'కౌసల్యా సుప్రజా రామా' OTT మూవీ రివ్యూ!
ఓటీటీ లలో డబ్బింగ్ సినిమాలకు లోటు ఉండటం లేదు. మలయాళ, తమిళ,కన్నడ, హిందీ డబ్బింగ్ సినిమాలు తెలుగులోకి వచ్చేస్తున్నాయి.;
ఓటీటీ లలో డబ్బింగ్ సినిమాలకు లోటు ఉండటం లేదు. మలయాళ, తమిళ,కన్నడ, హిందీ డబ్బింగ్ సినిమాలు తెలుగులోకి వచ్చేస్తున్నాయి. ఆ క్రమంలో రెండేళ్ల క్రితం కన్నడలో మంచి వసూళ్లనే రాబట్టిన ఈ చిత్రం తెలుగులో 'ఈటీవీ విన్' ద్వారా అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా కథేంటి, అసలు అక్కడ అంత బాగా ఆడటానికి కారణం ఏమిటి,తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే కంటెంట్ ఉన్న చిత్రమేనా?
కథేంటి
ఈ కథ మూడు పాత్రలు చుట్టూనే ఎక్కువగా తిరుగుతుంది. రామ్ (డార్లింగ్ కృష్ణ) స్త్రీ ద్వేషి. తాగుబోతు తండ్రి సిద్ధ గౌడ ( రంగయన రఘు) పెంపకం అతన్ని అలా చేసేస్తుంది.తల్లి కౌసల్య (సుధ బెళవాడి) మాత్రం అతనంటే ప్రాణం పెడుతుంది. రామ్ ఆమెకు పెద్దగా పట్టించుకోడు. తాగుతు,తిరుగుతూ జీవితం గడుపుతున్న అతని లైఫ్ లోకి శివాని (బృందా ఆచార్య) వస్తుంది. అయితే ఆమెకు రామ్ ఏటిట్యూడ్ నచ్చదు. దాంతో ఆమె బై చెప్పేసి వెళ్లిపోతుంది. రామ్ మళ్లీ ఒంటరి అవుతాడు.
ఈలోగా రామ్ తల్లి కౌసల్య (సుధా బెలవాడి) మరణిస్తుంది. ఆమె చనిపోయాక తల్లి విలువ తెలుస్తుంది. దాంతో తన తల్లి చనిపోయే ముందు చూసిన సంబంధమని.. పెళ్లిచూపులు కూడా లేకుండా ముత్తులక్ష్మి (మిలనా నాగరాజ్)తో రామ్ ఏడడుగులు వేస్తాడు. అయితే అక్కడ మరో ట్విస్ట్ పడుతుంది. ముత్తులక్ష్మి అతన్ని మించిన యాటిట్యూడ్ తో ఉంటుంది. కానీ ఆ క్రమంలో అతని జీవితం పెద్ద ప్రతిబంధకంగా మారుతుంది. అయితే ఓ సంఘటనతో అతనిలో మార్పు వస్తుంది. ఆమెతో ఎందుకు సర్దుకుపోవాల్సి వస్తుంది, ఆ సంఘటన ఏమిటి? పురుషాహంకారం ఉన్న తండ్రికి ఏమయ్యాడు?అన్నది మిగతా కథ (Kousalya Supraja Rama Story).
ఎలా ఉంది
లింగ వివక్ష అనేది మన సమాజంలో ఇంకా పోలేదు. కేవలం తాను మగవాడినన్న కారణంగా మహిళలను మానసికంగా ఎంత బాధపడతారో కళ్లకు కట్టినట్టు చూపెట్టే ప్రయత్నం చేసాడు దర్శకుడు. అయితే సినిమా కాస్త పాత వాసనలు వస్తుంది. ఎక్కువ సెంటిమెంట్ ప్రధానంగా నడుస్తుంది. ఫస్టాఫ్ సరదాగా నడిచిన పోయినా, సెకండాఫ్ కు వచ్చేసరికి ఎమోషన్ సీన్స్ పై బాగా దృష్టి పెట్టారు. ఓ పుస్తకం చదువుతున్నట్లుగా అనిపిస్తుంది. తల్లి ప్రేమ, తండ్రి నిరాదణ ఎలా ఉంటుందో, తల్లి లేనప్పుడు ఎలాంటి మానసిక క్షోభ ఎదురవుతుందో నొక్కి చెప్పారు. అయితే సందేశం కాస్తంత మోతాదు మించినట్లే కనిపిస్తుంది. సినిమా చూశాక మనకు తెలిసిన కథే మన ముందు ఉంచారనే భారమైన ఫీలింగ్ వస్తుంది.
ఫస్టాఫ్ లో ఫన్ కు ఇచ్చిన ప్రయారిటీ సెకండాఫ్ లో ఇస్తే బాగుండేది. అలాగే కొన్ని సీన్స్ పూర్తి సినిమాటిక్ గా ఉంటాయి. ముఖ్యంగా స్త్రీ ద్వేషి అయిన హీరో ప్రేమలో పడే ఎపిసోడ్స్ పండలేదు. ఆ సీన్స్ కన్విన్సింగ్‌గా అనిపించవు. తల్లి జ్ఞాపకాలతో భార్యను తన దారిలోకి ఎలా తీసుకొచ్చాడనేది చెప్పాలనే విషయం ఇంకాస్త నీట్ గా చెప్పచ్చు అనిపిస్తుంది. ప్రతీదానికి తాగుడే పరిష్కారం అన్నట్టు కొన్ని సీన్స్ రావటం విసుగ్గా అనిపిస్తుంది. అయితే అది కన్నడ ప్రేక్షకుల కోసం తీసింది. మనం డబ్బింగ్ చూస్తున్నాము అనుకుంటే ఇబ్బంది అనిపించదు. ఏదైమైనా ఏమోషన్స్ పై దృష్టి పెట్టిన దర్శకుడు మరింత ఎంగేజింగ్ గా, ఎంటర్టైనింగ్ గా కథ చెప్పి ఉంటే బాగుండేది. మన వాళ్లకు కూడా బాగా నచ్చేది. క్లైమాక్స్ మాత్రం హృదయాన్ని హత్తుకుంటుంది. అది నమ్మే చేసినట్లున్నారు.
టెక్నికల్ గా
ఈ సినిమాలో అందరూ కన్నడ నటులే . అయినా మనకు కొత్తగా అనిపించదు. కాసేపటికి అలవాటు పడిపోతాం. వారి పెర్ఫామెన్స్‌తో మనకి దగ్గరవుతారు. సుగుణన్ సినిమాటోగ్రఫీ .. అర్జున్ జన్య బ్యాక్ గ్రౌండ్ స్కోర్, .. గిరి మహేష్ ఎడిటింగ్ సినిమా కథకు, బడ్జెట్ కు తగ్గట్లే ఉన్నాయి. లెంగ్త్ రెండున్నర గంటలు ఇలాంటి కథకు అనవసరం అనిపిస్తుంది. ఎడిటింగ్ తెలుగు వెర్షన్ అయినా చేసి ఉంటే బాగుండేది.
చూడచ్చా
సెంటిమెంట్ తో నిండిన ఈ సినిమా కుటుంబంతో చూడదగ్గదే. ఎలాంటి అసభ్యకర సన్నివేశాలు లేవు. ఈ వీకెండ్‌కు ఇది ప్రయత్నించొచ్చు.
ఎక్కడ చూడచ్చు
ఓటీటీ ‘ఈటీవీ విన్’లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది.