సినిమా షూటింగ్ లన్నీ బంద్!

కొలిక్కిరాని సినిమా వర్కర్ల వేతనాల వివాదం;

Update: 2025-08-11 11:40 GMT

గత వారం రోజులుగా తెలుగు సినిమా పరిశ్రమలో జరుగుతన్న వేతనాల వివాదం ఇప్పుడు తీవ్రరూపం దాల్చింది. 30% వేతనాల పెంపు డిమాండ్‌తో కార్మిక సంఘాలు సమ్మెకు దిగగా, నిర్మాతలు ఈ ప్రతిపాదనను సూటిగా తిరస్కరిస్తూ వస్తూండటమే ఈ వివాదానికి కారణం. ఇప్పటికే అనేక దఫాలుగా చేసిన పలు చర్చలు విఫలమవ్వడంతో, షూటింగ్‌లు పూర్తిగా నిలిచిపోయాయి.

ఫిల్మ్ ఛాంబర్ ఇప్పటికే నిర్మాతలకు “అనుమతి లేకుండా చిత్రీకరణలు చేయరాదు” అని ఆదేశించడంతో, స్టూడియోలు వెలవెలబోయాయి, ఔట్‌డోర్ లొకేషన్లలోనూ శూన్యత నెలకొంది.

ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు అంతరాయం

ఈ సమ్మె ప్రభావం చిరంజీవి–అనిల్‌ రావిపూడి చిత్రంపైనా , ప్రభాస్‌ ‘ది రాజాసాబ్‌’, రామ్‌చరణ్‌ ‘పెద్ది’, బాలకృష్ణ ‘అఖండ 2’, నాని ‘ప్యారడైజ్‌’, రవితేజ ‘మాస్‌ జాతర’, తేజ సజ్జా ‘మిరాయ్‌’తో పాటు మహేష్‌బాబు–రాజమౌళి, ఎన్టీఆర్–ప్రశాంత్‌ నీల్‌ వంటి పెద్ద బడ్జెట్ చిత్రాలపై పడనుంది. చిన్న సినిమాలు, కొత్త ప్రాజెక్టులు కలిపి దాదాపు 50కి పైగా ప్రొడక్షన్లు నిలిచిపోయాయి.

వాదనల యుద్ధం

కార్మిక సంఘాలు: నిర్మాతలు నటులకు కోట్ల పారితోషికాలు చెల్లిస్తూనే, రోజువారీ కూలీల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.

నిర్మాతలు: నటుల వేతనాలు మార్కెట్ డిమాండ్‌ ఆధారమని, ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో 30% పెంపు భరించడం సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నారు.

మరో ప్రక్క అనేక మంది పెద్ద నిర్మాతలు (Tollywood Producers).. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్‌ (Kandula Durgesh)తో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu Naidu), ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) అపాయింట్‌మెంట్‌ కావాలని మంత్రిని కోరారు. ఈ మేరకు వినతి పత్రం అందించారు. నిర్మాతలతో సమావేశం అనంతరం మంత్రి మాట్లాడారు.

‘‘ ఈ అంశంపై ఫెడరేషన్‌, ఫిల్మ్‌ ఛాంబర్‌ సామరస్యంగా మాట్లాడుకోవాలి. అవసరమైతే సీఎం, డిప్యూటీ సీఎంల దృష్టికి సంబంధిత అంశాన్ని తీసుకెళ్లి చర్చిస్తాం. ప్రభుత్వ జోక్యం అవసరమైతే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయం తీసుకుంటారు. ఏపీలో చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు కృషి చేస్తాం. ఏపీలో ఎవరైనా స్టూడియోలు, రీ రికార్డింగ్ థియేటర్లు, డబ్బింగ్ థియేటర్లు నిర్మించాలని ముందుకు వస్తే ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తాం’’ అని పేర్కొన్నారు.

ప్రముఖుల మౌనం – భవిష్యత్తుపై ప్రశ్నార్థకం

ఈ వివాదంపై నటులు, దర్శకులు, ఇతర సినీ ప్రముఖులు ఎటువంటి స్పందన ఇవ్వలేదు. ఈ రోజు,రేపట్లోగా జరిగే కీలక చర్చలతోనే ఈ సంక్షోభం పరిష్కార దిశగా కదులుతుందా లేదా అనేది తేలనుంది. పరిష్కారం లభించకపోతే, పరిశ్రమకు దీర్ఘకాలిక ఆర్థిక నష్టం తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News