గేమ్ ఛేంజర్ తో రేవంత్ రెడ్డి పెరిగాడా? తగ్గాడా?

రాజకీయ విజ్ఞత ఉన్న నాయకులకు పట్టు-విడుపు ఉండాలి. రేవంత్ రెడ్డి 'గేమ్ ఛేంజర్' సినిమా టికెట్ రేట్లను పెంపుకి, ఉదయం షోలకు అనుమతి ఇవ్వడం అన్నది కొంత ఈ విజ్ఞతకు నిదర్శనమే.;

Update: 2025-01-09 12:46 GMT


తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుష్ప-2 ఉదంతంతో సినిమా పరిశ్రమకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. తగ్గేదేలే అంటూ అసెంబ్లీలో కూడా ప్రజలకు ఇబ్బంది పెట్టేలా సినిమా షోలు ఉంటే వాటిని అనుమతించేదే లేదని కూడా తేల్చేసారు. కానీ ఆ గట్టితనం నెలలోనే మాయమైపోవడాన్ని ఎలా చూడొచ్చు? రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉండటం సహజం,కొంత పట్టు పట్టడం సహజంగా జరిగేదే. కానీ రాజకీయ విజ్ఞత ఉన్న నాయకులకు పట్టు-విడుపు ఉండాలి. రేవంత్ రెడ్డి 'గేమ్ ఛేంజర్' సినిమా టికెట్ రేట్లను పెంపుకి, ఉదయం షోలకు అనుమతి ఇవ్వడం అన్నది కొంత ఈ విజ్ఞతకు నిదర్శనమే.

సినీ పరిశ్రమకు రాజకీయాలకు ఎప్పటినుండో సత్సంబంధాలే ఉన్నాయి. ప్రభుత్వానికి సినీ ఆదాయం కూడా ముఖ్యమైనదే. అలాగే ప్రజలకు కూడా సినిమా మంచి వినోద సాధనం. ఈ నేపథ్యంలో ప్రజలకు ఆ సినిమా వల్ల ఎటువంటి ఇబ్బంది,నష్టం కలగనప్పుడు ఆ సినిమాలకు ఆదరణ తప్పకుండా ఉంటుంది. అలా కాకుండా హీరోలు తమను తాము దేవుళ్ళలా భావించుకుంటూ ప్రేక్షకుల క్షేమం పట్ల నిర్లక్ష్యం వహిస్తే మాత్రం ప్రభుత్వం ఊరుకోదు అన్న సంకేతాన్ని ఇవ్వడానికే రేవంత్ రెడ్డి పుష్ప-2 ఉదంతంలో చాలా గట్టిగా ఉన్నారు. చివరకు అల్లు అర్జున్ దిగి వచ్చి శ్రీతేజను హాస్పటల్ లో పరామర్శించారు.మొత్తానికి ఆయన గట్టితనంతో పెద్ద సినిమాల నటులకు,అలాగే పరిశ్రమకు ఒక హెచ్చరిక చేసారు. కానీ ఈ గొడవను పొడిగించుకుంటూ పోవడం అటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి లాభమా? పోనీ ఇటు ప్రజలకు లాభమా? లేక సినీ పరిశ్రమకు లాభమా?అంటే ఎటువైపు చూసినా మొండిచెయ్యే కనబడుతుంది.పంతం కొద్దీ దీన్ని పెంచడం కంటే ఒక గట్టి హెచ్చరికతో దీన్ని ఒక కొలిక్కి తెచ్చారు రేవంత్ రెడ్డి. తర్వాత సినీ ప్రముఖులు ఆయన్ని కలవడం, కొంత సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళడానికి చేసే కృషికి ప్రభుత్వ సహకారం ఉంటుందని ,అలాగే అందుకోసం కొంత భూమి కూడా ప్రభుత్వం కేటాయిస్తుందని ప్రకటించడం కూడా కొంత ఆయన అటూ సినీ పరిశ్రమకు,ఇటు ప్రభుత్వానికి మధ్య సహృదయ వాతావరణం ఏర్పరచడానికే అని అనుకోవచ్చు.
ఈ టికెట్ రేట్ల పెంపు విషయంలో ప్రభుత్వ సానుకూలత కొందరికి రుచించకపోవచ్చు. కానీ రాజకీయాల్లో రాష్ట్ర మరియు ప్రజల ప్రయోజనాల రీత్యా ఒక వ్యక్తితో లేదా పరిశ్రమతో శాశ్వత శత్రుత్వం పెట్టుకోవడం మంచిది కాదు. ఇప్పటి వరకూ టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్ షోల విషయంలోనూ ప్రజల నుండి వ్యతిరేకత రాలేదు. సినిమాను తమ సాంస్కృతిక జీవితంలో ఒక భాగంగా చూసే ప్రజల ఆమోదం ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా వారికి కష్టం,నష్టం కలిగినప్పుడు గట్టిగా ఉండి ,ఆ ప్రభావం మొత్తం సినీ పరిశ్రమ మీద అలాగే ప్రభుత్వం మీద పడకుండా ఉండటానికి ఉండాల్సిన స్థిత ప్రజ్ఞతే ఈ టికెట్ల పెంపు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటి?


Tags:    

Similar News