ఆస్కార్‌కు ‘లాపతా లేడీస్’
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్‌రావు దర్శకత్వం వహించిన ‘లాపతా లేడీస్’ అరుదైన ఘనత సాధించింది.
By : The Federal
Update: 2024-09-23 12:05 GMT
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్‌రావు దర్శకత్వం వహించిన ‘లాపతా లేడీస్’ అరుదైన ఘనత సాధించింది. 2025 ఆస్కార్‌కు మనదేశం నుంచి ఎంపికైంది. ఈ విషయాన్ని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధికారికంగా ప్రకటించింది. స్పర్శ్ శ్రీవాత్సవ, నితాన్షి గోయెల్, ప్రతిభ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
2025 మార్చి 2న ఆస్కార్ అవార్డుల వేడుక అమెరికాలోని లాస్ ఎంజల్స్‌లో జరుగనుంది. మునుపెన్నడూ లేనంతగా ఈ ఏడాది అస్కార్ నామినేషన్ల కోసం భారత్ నుంచి తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, మరాఠీ భాషలకు చెందిన 29 చిత్రాలను 13 మందితో కూడిన కమిటీ సభ్యులు షార్ట్‌లిస్ట్ చేశారు. అందులో ‘లాపతా లేడీస్’ సినిమాకే అందరూ మొగ్గు చూపారు.
చిత్రకథ..
అప్పుడే కొత్తగా పెళ్లి చేసుకున్న దీపక్ భార్యతో కలిసి రైలులో తమ గ్రామానికి బయలుదేరుతారు. తమ స్టేషన్‌లో రైలు దిగుతూ అనుకోకుండా తన భార్య అనుకుని అదే రైలులో ప్రయాణిస్తున్న మరొకరి భార్యను తీసుకుని ఊరికి వెళ్లిపోతాడు. తర్వాత నిజం తెలుసుకున్న దీపక్ తన అసలు భార్య కోసం వెతకడం, అప్పటి వరకు తన వెంటే ఉన్నభర్త ఉన్నఫలంగా మాయమవడంతో దీపక్ భార్య ఓ రైల్వేస్టేషన్‌లోనే వేచి చూస్తూ ఉండడం చుట్టూ కథ సాగుతుంది. అసలు దీపక్ తీసుకువచ్చిన ఆ వధువు ఎవరు? అమె అతనితో ఎందుకు కలిసి వచ్చింది? ఆమె భర్త ఎవరు? పోలీస్ స్టేషన్‌కు చేరిన కథ ఎన్ని మలుపులు తిరిగిందనేది ఆసక్తికరంగా చిత్రీకరించారు.