వెళ్ళిపోయిన నిన్నటి వెన్నెల

అందాల తార కాంచనమాల;

Update: 2025-07-18 07:42 GMT

బాగా పాతకాలం నాటి మాట. తొంభై సంవత్సరాల క్రితం తెలుగు వెండితెర మీద మెరిసిన నటి. పేరు కాంచనమాల. ఊరు తెనాలి. గుంటూరు జిల్లా. 1935 లో తొలి సినిమాలో నటించింది. ఆమె అందమూ, నవ్వూ, ముఖంలో భావాలను పలికించే తీరు అందర్నీ ఆకట్టుకున్నాయి. అప్పట్లో ఒక సినిమాకి ఆమె పారితోషకం పదివేల రూపాయలు. 1973-74 లో తీసిన షోలే సినిమాకి అమితాబ్ రెమ్యునరేషన్ లక్ష రూపాయలు మాత్రమే. కాంచనమాల సినిమాకి పదిపన్నెండు వేలు తీసుకుంటున్న సమయంలో బస్తా బియ్యం మూడు రూపాయలు. మొదటి సినిమా శ్రీకృష్ణతులాభారం(1935), వీర అభిమన్యు (1937),విప్రనారాయణ (1937), మాలపిల్ల (1938)తో ఆమె తెలుగు సినీ పెద్దల్నీ, ప్రేక్షకుల్నీ వెర్రెత్తించింది. కాంచనమాలని కలలరాణి అని గ్లామర్ క్వీన్ అని కీర్తించారు. ఆమె అప్పటి హేమమాలిని. ఆనాటి శ్రీదేవి,ఆ కాలపు మాధురి దీక్షిత్. శ్రావ్యమైన గొంతుతో పాట పాడేది. కళ్ళ వెలుగుతో, వెన్నెల విరబూసే చిరునవ్వుతో జనాన్ని ఒక మైకంలో ముంచెత్తేది. కుర్రాళ్ళేవరికి నిద్రపట్టకుండా చేసిన నిశాచరి కాంచనమాల. సౌందర్య పిశాచది.

1917 మార్చి5 న తెనాలి అయితానగర్ లో పుట్టిన కాంచనమాల తండ్రి దాసరినారాయణ దాసు. తల్లి మాణిక్యమ్మ.

1933 ప్రాంతంలో ఒక విశేషం జరిగింది. మహానుభావుడు చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు ఒక నాటక ప్రదర్శనకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆ రోజుల్లో ఆడది వేదికలెక్కి నాటకం వేయడం ఒక దారుణమైన అపచారం. చిలకమర్తి ‘సారంగధర’ నాటకంలో చిత్రాంగి పాత్రకి ఒక స్త్రీ కావలెను అని ఆయన పత్రికాప్రకటన యిచ్చారు. నాటకాలకు హార్మోనిస్టు అయిన కాంచనమాల తండ్రి పదహారేళ్ళ కూతుర్ని తీసుకుని తెనాలి నుంచి రాజమండ్రి వెళ్ళారు. నాటకం చూడ్డానికి జనం విరగబడ్డారు. తొలిసారి తెలుగు నాటక రంగం మీద స్త్రీ పాత్రని, ఒక స్త్రీయే వేయడం ఇదే మొదటిసారని చిలకమర్తి ప్రకటించారు. “ప్యారిస్ లో మాదిరిగా తెనాలి స్త్రీలకు స్వేచ్చ ఎక్కువ. అందుకే స్త్రీ పాత్రలో నటించడానికి తెనాలి నుంచి వచ్చి నటించింది”అన్నారాయన. తెనాలిని ఆంధ్రాప్యారిస్ అనడానికి యిదొక్కటే కారణం అని నాటి పెద్దలు చెబుతుంటారు. జాజితీగలాంటి కాంచనమాల చిత్రాంగిగా మిలమిల మెరిసింది. నాటకం జనాన్ని వూగించింది. ఆమె మద్రాస్ మెయిల్ ఎక్కడానికి అదే తొలి మెట్టు.

పెద్దనటిగా పేరు తెచ్చుకుంటున్న రోజులవి. 1938లో రెండు అద్భుతాలు జరిగాయి. కాంచనమాల వేశ్య పాత్రలో ‘గృహలక్ష్మి’ విడుదలైంది. దర్శకుడు హెచ్.ఎం.రెడ్డి సహాయ దర్శకుడు బి.ఎన్.రెడ్డి. ప్రొడక్షన్ కంట్రోలర్ కేవీరెడ్డి. ఇక సూపర్ స్టార్ డమ్ కి ఒక్క అడుగు దూరంలోనే ఉంది కాంచనమాల. ఆ ఏడాది 1938 లోనే సెప్టెంబర్ 25 న సనాతన చాదస్తాల్ని తుత్తునియలు చేస్తూ ‘మాలపిల్ల’ బాంబులా పేలింది. ఈ సినిమాకి ఒకటి కాదు వంద ప్రత్యేకతలు వున్నాయి. గుడిపాటి వెంకట చలం రాసిన ‘మాల పిల్లలు’ అనే కథ ఈ చిత్రానికి ఆయువుపట్టు. గూడవల్లి రామబ్రహ్మం అనే తిరుగుబాటుదారుడు నా సినిమాపేరు ‘మాలపిల్ల’అన్నాడు. మహావీరుల్ని యుద్ధరంగంలోకి దింపాడు. కథ,సంభాషణలు:గుడిపాటి వెంకట చలం. స్క్రీన్ ప్లే,తాపీ ధర్మారావు నాయుడు. పాటలు: బసవరాజు అప్పారావు,తాపీ ధర్మారావు. సంగీతం: తెనాలికి చెందిన భీమవరపు నరసింహారావు. దర్శకత్వం: ది గ్రేట్ గూడవల్లి రామబ్రహ్మం. తెనాలికే చెందిన డాక్టర్ గోవిందరాజుల సుబ్బారావుకి ఇదే తొలి చిత్రం. ఒకేసారి పన్నెండు కేంద్రాల్లో విడుదలైంది ఈ సినిమా. అప్పట్లో అన్ని థియేటర్లలో విడుదల కావడం మాటలు కాదు. మాలపిల్ల తెలుగు జిల్లాల్లోనే కాకుండా దక్షిణాదిన అన్ని భాషా ప్రాంతాల్లోనూ సూపర్ హిట్టయ్యింది. కాంచనమాల స్టార్ హీరోయిన్ గా ఎస్టాబ్లిష్ అయింది. కథలో పల్లెటూరి అమ్మాయి అయిన మాలపిల్ల ఒక బ్రాహ్మణ యువకుణ్ణి పెళ్ళి చేసుకుని కలకత్తా పారిపోతుంది. అక్కడ సిటీ షోకులు నేర్చుకుంటుంది. స్లీవ్ లెస్ జాకెట్, భుజమ్మీదికి వాల్జడ, చెవులకి రింగులు, చేతిలో కాఫీ కప్పు, చురుకైన చూపు, వొంపు పెదవుల కెంపుతో జనం మతిపోగొట్టే గెటప్ లో కాంచనమాల కాంతులీనింది. ఆ ఆధునిక యువతి ఫోటో ముద్రించిన కేలండర్ చాలా ఇళ్ళ గోడల మీద ఉండేది. మాలపిల్ల గొప్ప సినిమాగా గూడవల్లికీ,కాంచనమాలకీ కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టింది. ఆ ఏడాది 11 సినిమాలు విడుదల అయితే తొమ్మిది పౌరాణికాలు. కాంచనమాల నటించిన గృహలక్ష్మి,మాలపిల్ల సాంఘికాలు. ఈ రెండూ కనీ వినీ ఎరుగని విజయం సాధించాయి. ప్రేక్షకుల గుండెల్లో సౌందర్యరసాధిదేవతగా కాంచనమాలని ప్రతిష్టించాయి.

1939 లోనూ రెండు విజయాలు దక్కించుకుంది. వాహినీ వారి ‘వందేమాతరం’(మంగళసూత్రం)25 వారాలు ఆడి రజతోత్సవం జరుపుకుంది. అందులో చిత్తూరు నాగయ్య సరసన కాంచనమాల గొప్పనటి అని నిరూపించుకుంది. ‘మళ్ళీ పెళ్ళి ’తో అదే ఏడాదే మరో సూపర్ హిట్ సాధించింది. 1935 ఒక సినిమా ఖర్చు 30 వేలు వుంటే, 1940 నాటికి అది రెండు లక్షలకు పెరిగింది. 1942 లో ఒక విశేషం జరిగింది. దక్షినాది చిత్రరంగాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలని జెమినీ స్టూడియో వ్యవస్థాపకుడు ఎస్.ఎస్.వాసన్ పట్టుదలతో వున్నారు. దాని కోసం నటీనటులు,సాంకేతిక నిపుణులతో నాలుగైదు సంవత్సరాలకి అగ్రిమెంట్ చేసుకున్నారు. జీవిత భాగస్వామి గాలి వెంకయ్య అనారోగ్యంతో కలవరపడిన కాంచనమాల కొన్నేళ్ళ భరోసా కోసం ఒప్పందంపై సంతకం పెట్టింది. వరసగా నాలుగు సినిమాల్లో నటించడానికి ఆమెకి 25 వేలు అడ్వాన్స్ గా యిచ్చారు. సక్సెస్ తలకెక్కిన కాంచనమాల,షూటింగ్ లో టెక్నిషియన్లు, ఇతర నటీనటులపై విసుక్కోవడం,కోప్పడడం చేసేదని కొన్ని పత్రికలు రాశాయి. విషయం తెలిసిన వాసన్ కాంచనమాలని మందలించారు. అప్పుడు ఆమె వాసన్ ని కొట్టిందని పుకార్లు వున్నాయి. అలా ‘బాల నాగమ్మ’ సినిమా నిర్మాణం కొంతకాలం ఆగిపోయింది. ఆ కోపంతో వాసన్, లక్ష రూపాయల జరిమానా చెల్లించాలని ఆమెకి లీగల్ నోటిసులు పంపించారు. మనస్తాపం చెందిన కాంచనమాల వాసన్ తో రాజీపడి, బాలనాగమ్మ పూర్తి చేసింది. చిత్రం రికార్డులు తిరగరాసింది. వాసన్ కి కుప్పలుగా లాభాలు వచ్చిపడ్డాయి.

గాలి వెంకయ్య ఆరోగ్యం క్షీణించడంతో ఆయన్ని తీసుకుని కాంచనమాల తెనాలి వెళ్ళింది. కొన్ని నెలల్లోనే ఆయన మరణించారు. ఈ విషాదం,సినిమా ఫీల్డ్ లో తనకి అన్యాయం జరిగిందనే బాధ ఆమెని కుంగదీశాయి. తెనాలిలో తన యింట్లో ఒంటరిగా మిగిలిపోయింది. తలుపులు వేసుకుని ఏకాంతంగా అయిదేళ్ళు విచారంగా వుండిపోయింది. ఆమెకి మతిస్థిమితం లేదని జనం అనుకున్నారు. మళ్ళి సినిమాల్లో నటించాలని అనేకమంది వొత్తిడి చేశారు.తెనాలి సత్యనారాయణ టాకీస్ నిర్వాహకుడు శివలింగ ప్రసాద్ తో వార్సాస్ కి వెళ్ళింది. ‘మా యిద్దరికీ పెళ్ళయింది’ అని 1948 లో ఒక పత్రికకు యిచ్చిన ఇంటర్వ్యూ లో కాంచనమాల చెప్పింది. వీళ్ళు సినిమా తీద్దాం అనుకున్నారు. పాత గొడవలు మర్చిపోయి కలిసి పనిచేద్దాం అని వాసన్ అడిగినా ఆమె ఒప్పుకోలేదు.

1948 లో శివలింగప్రసాద్ ,నెల్లూరులో మైకా వ్యాపారం చేస్తున్న తెనాలికి చెందినా ధనవంతుడు గోగినేని వెంకట సుబ్బయ్యలు ‘అనాధ బాల’ అనే చిత్రం తలపెట్టారు. ఎల్.వి.ప్రసాద్ దర్శకుడు. ఆ సినిమా ఆగిపోయింది. తెనాలిలో అభిమానులు అడిగారని 1949 సెప్టెంబర్ 30 న తెనాలి స్వరాజ్ టాకీస్ లో ‘సక్కుబాయి’ నాటకంలో నటించింది. అదే ఆమె చివరిసారి కనిపించడం. ఇంట్లోనే ఒంటరిగా,దిగులుగా,మౌనంగా వుండిపోయింది. 1963 లో చిన్ననాటి స్నేహితురాలు,రాజ్యం పిక్చర్స్ అధినేత శ్రీధర్ రావు భార్య,నటి లక్ష్మీ రాజ్యం కోరికపై, ‘నర్తనశాల’ సినిమాలో ఒక చిన్న వేషం వేసింది. అంతే,ఆమె తెర జీవితం సమాప్తమయింది.

1975లో హైదరాబాద్ లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో కాంచనమాలకి అరుదైన గౌరవం దక్కింది. సినీతార జమున ఆమెని సత్కరించారు. 1977 లో గూడవల్లి రామబ్రహ్మం వర్ధంతి సభలో జైహింద్ స్టూడియో అధినేత మన సత్యం (ముసునూరి వెంకట సత్యనారాయణమూర్తి)కాంచనమాలను ఘనంగా సన్మానించారు.

కాంచనమాల సోదరి కుమార్తె రమా మంజుల,ఆమె భర్త ప్రసాద్ చివరిదాకా ఆమె మంచిచెడ్డలు చూశారు. 1981 లో మద్రాసులో కాంచనమాల మరణించారు. కాంచనమాలకి చదువులేదనీ, కోపిష్టి అనీ, గొడవలు పెట్టుకునేదనీ చెప్పిన పెద్దలే గానీ, మద్రాసు ‘మగ’సినీ రంగం ఆ అందాలనతికి ఎలాంటి నరకం చూపిందో చెప్పినవాడు ఒక్కడూ లేడు.

కాంచనమాల జీవితం గురించి తెలుగులో మూడు పుస్తకాలు వచ్చాయి.

1. మెహబూబ్ నగర్ సినీ స్పెషలిస్టు, సీనియర్ జర్నలిస్టు హెచ్.రమేష్ బాబు పదేళ్ళ క్రితం మొదటిపుస్తకం తెచ్చారు.

2. తెనాలికి చెందిన సీనియర్ జర్నలిస్టు, నా మిత్రుడు బి.ఎల్.నారాయణ ఆమె గురించి విశేషాలతో, గుర్తుంచుకోదగిన విషయాలతో 2018 లో పుస్తకం తెచ్చారు.

3. మనసు ఫౌండేషన్ కి చెందిన సినీ ప్రేమికుడు పారా అశోక్ కుమార్ అరుదైన ఫోటోలతో, ‘తెలుగు సినిమా డ్రీమ్ గర్ల్ కాంచనమాల’ అనే వంద పేజీల పుస్తకం ప్రచురించారు.

తొలినాటి తెలుగు సినిమాకి తన అందంతో,అభినయంతో పరిమళం అద్దిన కాంచనమాల అనుపమానమైన ప్రేమాభిమానాలు పొందారు భారత స్వాతంత్ర్యోద్యమ కాలం నాటి ఒక తరాన్ని ఆమె ప్రభావితం చేశారు. కొన్ని మరపురాని చిత్రాల్ని మనకి కానుకగా యిచ్చి వెళ్ళారు. 

Tags:    

Similar News