రణ్‌వీర్ ‘ధురంధర్’ Movie Review
--- సాధారణ స్పై సినిమా కాదు…కానీ
Update: 2025-12-17 03:45 GMT
పొరుగుదేశం పాకిస్దాన్ నుంచి వరస సమస్యలు,దాడులతో భారత్ విసిగిపోతుంది. ఈ దాడులను అడ్డుకునేందుకు భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్ (మాధవన్) ఒక వ్యూహాత్మక ప్రణాళికను ప్రతిపాదిస్తాడు. కానీ అది చాలాకాలం పాటు తిరస్కరణకు గురవుతుంది. చివరకు 1999లో జరిగిన ఐసీ-814 విమాన హైజాక్, 2001 భారత పార్లమెంట్‌పై జరిగిన ఉగ్రదాడి ఘటనల తర్వాత ఆ ప్రణాళికకు ఆమోదం లభిస్తుంది. అప్పుడు అజయ్ సన్యాల్ తీసుకున్న ఓ కీలక నిర్ణయమే ఆపరేషన్ ధురంధర్.
ఆ ఆపరేషన్ లక్ష్యం ఎలాగైనా పాకిస్థాన్‌ను చావు దెబ్బ కొట్టాలని, ఆ దేశంలోని ఉగ్రవాద సంస్థల్ని సమూలంగా అంతం చేయాలనేదే. ఈ ఆపరేషన్ ధురంధర్ కోసం పంజాబ్‌లో జైలు జీవితం గడుపుతున్న ఓ కుర్రాడి (రణ్‌వీర్ సింగ్) ని భారత ఏజెంట్ గా ని ఎంపిక చేస్తారు. ఆ కుర్రాడు హంజా అలీ (రణ్‌వీర్ సింగ్) అనే మారు పేరుతో పాక్‌లోని కరాచీకి స్పై ఏజెంట్‌గా వెళ్తాడు. ఆ తర్వాత లయరీ అనే ప్రాంతంలో రెహమాన్ బలోచ్(అక్షయ్ ఖన్నా) నడిపిస్తున్న లోకల్ గ్యాంగ్‌లో చేరతాడు. శత్రుదేశంలో అడుగుపెట్టిన హమ్జా, అక్కడి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూ, వివిధ వ్యక్తులతో తెలివిగా వ్యవహరిస్తూ, ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఐఎస్ఐ లీడర్‌తో స్నేహం చేసే స్థాయికి వెళ్తాడు.
మెల్లిగా ఎవరికీ అనుమానం రాకుండా భారత్‌కు ముప్పుగా మారే శక్తులను ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేయటం మొదలెడతాడు. ఈ ప్రయాణంలో అతడు ఎదుర్కొనే ఛాలెంజ్ లు, ఎదురుదెబ్బలు, నిరాశలు కథకు కీలకంగా నిలుస్తాయి. చివరికి ఈ ఆపరేషన్ భారత్‌కు ఎంతటి కీలకమైనదిగా మారుతుందో చూపించేదే ఈ సినిమా ప్రధాన కథాంశం. అలాగే ఇందులో ఎస్పీ చౌదరి (సంజయ్ దత్) పాత్ర ఏంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.
ఎనాలసిస్ :
ఓ రకంగా ఈ సినిమా చూస్తూంటే మనకు మహేష్ బాబు పోకిరి గుర్తు వస్తుంది. అయితే అక్కడ మహేష్ బాబు ఎవరనేది క్లైమాక్స్ ముందు ట్విస్ట్ గా ఓపెన్ చేస్తారు. ఇక్కడ ఓపెన్ డ్రామా. అలాగే స్పై సినిమాలన్నీ ఓ ఫార్మెట్ లో ఉంటాయి. కానీ ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ‘ధురంధర్’ సాధారణ స్పై థ్రిల్లర్ గా మన ముందు ఉంచదలుచుకోలేదు. ఇది గ్యాంగ్‌స్టర్ డ్రామా, స్పై న్యారేటివ్, నిజ జీవిత రాజకీయ ఘటనలు అన్నింటినీ ఒకే కథలో కలిపిన హైబ్రిడ్ సినిమా. మొదటి ఫ్రేమ్ నుంచే దర్శకుడు ప్రేక్షకుడికి ఒక విషయం స్పష్టంగా చెబుతాడు. ఇది తొందరపడి చూసే సినిమా కాదు. మూడు గంటలన్నర పాటు ఓ పెద్ద కథా ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం. ఆ ధైర్యమే ‘ధురంధర్’కు అసలైన బలం.
కాందహార్ హైజాక్ సీన్‌తో మొదలయ్యే సినిమా ఎనిమిది అధ్యాయాలుగా సాగుతుంది. ప్రతి ఛాప్టర్‌కు ఒక థీమ్, ఒక ఉద్దేశ్యం ఉంటుంది. విడివిడిగా చూస్తే ఇవన్నీ చిన్న కథలలా అనిపిస్తాయి. కానీ చివరికి అవన్నీ కలిసే ఒక పెద్ద పజిల్‌గా మారతాయి. స్క్రీన్‌ప్లేను ఈ విధంగా డిజైన్ చేయడం వల్ల 214 నిమిషాల నిడివి కూడా ఎపిసోడ్‌లా ముందుకు సాగుతుంది. ఇది కేవలం స్టైల్ కోసం చేసిన ప్రయోగం కాదు. కథను భారంగా మారకుండా నడిపించేందుకు తీసుకున్న వ్యూహం అని చూసాక అర్దమవుతుంది.
స్క్రీన్‌ప్లే యాంగిల్‌లో చూస్తే ‘ధురంధర్’ ఒక సాధారణ నేర–గూఢచారి కథ కాదు. ఇది క్లాసిక్ మూడు అంకాల నిర్మాణాన్ని పాటించకుండా, చాప్టరైజ్డ్ ఎపిసోడిక్ స్క్రీన్‌ప్లేను ఎంచుకున్న సినిమా. ఈ ఎంపికే సినిమాను ప్రత్యేకంగా నిలబెడుతుంది, అదే సమయంలో దాని బలహీనతలకు కూడా కారణమవుతుంది.
స్క్రీన్‌ప్లే ప్రారంభంలో దర్శకుడు కథను కాకుండా ప్రపంచాన్ని నిర్మించడంపై దృష్టి పెడతాడు. కాందహార్ హైజాక్ సీన్ ఒక ఇన్సైటింగ్ ఇన్సిడెంట్‌లా పనిచేయదు, అది ఒక టోన్ స్టేట్‌మెంట్. ఈ కథలో వ్యక్తిగత హీరోయిజం కంటే వ్యవస్థలు, రాజకీయ నిర్ణయాలు, వాటి చైన్ రియాక్షన్ ముఖ్యమని మొదటి సీన్ నుంచే స్పష్టం చేస్తుంది.
అందుకే మొదటి అంకంలో కథ ముందుకు పరుగెత్తదు. అది విస్తరిస్తుంది. పాత్రలు ప్రవేశిస్తాయి, శక్తి సమీకరణాలు ఏర్పడతాయి, సంఘటనలు ఒకదానిపై ఒకటి పేరుకుపోతాయి.చాప్టర్లుగా కథను విభజించడం స్క్రీన్‌ప్లేకు రెండు విధాలుగా పని చేస్తుంది. ఒకవైపు, ప్రతి చాప్టర్‌కు ఒక మైక్రో కాన్ఫ్లిక్ట్, ఒక థీమాటిక్ ఫోకస్ ఇస్తుంది. దీంతో మూడు గంటలన్నర కథను మానసికంగా జీర్ణించుకోవడం సులభం అవుతుంది. మరోవైపు, ప్రతి చాప్టర్ ముగింపు పెద్ద డ్రామాటిక్ హుక్‌తో కాకుండా, సమాచారం సమాప్తితో ముగుస్తుంది.
ఇక సినిమా ఫస్టాఫ్ మొత్తం పూర్తిగా సెటప్ కే కేటాయించారు. పాక్ మన మీద దాడి చేయటం, వాటిని తిప్పగొట్టడానికి భారత్ అనుసరించే వ్యూహం. ఆ తర్వాత హమ్జా పాత్ర ఎంట్రీ, ఎదుగుదల, అతని నేపథ్యం, అతని చుట్టూ ఏర్పడే ప్రపంచం అన్నీ డీటెయిల్‌గా చూపిస్తారు. ఇక్కడే కొంత నెమ్మదితనం అనిపిస్తుంది. ఎందుకంటే కథ ఎటు వెళ్లబోతోందో చూసే మనకి ముందే అర్థమవుతుంది. అలాగే స్పై జానర్‌కు అలవాటైన ట్రోప్స్ ఎక్కువగా కనిపిస్తాయి. నిజ జీవిత ఘటనలను ఉపయోగించినా, వాటి నడక కొంత రొటీన్‌గా అనిపిస్తుంది. దాదాపు రెండు గంటల పాటు సాగే ఈ భాగం పూర్తయ్యేసరికి ఇంటర్వెల్ వస్తుంది. అయినా ప్రేక్షకుడు ప్రక్కకు వెళ్లకుండా కథతో కనెక్ట్ అయి ఉండటం దర్శకుడి విజయమే.
సెకండ్ హాఫ్‌లో మాత్రం సినిమా పూర్తిగా గేర్ మార్చేస్తుంది. కథ వేగం పెరుగుతుంది, భావోద్వేగాలు గట్టిగా తాకుతాయి, యాక్షన్ సన్నివేశాలు కథను ముందుకు నడిపిస్తాయి. 26/11 ఎపిసోడ్, రెహమాన్ డకాయిట్ విడుదల, ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుడిని సీట్ అంచుల మీద కూర్చోబెడతాయి. ఈ దశలో మూడు గంటలన్నర నిడివి అసలు గుర్తుకు కూడా రాదు. కథలో పూర్తిగా లీనమైపోతాం.
అయితే మూడు గంటలన్నర నిడివి చివరికి భారంగా అనిపించకపోవడానికి ప్రధాన కారణం స్క్రీన్‌ప్లేలోని లేయరింగ్. ఇది పీక్–వాలీ ప్యాటర్న్‌ను వదిలేసి, స్లో బిల్డ్ నుంచి కంటిన్యూయస్ పే ఆఫ్‌కు వెళ్లే నిర్మాణాన్ని ఎంచుకుంటుంది. మొదటి భాగం కథను నడిపే ఇంజిన్‌ను అసెంబుల్ చేస్తే, రెండో భాగం అదే ఇంజిన్‌ను ఫుల్ స్పీడ్‌లో నడిపిస్తుంది.
ఇక్కడ మరో కీలక అంశం ఈ సినిమా ప్రతిబింబించే రాజకీయ దృక్పథం. ఇది అందరికీ ఒకేలా అనిపించకపోవచ్చు. ఎవరి ఆలోచనల్ని బట్టి మారుతుంది. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. ఈ సినిమాను తీర్చిదిద్దడంలో ఉన్న క్రాఫ్ట్, మేకింగ్, డైరెక్షన్ విజన్‌ని నిర్లక్ష్యం చేయలేం. ఆదిత్య ధర్ ఈ కథను కేవలం చెప్పలేదు, నిర్మించాడు.
స్క్రీన్‌ప్లే పరంగా ఇది ఒక స్టేట్‌మెంట్ ఫిల్మ్. స్పై జానర్‌లో కథ ఎలా చెప్పాలి అన్నదానికంటే, కథను ఎలా నిర్మించాలి అనే ప్రశ్నకు ఇచ్చిన ధైర్యమైన సమాధానం.
టెక్నికల్ గా..
టెక్నికల్‌గా సినిమా చాలా స్ట్రాంగ్. సినిమాటోగ్రఫీ బాగా వర్క్ అయింది. లొకేషన్స్ పెద్ద తెరపై గ్రాండ్‌గా కనిపిస్తాయి, సహజత్వం కూడా ఉంటుంది.
సెట్ వర్క్ చాలా ఇంప్రెసివ్. పాకిస్తాన్ లొకేషన్స్‌ని పూర్తిగా బయటే రీక్రియేట్ చేశారు. రైటింగ్ సింపుల్‌గా, క్లియర్‌గా ఉంది. కథతో బాగా కలిసిపోయింది.
మ్యూజిక్ విషయానికి వస్తే శశ్వత్ సచ్‌దేవ్ పని చాలా బాగుంది. పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు బలం ఇచ్చాయి. కొన్ని సీన్లలో మాత్రం మ్యూజిక్ కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది. పాత పాటలను కొత్తగా వాడిన విధానం బాగుంది, కానీ కొన్ని చోట్ల టోన్ సరిగ్గా కుదరలేదు.
ఎడిటింగ్ ఓకే. ఇంకాస్త కట్ చేసి ఉంటే సినిమా మరింత ఫాస్ట్‌గా ఉండేది. నిడివి కొంచెం తగ్గి ఉంటే బాగుండేది.
మొత్తానికి టెక్నికల్ డిపార్ట్‌మెంట్స్ సినిమా స్థాయిని పెంచాయి.
ఎవరెలా చేసారు?
రణ్‌వీర్ సింగ్ హమ్జా పాత్రలో సినిమాకు వెన్నుముకలా నిలుస్తాడు. చివరి గంటలో అతని పాత్ర పూర్తిగా కథను నడిపిస్తుంది.
ఈ సినిమాలో చిన్న పాత్ర అయినా పెద్ద పాత్ర అయినా ప్రతి ఒక్కరూ గుర్తుండిపోయేలా నటించారు.
అందరిలో అక్షయ్ ఖన్నా ప్రత్యేకంగా మెరిసిపోతాడు. ఆయన నటన ఎనర్జీతో నిండిపోయి ప్రతి సీన్‌ను ఎలివేట్ చేస్తుంది.
గుర్తుండిపోయేలా చేస్తుంది. రాకేష్ బేడి, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్ కూడా తమకు దొరికిన సన్నివేశాల్లో పోటీపడి మరీ చేసారు.
ఫైనల్ థాట్:
మొత్తానికి ‘ధురంధర్’ ఒక ఊరమాస్ స్పై సినిమా కాదు, కానీ కేజీఎఫ్ తరహా ఇంటెన్స్ ప్రపంచాన్ని సృష్టించిన గ్యాంగ్‌స్టర్ కమ్ స్పై డ్రామా. మొదటి భాగంలోని నిడివి, రాజకీయ టోన్‌ని అంగీకరించగలిగితే, రెండో భాగం మాత్రం థియేటర్ అనుభూతిని ఫుల్‌గా ఇస్తుంది. చివరి నిమిషానికి వచ్చేసరికి, ఇది ఒక సినిమా ముగింపు కాదు, తర్వాత వచ్చే భాగంపై ఆసక్తిని రేపే ఆరంభంలా అనిపిస్తుంది. అదే ఈ సినిమాకు దర్శకుడు సాధించిన అతిపెద్ద విజయం.