఉండదని తెలిసే లోపల, కొంచెం నవ్వులు, కొంచెం గుండె తడులు ఇచ్చే కామెడీ కథ "విద్యాపతి". ఇది కామెడీగా చెప్పినా... అంతర్గతంగా ఒక “lazy man’s redemption” కథ కూడా ఉంది. కాబట్టి ఓ లుక్కేయచ్చు.
ఎక్కడ చూడచ్చు
అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో ఉంది సినిమా