‘దేవర’ ఈవెంట్ రద్దు.. ఇదంతా ప్రమోషన్స్‌లో పార్టేనా..!

‘దేవర’ ప్రీరిలీజ్ ఈవెంట్ రద్దుకు శ్రేయస్ మీడియా చేతకాని తనమే కారణమని అభిమానులు మండిపడుతున్నారు. కానీ ఇదంతా ప్రమోషన్స్‌లో భాగమేనన్న వాదనా వినిపిస్తోంది.

Update: 2024-09-23 07:49 GMT

జూనియర్ ఎన్టీఆర్ జాన్వీ కపూర్ జంటగా నటించిన సినిమా దేవర. కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రానుందని మూవీ టీమ్ ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నెవ్వర్ బిఫోర్ అనేలా నిర్వహించాలని భారీగా ప్లాన్ చేసింది మూవీ టీమ్. ఈ సినిమాపై ఉన్న అంచనాలు, ఎన్‌టీఆర్ క్రేజ్‌కి ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ చేయాలని ఫ్యాన్స్ అనుకున్నారు. దీంతో భారీ సంఖ్యలో ఈ వెంట్‌ను నిర్వహిస్తున హెచ్ఐసీసీ నోవాటెల్‌కి వరదలా విచ్చేశారు. దీంతో అక్కడ భద్రత అదుపు తప్పింది. చేసేదేమీ లేదని.. ఈవెంట్ రద్దు చేసుకోవాలని పోలీసులు సూచించడంతో మూవీ టీమ్ కూడా చేసేదేమీ లేక.. ఈ ఈవెంట్‌ను రద్దు చేసుకుని వెనుతిరిగింది.

శ్రేయాస్ మీడియాకు ఈవెంట్స్ ఇవ్వొద్దు: అభిమానులు

అయితే ‘దేవర’ ప్రీరిలీజ్ ఈవెంట్ రద్దు కావడనికి నిర్వాహక సంస్థ శ్రేయస్ మీడియా చేతకాని తనమే కారణమని అభిమానులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. చేతకానప్పుడు పక్కకు తప్పుకుని సమర్థులకు పని అప్పగించాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నావాటెల్‌లో జరుగతున్న పెద్ద ఈవెంట్ ఇదొక్కటే కాదని, గతంలో మరెన్నో పెద్దపెద్ద ఈవెంట్‌లకు కూడా నోవాటెల్ వేదికగా నిలిందని చెప్తున్నారు. కానీ దేవర ఈవెంట్ నిర్వాహకులు ఆలోచనాపాలోచన లేకుండా ఇష్టానుసారంగా అనుమతికి మించిన సంఖ్యలో పాస్‌లు ఇచ్చేయడం, ముందస్తు భద్రత ప్రమాణాలు పాటించడం కూడా సరిగా లేదని అభిమానులు చెప్తున్నారు. పరిమితికి మించి పాస్‌లు ఇవ్వడంతో అభిమానులు నోవాటెల్‌కు పోటెత్తారు. అంతేకాకుండా లోపలికి వచ్చిన అభిమానులు పాస్‌ల ప్రకారం కూర్చోకుండా ఎక్కడ పడితే అక్కడ దొరిందే ఛాన్స్ అన్నట్లు కూర్చుండిపోయారు.. వారిని అడ్డుకోవడంలో కూడా నిర్వాహకులు విఫలమయ్యారు. పార్టీషన్ చేయడం కూడా సరిగా రాలేదు నిర్వాహకులకు. భారీ సంఖ్యలో వచ్చిన ఫ్యాన్స్ అదుపు చేయడానికి సరిపడా భద్రతను కూడా రెడీగా ఉంచుకోలేదు. సాధారణంగానే మూవీ ఈవెంటల్స్ అంటే కేవలం పోలీసులపై ఆధారపడకుండా.. ప్రైవేట్ సెక్యూరిటీని కూడా సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విషయంలో కూడా నిర్వాహాకులు నిర్లక్ష్యం వహించారు. దీని వల్ల అక్కడ గందరగోళం ఏర్పడి.. ఈవెంట్ రద్దయిందని అభిమానులు వివరిస్తున్నారు. ఈ సందర్భంగా మరే ఇతర సినిమా నిర్మాతలు కూడా తమ సినిమా ఈవెంట్స్ సక్సెస్ అవ్వాలంటే ఈవెంట్ నిర్వహణ బాధ్యతను శ్రేయస్ మీడియాకు ఇవ్వొద్దని కూడా ఎన్‌టీఆర్ అభిమానులు విజ్ఞప్తి చేశారు.

వాళ్లను తప్పుబట్టడం సరికాదు: ఎన్‌టీఆర్

‘దేవర’ ప్రీరిలీజ్ ఈవెంట్ రద్దు కావడంపై ఎన్‌టీఆర్ స్పందించారు. ఈ వెంట్ రద్దు కావడం వల్ల అభిమానుల కన్నా తానే ఎక్కువగా బాధపడుతున్నానని అన్నాడు. అభిమానులతో సమాయాన్ని గడపాలని కోరుకున్నానని, కానీ అది జరగకపోవడం చాలా బాధిస్తుందంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘‘అభిమానులతో సమయం గడపాలనుకున్నా. దేవర సినిమా గురించి, దాని కోసం పడిన కష్టం గురించి చెప్పాలనుకున్నా. అది ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో చేయాలని ఈ ఈవెంట్‌ కోసం ఎంతో ఆశగా, ఆత్రుతగా ఎదురుచూశా. కానీ ఈ ఈవెంట్ రద్దు కావడం చాలా బాధిస్తుంది. ఈ రద్దుకు నిర్మాతలను, ఈవెంట్ ఆర్గనైజేషన్‌ను తప్పుబట్టడం సరికాదు. మీ అభిమానానికి జీవితాంతం రుణపడి ఉంటా. ఈ రోజున కుదరకపోయినా.. ఈ నెల 27న థియేటర్లలో కలుసుకుందాం. సినిమాను కూడా ప్రతి ఒక్కరూ కాలర్ ఎగరేస్తారని నమ్మకంగా ఉన్నా. ఆ ఆనందాన్ని నేను మాటల్లో వర్ణంచలేను. ఈ సినిమా కోసం కొరటాల ఎంతో కష్టపడ్డారు. అన్నికంటే ముఖ్యంగా మీ ఆశీర్వాదం మాకు కావాలి. మీరంతా జాగ్రత్తగా ఉండండి’’ అని ఎన్‌టీఆర్ చెప్పుకొచ్చాడు.

ఇది నా తొలి అడుగు: జాన్వీ

దేవర సినిమా గురించి హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా ఒక వీడియోను విడుదల చేశారు. తెలుగు సినిమాలోకి ‘దేవర’ తన తొలి అడుగు అని చెప్పుకొచ్చారు. ‘‘అందరికీ నమస్కారం.. నన్ను ఇంతగా ఆదరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. బయట మనిషిని అన్నట్లుగా కాకుండా తొలి సినిమాతోనే మీ మనిషిలా నన్ను ట్రీట్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. మా అమ్మ మీకు ఎంత ముఖ్యమో నాకు బాగా తెలుసు. మా అమ్మకు, నాకు కూడా మీరు అంతే ముఖ్యం. నన్ను సపోర్ట్ చేస్తున్న మీరంతా గర్వపడేలా ప్రతి రోజూ కష్టపడతాను. మా అమ్మను ఆదరించిన.. అతిలోక సుందరిగా చూసిన ఈ తెలుగు సినీ రంగంలో నా తొలి అడుగు వేయడానికి సహకరించిన మూవీ టీమ్‌కు, నన్ను సెలక్ట్ చేసిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ పాటలను ప్రీరిలీజ్ ఈవెంట్‌లో మీకు ప్రత్యక్షంగా చెప్పాలని అనుకున్నా. కానీ ఈవెంట్ రద్దు కావడంతో సోషల్ మీడియా వేదికగా చెప్తున్నా. కానీ అతి త్వరలోనే మీ అందరినీ కలుస్తాను’’ అని జాన్వీ చెప్పుకొచ్చింది.

అందుకే ఇలా అయింది: మేకర్స్

‘‘ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాం. ఏళ్ల తరబడి రాత్రింబవళ్లు శ్రమించాం. ప్రీరిలీజ్ ఈవెంట్ రోజు కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూశాం. దాదాపు ఆరేళ్ల తర్వాత ఎన్‌టీఆర్ మళ్ళీ సోలోగా చేస్తున్న సినిమా కావడంతో ‘దేవర’ ప్రీరిలీజ్‌ను గ్రాండ్‌గా చేయాలని కలలు కన్నాం. కానీ ఈ ఈవెంట్ నిర్వహణ విషయంలో అడుగడుగా సవాళ్లు ఎదుర్కొన్నాం. ప్రీరిలీజ్ ఈవెంట్.. గణేష్ నిమజ్జనానికి చాలా దగ్గర డేట్స్‌లో షెడ్యూల్ చేయబడింది. ఇలాంటి ఈవెంట్‌ల ప్రిపరేషన్స్‌కే వారం రోజులు పడుతుంది. దీనికి తోడు కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు కూడా అడ్డంకులు సృష్టించాయి. ఈరోజు వర్షం పడకపోయినా.. మేము ప్లాన్ చేసినట్లు బహిరంగ కార్యక్రమం నిర్వహించడానికి పరిస్థితులు అనుకూలించలేదు. అయినా ఎంతో ప్రయత్నించాం. అభిమానులు సునామీలా రావడంతో బ్యారికేడ్లు కూడా వినిగిపోయాయి. అందరి భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈవెంట్‌ను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. మీ ప్రియతమ హీరోను చూడటానికి సుదూర ప్రాంతాలను వచ్చారని తెలుసు. కానీ తప్పని పరిస్థితుల్లో గుండె రాయి చేసుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇందుకు చింతిస్తూ మీకు క్షమాపణలు చెప్తున్నాం. అదే విధంగా అందరూ ఇళ్లకు సురక్షితంగా చేరుకున్నారని ఆశిస్తున్నాం’’ అని ఎక్స్(ట్విట్టర్) వేదికగా మేకర్స్ ఓ పోస్ట్ పెట్టారు.

నెగిటివ్ ప్రమోషన్స్ చేస్తున్నారా?

‘దేవర’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ రద్దుపై అనేక అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇదేమీ శ్రేయస్ మీడియా నిర్వహిస్తున్న తొలి పెద్ద సినిమా ఈవెంట్ కాదు. శ్రేయస్ మీడియా ఎన్నో బడాబడా సినిమాలకు ఈవెంట్‌లను నిర్వహించింది. శ్రేయస్ మీడియా టాలెంట్‌కు మెచ్చే పక్క రాష్ట్రాల వాళ్లు కూడా తమ సినిమా ఈవెంట్స్‌ను వీరికి అప్పగిస్తుంటారు. అంత రిపిటేషన్ ఉన్న ఈవెంట్ ఆర్గనైజేషన్.. ‘దేవర’ సినిమా ఈవెంట్‌ను హ్యాండిల్ చేయడంలో విఫలమైందని చెప్పడం కష్టమే. ఇదంతా కూడా ప్రమోషన్స్‌లో భాగంగా అంతా అనుకునే చేశారని, ఈవెంట్ రద్దు కావడం వల్ల.. సినిమా రిలీజ్ వరదకు ప్రేక్షకుల మధ్యే సినిమా పేరు నడుస్తుందని పక్కా ప్లాన్ ప్రకారమే.. ఈవెంట్‌ను క్యాన్సిల్ అయ్యేలా చేశారని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అన్ని పెద్ద ఈవెంట్‌లను నిర్వహించిన సంస్థకు అదనపు ప్రైవేట్ సెక్యూరిటీ కావాలని తెలియకుండా పోదని, కానీ ప్లాన్ ప్రకారం ఈవెంట్‌ను రద్దు దిశగా నడిపించడానికే ‘దేవర’ ప్రీరిలీజ్‌కు ఎటువంటి ప్రైవేట్ సెక్యూరిటీ తీసుకోలదేని ఇంకొందరు చెప్తున్నారు. అంతేకాకుండా ఈ ఈవెంట్ విషయంలో శ్రేయస్ మీడియా చేసిన తప్పులన్నీ కూడా బేసిక్‌గా కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన వారు కూడా చేయరని, అలాంటిది ఇంత ఎక్స్‌పీరియన్స్ ఉన్న శ్రేయస్ మీడియా తనకు చేతకాక ఇలా చేసిందని చెప్పడం కాస్తంత విడ్డూరంగానే ఉందని విమర్శలు కూడా వస్తున్నాయి. దీంతో పాటుగా ఈవెంట్ రద్దుకు ఆర్గనైజేషన్ సంస్థను కానీ నిర్మాతలను కానీ తప్పుబట్టడం సరికాదంటూ ఎన్‌టీఆర్ ప్రత్యేకంగా చెప్పడం మరీ విచిత్రంగా ఉందని కూడా కొందరి వాదన. అసలు ఆ టాపిక్ ఎత్తకపోయినా ఏమీ ఉండేది కాదని, తమ ప్లాన్ వల్ల శ్రేయస్ మీడియా రిప్యుటేషన్‌ దెబ్బతినకూడదన్న ఆలోచనతోనే ఎన్‌టీఆర్ ఇలా అన్నారని కూడా కొందరు అంటున్నారు. దాంతో పాటుగా గణేష్ నిమజ్జనం వంటి పెద్దపెద్ద ఈవెంట్‌ల డేట్స్‌కు అతి దగ్గర్లోనే ప్రీరిలీజ్ ఈవెంట్‌ డేట్ ఫిక్స్ చేశామని, ఇలాంటి వాటికి కనీసం వారం రోజుల సమయం పడుతుందని, అందువల్లే ఇది ఫెయిల్ అయిందని మూవీ మేకర్స్ చెప్తున్నారు. అది కూడా సరైన కారణంగా లేదని అభిమానులు కొట్టిపారేస్తున్నారు. మరి దీనిపై మూవీ టీం క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

Tags:    

Similar News