గుంటూరు కారం : మూవీ రివ్యూ

కొంచెం కారం, కొంచెం వెటకారం, కాసింత మమకారం వెరసి " గుంటూరు కారం"

Update: 2024-01-12 11:12 GMT
Source : X

 --సలీమ్ బాషా


ఎట్టకేలకు సినిమా వచ్చేసింది.!!మహేష్ బాబు కు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఇది ముచ్చటగా మూడో సినిమా. మొదటి రెండు సినిమాల్లో ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ "అతడు" సినిమా దాదాపుగా సూపర్ హిట్. తర్వాత తీసిన కామెడీ, ఫాంటసీ, యాక్షన్ తో కూడిన "ఖలేజా" కొంత పర్వాలేదు. ఇప్పుడు యాక్షన్ థ్రిల్లర్ గా తీయాలనుకొని, సగం తీసిన తర్వాత అంతా పక్కకు పెట్టి తీసిన సినిమా " గుంటూరు కారం". ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి ఎన్నో మార్పులు, చేర్పులు. ముఖ్యంగా హీరోయిన్ పూజ హెగ్డే సినిమా లో ఉందని కొన్నిసార్లు.. లేదని కొన్నిసార్లు వార్తలు వచ్చిన తర్వాత చివరాఖరికి ఈ సినిమాలో ఆమె లేదు. ఈమధ్య బాగా పాపులర్ అయిన శ్రీ లీల ఆమె స్థానం తీసుకుంటే, శ్రీ లీల స్థానాన్ని మీనాక్షి చౌదరి తీసుకుంది. స్క్రిప్ట్ ఎన్నిసార్లు మారిందో త్రివిక్రమ్ కే తెలియాలి. ఎంత ఖర్చైనా పర్వాలేదు, పర్ఫెక్ట్ గా రావాలని పట్టుబట్టే త్రివిక్రమ్ శ్రీనివాస్, ఈ సినిమా తీయడానికి చాలా టైం తీసుకున్నాడు. ఈ సినిమాకి దాదాపు నాలుగు సంవత్సరాలు తీసుకున్న త్రివిక్రమ్ సినిమా ఎలా ఉంటుందో అని, ప్రేక్షకులతో సహా పరిశ్రమ మొత్తం ఎదురు చూసింది. 2024 సంక్రాంతి బరిలో దిగిన నాలుగు పెద్ద సినిమాల్లో ఇది ముందు రిలీజ్ అయింది. ( రవితేజ హీరోగా నటించిన ఇంకో సినిమా " ఈగల్" బరి నుంచి తప్పుకుని, ఫిబ్రవరి కి వెళ్ళింది) 2020లో త్రివిక్రమ్ సినిమా "అలవైకుంఠపురంలో" జనవరి 12 వ తేదీన విడుదలైంది. ఇప్పుడు గుంటూరు కారం కూడా జనవరి 12వ తేదీన విడుదల కావడం విశేషం!

సినిమా ఫార్ములా పాతదే...

ఈ సినిమా గురించి చెప్పాలంటే కథ కొత్తది ఏమి కాదు. అందులో త్రివిక్రమ్ కి కొత్త కాదు. తనని వదిలిపెట్టి పోయిన తల్లి , బాధపడుతున్న తండ్రి. ఓ అత్తయ్య, మామయ్య, గుంటూరులో పెద్ద మిర్చి వ్యాపారి అయిన హీరో ప్రేమ కథ, , కొంత కామెడీ, ఊహించని ఒకటి రెండు ట్విస్టులు, మాడ్రన్ ఫైట్లు కలిపి అల్లిన కథ. తల్లి కొడుకు ఎలాగూ కలుస్తారని తెలుసు. . అయితే ఎలా అనేది చివర్లో తెలుస్తుంది. తల్లి కొడుకుని ఎందుకు వదిలిపెట్టిపోయిందో అన్నది కూడా చివర్లోనే తెలుస్తుంది. ఇది పెద్ద సస్పెన్స్ ఏమీ కాదు.

అయితే,

ఇక్కడ ఈ సినిమాను చూడదగ్గదిగా మలిచిన అంశాల్లో మొదటిది మహేష్ బాబు. సరికొత్త మాస్ పాత్రలో దాదాపు ఇమిడిపోయాడు. ఇదివరకటి సినిమాల్లో సాఫ్ట్ గా ఉండి రఫ్ గా తయారయ్యే మహేష్ బాబు, ఇందులో మొదటి నుంచి రఫ్ గా ఉంటాడు. చెప్పాలంటే తనది కానీ జోనర్లో మహేష్ బాబు బాగానే చేశాడు అని చెప్పాలి. హీరోయిన్ శ్రీ లీల గురించి చెప్పాలంటే ఆమె డాన్సులు గురించే చెప్పాలి. ఈ మధ్యకాలంలో అంత ఎనర్జీతో డాన్స్ చేసే హీరోయిన్లు కనపడటం లేదు. మహేష్ బాబు " శ్రీ లీలతో డాన్స్ చేయడం చాలా కష్టం.. హీరోల డొక్క చిరిగిపోద్ది" అన్నాడు అంటే అర్థం చేసుకోవచ్చు. అమ్మాయికి మరో ప్లస్ పాయింట్ అందంగా ఉండడం. ఈ సినిమాలో నటించే ప్రయత్నం కూడా చేసింది. పాస్ మార్కులు వచ్చాయని చెప్పొచ్చు. అయినా సమంతతో మూడు సక్సెస్ ఫుల్ సినిమాలు తీసిన త్రివిక్రమ్ ఈసారి శ్రీ లీలను హీరోయిన్ గా తీసుకున్నాడు ఎందుకో మరి? యూత్ ఆడియన్స్ కోసం కావచ్చు.


ఇక సాంకేతిక పరమైన అంశాలు..

చెప్పాలంటే పరమహంస ఫోటోగ్రఫీ బావుంది. ఎడిటర్ నవీన్ నూలి సినిమాని ఇంకొంచెం బాగా ఎడిట్ చేసి ఉండొచ్చు. ఓ 20 నిమిషాల దాకా సినిమాని కట్ చేసి ఉంటే ఇంకా కొంచెం బాగుండేదేమో అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే దర్శకుడు కూడా కొన్ని సన్నివేశాలని బాగా ప్రేమించేసి ఎక్కువగా తీశాడు. పాటల్లో కుర్చీ పాట.. ఆల్రెడీ హిట్ అయింది. కొంత వివాదానికి కూడా గురైంది. త్రివిక్రమ్ సినిమాల్లో సాధారణంగా డబల్ మీనింగ్ డైలాగులు ఉండవు.

అలవైకుంఠపురం హ్యాంగోవర్

ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకులకు త్రివిక్రమ్ గతంలో తీసిన అత్తారింటికి దారేది(కొంతమంది ప్రేక్షకులు సరదాగా ఈ సినిమా గురించి చెప్పమంటే " అమ్మ ఇంటికి దారేది" అని చెప్పారు), అల వైకుంఠపురం లో సినిమాలు గుర్తుకొస్తే అది వాళ్ళ తప్పు కాదు. 2020లో వచ్చిన అలా వైకుంఠపురం సినిమా హ్యాంగోవర్ నుంచి త్రివిక్రమ్ ఇంకా బయటపడలేదు అనిపిస్తుంది. కాకపోతే ఈ సినిమా తీసిన పద్ధతి కొంచెం వెరైటీగా ఉండడం ఒక అంశం అయితే, రెండోది మహేష్ బాబు. ఇది పూర్తిగా మహేష్ బాబు సినిమా. అలాగని దర్శకుడిని తక్కువ చేయలేం. సరికొత్త మాస్ పాత్రలో మహేష్ బాబు పాస్ అయినట్లే. గతంలో " అతడు" సినిమాలో త్రివిక్రమ్ డైలాగులకు మహేష్ బాబు కొంత అడ్జస్ట్ కావడానికి టైం తీసుకున్నాడు. అయితే ఖలేజ లో బాగానే అడ్జస్ట్ అయ్యాడు. త్రివిక్రమ్ సినిమాల్లో హీరో కొంత వెటకారం, హీరోయిన్ ను ఏడిపించడం, లేదా టీజ్ చేయడం(ఇవి కొంచెం ఎక్కువ అయ్యాయి).త్రివిక్రమ్ మొదటి సినిమా స్వయంవరం నుంచి మనం చూస్తున్నాం. ఖలేజా లో అనుష్కను టీజ్ చేసిన మహేష్ బాబు, ఈ సినిమాలో విశ్వరూపం చూపించాడు. అది ఒక కొత్త అంశం. తెలుగు సినిమా క్లైమాక్స్ ఒక ఫైట్ తో ఎండ్ అయ్యి, అందరూ కలిసి గ్రూప్ ఫోటో దిగడం మామూలే. అత్తారింటికి దారేది సినిమాలో ఆ సంప్రదాయాన్ని పక్కనపెట్టి డైలాగులతో సినిమా క్లైమాక్స్ ని నడిపించాడు త్రివిక్రమ్. ఇందులో కూడా అంతే. నాలుగేళ్ల క్రితం వచ్చిన అలవైకుంఠపురంలో డైలాగుల మాయ చూపించలేదని ప్రేక్షకులు ఫీలయ్యారు. డైలాగ్ కింగ్, గురూజీ అని పేరు పొందిన త్రివిక్రమ్ ఈ సినిమాలో కొంతవరకు దాన్ని సరి చేసుకున్నాడు. మరోసారి తను ఎందుకు డైలాగ్ కింగ్ అయ్యాడో ఇందులో చూపించాడు . " నేను అమ్మను కలవడానికి వెళ్లాను.. అమ్మ మీదకు వెళ్లాలనుకోలేదు", " వాడు పైకి మాత్రమే కరకు.. లోపల మాత్రం చెరుకు", " నాకు సమస్యకు పరిష్కారం అర్థం కాలేదు. నీకు సమస్య అర్థం కాలేదు" అన్న డైలాగులు బాగానే పండాయి.

కామెడీ ట్రాక్ వన్నెతెచ్చింది

ఈ సినిమాలో కామెడీ కూడా బాగానే ఉంది. ఈమధ్య ఫైట్లలో కామెడీ, విలన్లతో కామెడీ పెద్ద సినిమాల్లో కనపడుతుంది. ఇక్కడ కనబడింది.. చాలా వరకు నవ్వించింది. వెన్నెల కిషోర్ కామెడీ గురించి పెద్దగా చెప్పవలసిన అవసరం లేదు. తనదైన టైమింగ్ తో కామెడీని పండించగలిగినవాడు అతను ఒక పక్కా ప్రొఫెషనల్. ఏ పాత్రకైనా వన్నెలు తెచ్చే వెన్నెల కిషోర్.

ఇతర నటీనటులలో ప్రకాష్ రాజ్ గురించి చెప్పేదేముంది. అది అతనికి వన్ అఫ్ ది ఆఫీస్ డేస్. రొటీన్ వ్యవహారం. రావు రమేష్ మంచి నటుడు అయినా పెద్దగా చేసేదేం లేదు. రాహుల్ రవీంద్ర చాలా చిన్న పాత్రలో నటించాడు?. బాహుబలి తర్వాత రమ్యకృష్ణ నటన గురించి పెద్దగా డౌట్స్ లేవు. . కానీ తల్లిగా ఆమె పాత్రను మలిచిన తీరు సరిగ్గా లేదు. ఈశ్వరి రావు మంచి నటి. ఇందులో కూడా బాగా చేసింది. ముఖ్యంగా చివర్లో రమ్యకృష్ణ ని కలిసినప్పుడు ఆమె చూపించిన నటన టాప్ క్లాస్. మీనాక్షి చౌదరి గురించి పెద్దగా చెప్పడానికి లేదు. మంచి ఈజ్ ఉన్న నటి అయినప్పటికీ పెద్దగా రోల్ లేదు. మిగతా పాత్రల్లో ఇద్దరు అజయ్ లు(సాధారణంగా విలన్ వేషాలు వేస్తారు) కామెడీ పండించడానికి సరిపోయారు. సినిమా ప్రారంభంలోనే ఒక లెవెల్ లో జగపతిబాబుని ఇంట్రడ్యూస్ చేసిన త్రివిక్రమ్ తర్వాత అతన్ని ఒక కమెడియన్ ని చేశాడు. సహాధ్యాయి, చిన్ననాటి మిత్రుడు సునీల్ కి తన సినిమా ల్లో ప్రాముఖ్యమున్న పాత్రనే ఇచ్చేవాడు. అయితే ఇందులో ఓ చిన్న పాత్రతో సరిపెట్టాడు.

ఇంతకీ ఏ జానర్ మూవీ

ఈ సినిమా నడిపించిన క్రమం చాలాచోట్ల దారి తప్పడానికి కారణం, దీన్ని ఏ జానర్ లో తీయాలనేది స్పష్టంగా తేల్చుకోలేకపోవడం. చివరకు దీన్ని ఒక ఫ్యామిలీ, ఎమోషనల్, పొలిటికల్ ఎంటర్టైనర్ గా తీయాలనుకున్నప్పటికీ ఎక్కువ సమయం పట్టడం, స్క్రిప్టును రెండు మూడుసార్లు మార్చడం, సినిమా స్పష్టత లేకపోవడానికి కారణమయ్యాయి. ఎన్నో అంచనాలు, ఆలస్యాల మధ్య విడుదలైన “గుంటూరు కారం” , అంత కారం లేకపోయినా రుచి చూడొచ్చు.

తారాగణం:

మహేష్ బాబు, రమ్యక్రిష్ణ, ప్రకాష్ రాజ్, శ్రీలీల, మీనాక్షి చౌదరి, జగపతిబాబు, సునీల్

రచన ,దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్

సంగీతం: తమన్ ఎస్

ఛాయాగ్రహణం: పరమహంస, పి.ఎస్.వినోద్

కూర్పు: నవీన్ నూలి

నిర్మాత :ఎస్.రాధాకృష్ణ

నిర్మాణ సంస్థ: హారిక అండ్ హాసినీ క్రియేషన్స్

విడుదల తేదీ:2024 జనవరి 12

బడ్జెట్ :సుమారు ₹200 కోట్లు

Tags:    

Similar News