నాగచైతన్య ‘తండేల్‌’కథని ఆ నవల నుంచే లిఫ్ట్ చేశారా?

ఎక్కడో చోట ప్రేరణ లేకుండా ఏ కథా రాయలేరు. అది సినిమా కావచ్చు మరొకటి కావచ్చు అని సృజనకారులు తరుచూ చెప్తూంటారు.

Update: 2024-11-07 09:51 GMT

ఎక్కడో చోట ప్రేరణ లేకుండా ఏ కథా రాయలేరు. అది సినిమా కావచ్చు మరొకటి కావచ్చు అని సృజనకారులు తరుచూ చెప్తూంటారు. అయితే ప్రేరణ వేరు, కాపీ వేరు. ప్రేరణ పేరు చెప్పి కాపీ కొడితే మాత్రం దొరికిపోతూంటారు. చాలా సార్లు రెండింటికి తేడా చిన్న గీత మాత్రమే ఉంటుంది. ఈ గీతను దాటే పెద్ద పెద్ద సినిమాలు కాపీ రైట్ వివాదంలో ఇరుక్కున్నాయి. సెటిల్మెంట్ చేసుకున్నాయి. మీకు గుర్తుందో లేదో గతంలో మ‌హేశ్ బాబు, కొర‌టాల శివ కాంబినేష‌న్ లో వ‌చ్చిన శ్రీ‌మంతుడు సినిమాపై కూడా కాపిరైట్స్ కేసు న‌మోదైంది.

స్వాతి పత్రికలో ప్రచురించిన కథను కొరటాల కాపీ చేసి శ్రీమంతుడు మూవీ తెరకెక్కించారంటూ రచయిత శరత్‌ చంద్ర హైదరాబాద్‌ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు కొరటాల శివపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో నాంపల్లి కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ కొరటాల తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో విచారణ సందర్భంగా కథను కాపీ కొట్టారనేందుకు ఉన్న ఆధారాలను హైకోర్టుకు రచయిత శరత్ చంద్ర అందజేశారు. దీంతో ఆయ‌న‌పై చ‌ర్య‌ల‌ను స‌మ‌ర్థించింది హైకోర్టు. ఇది పక్కన పెడితే... నాగచైతన్య తాజా చిత్రం ‘తండేల్‌’కథ మాత్రం ఓ నవల నుంచి ప్రేరణ పొందారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే రైట్స్ తీసుకుని చేశారా లేక సిమిలర్ ఐడియానా అనేది తెలియాల్సి ఉంది. అసలు నవల్లో ఏముంది. సినిమా పాయింట్ ఏమిటనేది చూస్తే...

అల్లు అరవింద్‌ సమర్పిస్తున్న ‘తండేల్‌’ దేశభక్తి అంశాలతో నిండిన రా రస్టిక్‌ ప్రేమకథతో తెరకెక్కుతోంది. నాగ చైతన్య ఇందులో రాజు అనే మత్స్యకారుడి గా కనిపించనున్నారు. న్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇంతకు ముందెప్పుడూ చేయని సరికొత్త పాత్రలో చైతు.. సాయిపల్లవి డీగ్లామర్‌ లుక్స్‌లో కనిపించనుండడంతో దీనిపై అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ డీల్‌ పూర్తయింది. చైతూ కెరీర్‌లోనే అత్యధికంగా రూ.40 కోట్లకు ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) మూవీ రైట్స్‌ను దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం కథ గురించి ఓ ఆసక్తికరమైన విషయం ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

 

‘మున్నీటి గీత‌లు’ అనే నవల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతుంది అని చెప్పుకుంటున్నారు. చింత‌కింది శ్రీ‌నివాస‌రావు ఈ నవలా రచయిత. మృత్య‌కారుల జీవనశైలి ని ఆధారం చేసుకుని ఈ నవలని రచించారు. ఈ నవలలో .... పోలారావు ప్రధాన పాత్ర. చేపల వేటకు వెళ్లి వచ్చే డబ్బుతో జీవిస్తుంటాడు. బాగా డబ్బు సంపాదించి త‌న భార్య‌ ఎల్లమ్మని బాగా చూసుకోవాల‌న్నది అతని కల. దీని ఓసారి చేపల వేట కోసం గుజ‌రాత్ లోని అరేబియా స‌ముద్రానికి తెలియకుండా వెళ్ళిపోతాడు. ఇతనితో పాటు గ్రామస్తులు, తోటి జాలర్లు కూడా..! అయితే ఓ సందర్భంలో వీళ్ళు తప్పిపోతారు.

ఆ సమయంలో పాకిస్థాన్ సైన్యం కొంతమందిని బోర్డర్ దాటి వచ్చారని అరెస్ట్ చేసి చిత్ర హింసలకు గురిచేస్తుంది. అందులో పోలారావు కూడా ఉంటాడు. ఆ తర్వాత పోలారావు, అతని ఊరికి చెందిన వాళ్ళు ఎలా బయటపడ్డారు? చివరికి పోలారావ్.. ఎల్లమ్మని కలుసుకున్నాడా? లేదా? అనేది మిగిలిన కథ. ‘మున్నీటి గీత‌లు’ కి తానా పురస్కారం కూడా లభించింది.

ఇక ‘తండేల్‌’కథ కూడా దాదాపు ఇలాంటిదే అని తెలుస్తోంది. అందులో హీరో క్యారెక్టర్ తండేలుగా కనిపిస్తాడు. బోట్స్ నడిపే వారిని 'తండేలు' అని అంటారు. అది చాలా పాత పదం. గుజరాత్‌ లోని సూరత్ లో ఒక వ్యక్తి నిజ జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా ఈ సినిమా కథ ఉంటుందని చెప్తన్నారు. ఇది ఒక అందమైన ప్రేమకథని.. ఊహించని ట్విస్టులు టర్న్స్ ఉంటాయని నిర్మాత చెప్తున్నారు. అలాంటి బోట్ డ్రైవర్ క్యారెక్టర్ లో చైతన్య నటించనున్నారు. సినిమా అంతా ఫిషర్ మ్యాన్స్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. దీని కోసం దర్శకుడు చాలా రీసెర్చ్ చేశారు. అలాగే ఈ కథలో కూడా బోర్డర్ దాటి హీరో, అతని సన్నిహితులు పాకిస్తాన్ నేవికి చిక్కుతారని, అతని కోసం అతని భార్య పోరాటం చేస్తుందని వినికిడి.

అయితే ‘మున్నీటి గీత‌లు’ అనే నవల చదివి ఈ కథ రాసుకున్నారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. కానీ ఖచ్చితంగా తమ కథకు దగ్గరగా ఉండే సినిమాలు, పుస్తకాలు పరిశీలిస్తారనేది నిజం. ఇక ‘మున్నీటి గీత‌లు’ అనే నవల వెబ్ సీరిస్ గా చేస్తున్నారని తెలుస్తోంది. అయితే సినిమానే ముందు వచ్చేలా ఉంది. నవల నుంచి తీసుకుని ఉంటే మాత్రం ఖచ్చితంగా క్రెడిట్ ఇవ్వాలి.

Tags:    

Similar News