‘కంగువ’ ఓపెనింగ్స్: అబ్బుర పరిచే విషయాలివే...
డిస్ట్రిబ్యూషన్ లో ఉన్న సమస్యతో రిలీజ్ అవ్వకముందే ఊహించిన స్థాయి బుకింగ్స్ కైవసం చేసుకోవడంలో సూర్య ఫ్యాన్స్ ని కూడా నిరాశపరిచిందా?
By : The Federal
Update: 2024-11-14 00:48 GMT
-శృంగవరపు రచన
తమిళ సినిమాల్లో పాన్ ఇండియా రేసులో గట్టిగా నిలబడిన సినిమాలు బాలీవుడ్, టాలీవుడ్ లతో పోలిస్తే పెద్దగా లేవనే చెప్పొచ్చు.ఆ లోటును భర్తీ చేస్తామన్న ప్రకటనతో వచ్చిన సినిమానే ‘కంగువ.’
టెరిఫిక్ ప్రమోషన్స్ ఓ పక్క ...
ట్రెమండస్ మేకింగ్ ను స్పష్టం చేసే ట్రైలర్ ఇంకోపక్క ...
వీటికి తోడు తెలుగు ప్రేక్షకులతో సూర్య ఎమోషనల్ గా కనక్ట్ అయ్యేలా ఈ సినిమా గురించి మాట్లాడటం, అనేక షోలలో, ఈవెంట్స్ లో సూర్య కనిపిస్తూనే ఉండటం వంటి అంశాల వల్ల ‘కంగువ’ మీద టాలీవుడ్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందులోనూ తమిళ సినిమా హీరోల హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా స్టార్ హీరోలైతే భారీగా వారి సినిమాలు ఇక్కడ విడుదల చేసే సంస్కృతి ఎప్పటినుండో ఉంది. అందుకే రాయన్, భారతీయుడు-2, గోట్, వేట్టయాన్ లాంటి సినిమాలకు ఇక్కడ పెద్ద తెలుగు సినిమాల స్థాయి గౌరవం దక్కింది. భారతీయుడు-2 పెద్ద డిజాస్టర్ అయినా దాని వలన ‘తమిళ సినిమా ఆకర్షణ’ ఏ మాత్రం తగ్గిన ఛాయలు కనబడలేదు.
‘కంగువ పరిస్థితి’ ఈ సినిమాలకు కొంత భిన్నం. దాదాపు 350 కోట్ల భారీ బడ్జెట్ తో వచ్చిన సినిమా. ఇప్పుడు గురి తప్పకుండా సక్సెస్ ని కొట్టే పీరియాడిక్ కథ, యుద్ధ నేపథ్యంతో వచ్చిన సినిమా. వీటికి తోడు బాలీవుడ్ స్టార్ బాబి డియోల్ కూడా ప్రధాన పాత్రలో ఉన్న సినిమా. ఇన్ని సక్సెస్ రూట్స్ తో ఎక్కడా ఫెయిల్ అయ్యే అవకాశం లేకుండా పకడ్బందీగా ఉన్న సినిమా ఇది.
సినిమా బావుండటం వేరు, కమర్షియల్ హిట్ అవ్వడం వేరు. కమర్షియల్ హిట్ కి కావాల్సింది ప్రమోషన్స్ తో వచ్చే హైప్, ఆ హైప్ వల్ల వచ్చే భారీ ఓపెనింగ్స్. ఇవి ఉంటే సినిమా కమర్షియల్ హిట్ అయిపోతుంది. ఈ ఫార్ములా నుండి చూస్తే కంగువ కమర్షియల్ హిట్ అయ్యే సినిమానే అని ఎవరైనా ఊహించేస్తారు. వీటికి అదనపు ఆకర్షణలుగా మన టాలీవుడ్ దేవిశ్రీప్రసాద్ సంగీతం. తమిళనాడులో పుట్టినా శివ తెలుగులో దర్శకత్వం వహించి తమిళం వైపు మళ్ళినా, ‘కంగువ’ కు తెలుగు నేపథ్యం శివ, దేవి శ్రీ ప్రసాద్ వల్ల కొంత బలపడిందనడంలో అతిశయోక్తి లేదు.
ఈ హైప్ తర్వాత దశ సినిమా విడుదల అయ్యే రోజును నిర్ణయించుకోవడం. మామూలు సినిమాలు శుక్రవారం విడుదల అయితే పెద్ద సినిమాలను గురువారం విడుదల చేయడం కూడా ఒక ట్రెండ్. ఆ తర్వాత ఉదయం ఒంటిగంటకు, నాలుగు గంటలకు టికెట్ల రేట్లు పెంచి రిలీజ్ చేయడం కమర్షియల్ సక్సెస్ కు దోహదం చేసే అంశం. ఇక్కడ వరకు సినిమా వస్తే చాలు ఇక అది టాక్ తో సంబంధం లేకుండా కమర్షియల్ హిట్ అయిపోతుంది.
కంగువ ఈ దశలో కూడా దాదాపు సక్సెస్ అయిన సూచనలే కనిపించాయి. తమిళనాడులో ఉదయపు షోల వల్ల జరిగిన ప్రమాదంలో మరణం సంభవించడంతో అక్కడ మార్నింగ్ షోలకు అనుమతి లేదు. అక్కడ షోలు ఉదయం తొమ్మిది నుండి మొదలైనా, ఇక్కడ హైదారాబాద్ లో మాత్రం ఉదయం నాలుగు గంటల షోలు ఉన్నట్టు ఎప్పుడో అనౌన్స్ చేశారు. ఇక నాలుగు గంటల షోలు, పెద్ద సినిమా అంటే ఒక అయిదారు రోజుల ముందు నుండే హడావుడి ఉంటుంది. కానీ కంగువ ఓపెనింగ్స్ లో అది కనిపించలేదు. ఇంకో పక్క స్ట్రెయిట్ తెలుగు సినిమా ‘మట్కా’ కు ముందు నుండే ఓపెనింగ్స్ వచ్చాయి. ఆఖరికి గురువారం రిలీజ్ ఉన్నా, బుధవారం వరకూ కూడా కంగువ ఓపెనింగ్స్ లో క్లారిటీ లేదు.
ఇక ఓపెనింగ్స్ విషయానికి వస్తే, కొన్ని సందర్భాలలో ఇక్కడ జరిగే మ్యాజిక్ ప్రేక్షకులను సినిమా సక్సెస్ కి ట్యూన్ చేస్తుంది. ఎక్కువ షోలు కనబడటం, కనబడిన ఐదు నిమిషాలలోపే అన్నీ ఫిల్ అయిపోయినట్టు కనబడటం ఇవన్నీ పరోక్షంగా ఓ డిమాండ్ ని క్రియేట్ చేస్తాయి. ఈ మ్యాజిక్ సినిమా రిలీజ్ రోజు, తర్వాత రెండు రోజులు ఉన్నా చాలు కమర్షియల్ హిట్ అయిపోతుంది సినిమా. ఈ దశలోనే చావు దెబ్బ పడింది కంగువకి. హైదరాబాద్‌లో డిస్ట్రిబ్యూటర్స్‌తో ఏషియన్ సినిమాకి డీల్ కుదరక పోవడంతో అడ్వాన్స్ బుకింగ్ ముందుగా ప్రారంభం కాలేదు.ఉదయం షోల విషయంలో మేకర్స్ నుండి ఏ రకమైన స్పష్టత రాలేదు.డిస్ట్రిబ్యూషన్ సమస్యలే ఈ సినిమాను ఈ స్టేజ్ లో ఫెయిల్ అయ్యేలా చేశాయి. సరే సినిమా బావున్న టాక్ వచ్చినా , తర్వాత ఉండే బుకింగ్స్ కమర్షియల్ హిట్ స్థాయిలో ఉంటాయన్న భరోసా ఉంటుందని చెప్పలేము. నిజానికి పీరియాడిక్ సినిమా ఏది వచ్చినా వాటికి ఉండే మినిమమ్ గారంటీ కూడా కంగువ అడ్వాన్స్ బుకింగ్స్ లేకపోవడం వల్ల కోల్పోయింది. అందులోనూ చిన్న సినిమాల నుండి పెద్ద సినిమాల వరకూ ప్రీమియర్స్ పడే ఏసియన్ అల్లుఅర్జున్ సినిమాస్ (AAA ), ఏ ఎమ్ బి లు 'కంగువ'కి బుధవారం రాత్రి వరకూ స్క్రీన్స్ కన్ఫర్మ్ చేయకపోవడం, మార్నింగ్ నాలుగింటి షోస్ క్యాన్సిల్ అవ్వడం కూడా బుకింగ్స్ ని ప్రభావితం చేశాయి.ఎలాగో ఈ సమస్యలు సద్దు మణిగినా,బుధవారం రాత్రి వరకూ సరైన షోస్ షెడ్యూల్ లేకపోవడంతో కొంత ఈ గజిబిజి వల్ల సినిమా విడుదల మీద కూడా సందేహాలు ఏర్పడ్డాయి.
సినిమా మొదలైనప్పటి నుండే అనేక అడ్డంకులు ఎదుర్కొన్న 'కంగువ' చివరి వరకూ యుద్ధప్రాతిపాదికన సక్సెస్ మ్యాప్ ని అనుసరించినా, పెద్ద సినిమాలకు అరుదుగా తప్ప ఎదురవ్వని డిస్ట్రిబ్యూషన్ ఉన్న సమస్యతో ప్రి రిలీజ్ భారీ బుకింగ్స్ కైవసం చేసుకోవడంలో సూర్య ఫ్యాన్స్ ని కూడా నిరాశపరిచింది.
మొత్తం మీద స్టార్ హీరో, స్టార్ కాస్టింగ్, భారీ సినిమా, పైకెత్తే ప్రమోషన్స్ ఎన్ని ఉన్నా సినిమా ఓపెనింగ్స్ మ్యాజిక్ జరగకపోతే ప్రేక్షకులకు ఓ రకమైన రాంగ్ సిగ్నల్ వెళ్తుందన్న హెచ్చరికే ‘కంగువ’ సినిమా!